జోరుగా కలప అక్రమ రవాణా

జోరుగా కలప అక్రమ రవాణా - Sakshi


జిల్లా సరిహద్దులు దాటిస్తున్న వ్యాపారులు   

బొగ్గు బట్టీలకు విలువైన వృక్షాల చేరవేత   

‘వాల్టా’కు తూట్లు పొడుస్తున్న అక్రమార్కులు    

మామూళ్ల మత్తులో అటవీశాఖ అధికారులు..!   

హరితహారం లక్ష్యం నెరవేరేనా..   




జిల్లాలో ఒక్కశాతం ఉన్న అటవీ ప్రాంతాన్ని 33 శాతం వరకు పెంచాలనే ఉద్దేశంతో కలెక్టర్‌ శ్రీదేవసేన ఆధ్వర్యంలో అటు అధికారులు.. ఇటు ప్రజలు కృషి చేస్తుంటే.. అక్రమ సంపాదనకు అలవాటుపడిన కొందరు అక్రమార్కులు ఉన్న చెట్లను యథేచ్ఛగా నరికివేస్తున్నారు. తెలంగాణకు హరితహారం పేరుతో ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేస్తుంటే.. అటవీశాఖ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పలువురు అధికారులకు ప్రతి నెలా ముడుపులు ముట్టచెబుతున్నామనే ధీమాతో  అక్రమార్కులు విలువైన కలపను సరిహద్దులు దాటి న్నారు.



జిల్లాలోని జనగామ, నర్మెట, తరిగొప్పుల, బచ్చన్నపేట, రఘునాథపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్, లింగాలఘణపురంతోపాటు పలు మండలాల నుంచి నిత్యం కలప రవాణా జోరుగా సాగుతోంది. అటవీ ప్రాంతంలోని వేప, తుమ్మ, చింత చెట్లను దర్జాగా నరికివేస్తూ లారీల ద్వారా చుట్టుపక్కల ప్రాంతా కు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 25 మంది కలప వ్యాపారులు ఉండగా.. వీరికి ఏజెంట్లుగా వంద మందికి పైగా పనిచేస్తున్నట్లు సమాచారం.



మామూళ్లు ఎవరికి..?

కలప అక్రమ రవాణాపై అటవీశాఖ అధికారులపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దందా సాగిస్తున్న వ్యాపారుల నుంచి నెల నెలా మామూళ్లు పుచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. అధికారులు, కలప వ్యాపారులు చేతులు కలపడంతో వారి సంపాదన మూడు పువ్వులు.. ఆరుకాయలుగా వర్ధిల్లుతోందనే ప్రచారం జరుగుతోంది. ఉన్నతాధికారులకు అనుమానం రాకుండా.. అప్పుడప్పుడూ తూతూ మంత్రంగా కేసులు నమోదు చేస్తూ.. పెద్ద ఎత్తున కలపను పక్క జిల్లాకు దాటిస్తున్నాట్లు సమాచారం.



బొగ్గుబట్టీల నిర్వహణ కోసం కంపతార, రేగి చెట్లకోసం అనుమతి తీసుకుంటున్న సదరు వ్యక్తులు విలువైన కర్రను అందులో ఉపయోగిస్తున్నారని సమాచారం. ఇంతా జరుగుతున్నా అక్రమ కలప రవాణాను అరి కట్టేందుకు అటవీశాఖ అధికారులు తీసుకున్న చర్యలు మాత్రం శూన్యంగా కనిపిస్తున్నాయి. ఈ విషయంలో అధికారులు మేలుకోకుంటే.. భవిష్యత్‌లో జిల్లాలో ఎన్ని మొక్కలు నాటినా నిష్ప్రయోజనమేనని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top