కార్యకర్తలను వదిలే వరకు కదిలేది లేదు

కార్యకర్తలను వదిలే వరకు కదిలేది లేదు - Sakshi


– టీడీపీ వర్గీయుల మధ్య ఫ్లెక్సీల గొడవ

– అనుమానంతో అమాయకులపై గల్లా అనుచరుల దాడి

– ఫిర్యాదు చేసిన బాధితులను అరెస్టుచేసిన పోలీసులు

– ముత్యాలరెడ్డి పల్లె పోలీస్‌స్టేషన్‌లో బైఠాయించిన చెవిరెడ్డి

– పెద్దసంఖ్యలో తరలి వచ్చిన వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు

– దళితులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయరా ? : నారాయణ స్వామి




‘‘నన్ను నమ్మిన వాళ్లు అన్యాయంగా జైల్లో ఉంటే.. నాకు పండుగ లేదు.. అధికార పార్టీ నాయకుల అరాచకాలకు అమాయకులు బలైతుంటే ఊరుకునేది లేదు. తప్పు చేసినవారితో పాటు దాన్ని సమర్థించిన వారు కూడా భవిష్యత్తులో పశ్చాత్తాపపడుతారు. అధికారాన్ని అడ్డగోలుగా వాడుతూ.. ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని విచారించకుండానే అమాయక దళితులను అరెస్టు చేయడం పోలీసులకు తగదు’’ అని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.



ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వగ్రామం నారావారిపల్లె సమీపంలోని పుదిపట్లలో గురువారం టీడీపీకి చెందిన రెండు వర్గాలు గొడవపడ్డాయి. గురువారం రాత్రి కుటుంబ సభ్యులతో కలసి వస్తున్న మణి అనే దళితుడిపై అనుమానంతో పుదిపట్ల సమీపంలో మాజీ మంత్రి గల్లా అనుచరులు దాడికి తెగబడ్డారు.  బాధితులు గల్లా అనుచరులపై ముత్యాలరెడ్డిపల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదుపై కేసు నమోదు చేయని పోలీసులు శుక్రవారం ఉదయం మణిని, వారి కుటుంబ సభ్యులను అరెస్టు చేశారు.



బాధితులకు అండగా చెవిరెడ్డి

సింగపూర్, చెన్నై నుంచి ఎమ్మెల్యే చెవిరెడ్డి కుమారులు సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చారు. అయినప్పటికీ తన నియోజకవర్గ పరిధిలో ఓ దళితుడిని అన్యాయంగా స్టేషన్‌లో ఉంచారని తెలుసుకున్న  చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి శుక్రవారం ఉదయం ముత్యాలరెడ్డి పల్లె పోలీస్‌ స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. బాధితులను వదలాలని కోరారు. వారిని వదిలే వరకు ఎన్ని గంటలయినా.. రోజులయినా సరే ఇక్కడి నుంచి కదిలేది లేదని అక్కడే బైఠాయించారు. అధికార పార్టీ ఒత్తిడితో పోలీసులు అరాచకాలకు పాల్పడితే బాధితులకు అండగా ఉంటానని భరోసా కల్పించారు. బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత పెద్ద సంఖ్యలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. దీంతో ఉత్కంఠ నెలకొంది.



పోలీసులపై నారాయణస్వామి ఫైర్‌

గురువారం అర్ధరాత్రి దళితులు ఫిర్యాదుచేస్తే ఎందుకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు నారాయణ స్వామి మండిపడ్డారు. కేసు నమోదు చేయకుంటే జిల్లావ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు మునీశ్వర్‌ రెడ్డి, మునస్వామి యాదవ్, వెంకటరమణ, బడి వెంకటేష్‌ యాదవ్, చంద్రమౌళి రెడ్డి, దళిత సంఘ నాయకులు ప్రదీప్, నారాయణ, హరినాథ్‌ తదితరులు పాల్గొన్నారు.



అర్ధరాత్రి కేసు నమోదు

ఎమ్మెల్యేలు చెవిరెడ్డి, నారాయణస్వామి స్టేషన్‌ వద్దే బైఠాయించడంతో బాధితుడు మణి బంధువు సిద్దముని ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం అర్ధరాత్రి తర్వాత నిందితులు బడి సుధా యాదవ్, రవీంద్ర, వెంకటముని, గుండ్లూరు శివ, ఈశ్వరయ్యపై కేసు నమోదు చేశారు.

whatsapp channel

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top