కార్మికుల సంక్షేమం కోసం కృషి

కార్మికుల సంక్షేమం కోసం కృషి - Sakshi


కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ

 

 హైదరాబాద్: ఎన్డీయే ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తుందని.. ఇందులో భాగంగానే అసంఘటిత రంగ కార్మికులను ఈఎస్‌ఐసీ పరిధిలోకి తీసుకురానున్నామని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. శనివారం గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని సీతారాంబాగ్‌లో ఈఎస్‌ఐసీ డిస్పెన్సరీ, 100 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కార్మికులకు మెరుగైన సేవలు అందించేందుకు తెలంగాణలోనే అతిపెద్ద మొట్టమొదటి సూపర్ స్పెషాలిటీ ఈఎస్‌ఐసీ ఆస్పత్రికి కేంద్ర ప్రభుత్వం రూ. 100 కోట్లు కేటాయించిందన్నారు. హైదరాబాద్ పాతనగరంలోని సుమా రు 5 లక్షల మందికి ఈ ఆస్పత్రిలో కార్పొరేట్ వైద్యసేవలు అందించనున్నామన్నారు.



కేంద్ర కార్మికశాఖ ఆధ్వర్యంలో రెండు కొత్త చట్టాలను కూడా అమలులోకి తేనున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ...  కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్లతో ఆస్పత్రిని ఏర్పా టు చేయడం హర్షణీయమన్నారు.  రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ జిల్లాల్లో అధ్వానంగా ఉన్న ఈఎస్‌ఐసీ ఆస్పత్రులను పునరుద్ధరించాలన్నారు. రాష్ట్రంలో అన్ని ఈఎస్‌ఐసీ డిస్పెన్సరీలను పది పడకల ఆస్పత్రులుగా మారుస్తున్నామని కేంద్రమంత్రి ప్రకటించడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో గోషామహల్ ఎమ్మెల్యే టి. రాజాసింగ్‌లోథ, ఎమ్మెల్సీలు కె. జనార్దన్‌రెడ్డి, సయ్యద్ అమీన్ ఉల్ హసన్ జాఫ్రీ, ఎస్. ప్రభాకర్‌రావు, ఈఎస్‌ఐసీ మెడికల్ కమిషనర్ ఆర్.కె. కటారియా, డెరైక్టర్ డాక్టర్ సి.హెచ్. దేవికారాణి, రీజనల్ డెరైక్టర్‌లు ఆర్.ఎస్. రావు, పి.కె. జైన్, మాజీ ఎమ్మెల్యేలు ప్రేమ్‌సింగ్‌రాథోడ్, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top