కదం తొక్కిన ఆశ వర్కర్లు

కదం తొక్కిన ఆశ వర్కర్లు - Sakshi


♦ వేలాదిగా తరలివచ్చి... డిమాండ్ల సాధనకు ఉద్యమించి

♦ అడుగడుగునా అడ్డుకున్న పోలీసులు

♦ యుద్ధ వాతావరణాన్ని తలపించిన నగరం

♦ వెలల్లో అరెస్టులు...కొందరికి గాయాలు

 

 హైదరాబాద్: ఆశ వర్కర్లు కదం తొక్కారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ నినదించారు. డిమాండ్ల సాధన కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం వారు చేపట్టిన ‘చలో అసెంబ్లీ’ ఉద్రిక్తతకు దారితీసింది. వేలాది మంది ఆశా వర్కర్లతో హైదరాబాద్ ఎంబీ భవన్ వద్ద ప్రారంభమైన ఈ నిరసన కార్యక్రమానికి పోలీసులు అడుగడుగునా అడ్డుతగిలారు. ర్యాలీని ఆపి... ఆందోళనకారులను ఎక్కడికక్కడ నిర్బంధించేందుకు ప్రయత్నించారు. దీంతో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, ఎంబీ భవన్, ఎస్‌వీకే, సుందరయ్య విజ్ఞానకేంద్రం తదితర ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది.



వందలాది మంది ఆశ వర్కర్లను పోలీసులు విచక్షణారహితంగా ఈడ్చుకెళ్లి వాహనాల్లో ఎక్కించారు. ఈ క్రమంలో కొం దరు ఆందోళనకారుల వస్త్రాలు చినిగిపోయా యి. మరికొందరికి గాయాలయ్యాయి. దాదా పు 1400 మంది ఆందోళనకారులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు జ్యోతి, ఆశా వర్కర్ల యూనియన్ అధ్యక్షురాలు జయలక్ష్మి, సీఐటీ యూ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబు తదితర నాయకున్నారు. కొందరు పోలీసులకూ స్వల్ప గాయాలయ్యాయి. ‘హక్కులు అడిగితే అరెస్టు చేస్తారా? ఇదెక్కడి న్యాయం? ఇది దొంగల రాజ్యం... దోపిడి రాజ్యం’ అంటూ పెద్దపెట్టున నినదించారు. బతుకమ్మ ఆడారు.



 కట్టలు తెగిన ఆగ్రహం...

 సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉన్న ఆశ వర్కర్లు... ‘కేసీఆర్ డౌన్ డౌన్’ అంటూ ఒక్కసారిగా బయటకు వచ్చారు. పోలీసులు వారిని నియంత్రించేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అక్కడి నుంచి వారు సుందరయ్య పార్కు వైపు పరుగులు తీయడంతో ఉలిక్కిపడ్డ పోలీసులు భారీ తాళ్లతో కట్టడి చేశారు. అన్ని వైపులా బారికేడ్లు, ముళ్ల కంచెలు వేశారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆగ్రహించిన ఆశ వర్కర్లు పోలీస్ వ్యాన్‌కు అడ్డం పడ్డారు.  



 38 రోజులుగా ఉద్యమిస్తున్నా

 కనీసం వేతనం రూ.15 వేలకు పెంచాలనే తదితర న్యాయమైన డిమాండ్ల సాధన కోసం 38 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆశ వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు కావల్సివచ్చినప్పుడు కాళ్లు పట్టుకుని అడిగినవారు ఇప్పుడు తమకు సమస్య వస్తే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తామూ తెలంగాణ ఆడబిడ్డలమేనని... పదేళ్లుగా సేవలందిస్తున్న తమకు న్యాయం జరగలేదన్నారు. కేసీఆర్ కుమార్తె, ఎంపీ కవిత ఆడే బతుకమ్మను అడ్డుకుంటామని హెచ్చరించారు. సీఐటీయూ జాతీయ నాయకులు ఆర్.సుధాభాస్కర్, సతీష్ మాట్లాడుతూ... ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఉద్యమాన్ని అపహాస్యం చేస్తుందన్నారు. ఇందుకు ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు.



 8,805 మంది అరెస్ట్: డీజీపీ  

 శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే ఆశ వర్కర్లు తలపెట్టిన ‘చలో అసెంబ్లీ’ని అడ్డుకున్నట్లు డీజీపీ అనురాగ్‌శర్మ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8,805 మందిని అరెస్టు చేసి, వ్యక్తిగత పూచీకత్తు కింద విడుదల చేసినట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.  

 

 కనువిప్పు కావాలి: తమ్మినేని

  ఆశ వర్కర్ల ‘చలో హైదరాబాద్’ రాష్ర్ట ప్రభుత్వానికి కనువిప్పు కావాలని సీపీఎం కార్యద ర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. నిర్భందాలతో ఉద్యమాలను అణచలేరని, న్యాయమైన వారి డిమాం డ్లను పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వం ఏమాత్రం బేషజాలకు పోకుండా వెంటనే సమ్మె విరమణకు నిర్దిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. శనివారం నిర్వహించనున్న రాష్ట్ర బంద్‌లో ఆశ కార్మికులంతా పాల్గొనాలని కోరారు.   

 

 ఈ నిర్బంధమేమిటి?

  నెల రోజులకు పైగా సమ్మె చేస్తున్న ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించడానికి బదులు నిర్బంధమేమిటని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పి.రోజా, కార్యదర్శి కె.సుబ్బరావమ్మ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top