మూడేళ్ల కూతురితో సహా తల్లి ఆత్మహత్య

మూడేళ్ల కూతురితో సహా తల్లి ఆత్మహత్య - Sakshi


పరకాల: వరకట్నం వేధింపులు తల్లి, కూతురును బలితీసుకున్నాయి. అదనపు కట్నం తేవాలంటూ వేధించడమే కాకుంగా ఆడపిల్లలను కన్నావంటూ అత్తింటి వారి సూటిపోటి మాటలు భరించలేక ఓ మహిళ తన ఇద్దరు కూతుళ్లతోపాటు తనపై కిరోసిన్ పోసుకొని నిప్పంటిచుకుంది. ఒక కూతురు, ఆమె అగ్నికి ఆహుతికాగా.. మరో కూతురు గాయాలతో బయటపడింది. వరంగల్ జిల్లా పరకాల మండలం కంఠాత్మకూరులో జరిగిన ఈ దారుణానికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి .. కంఠాత్మకూరు గ్రామానికి చెందిన తడుక తిరుతమ్మ-రాజేందర్ దంపతులకు నలుగురు కుమార్తెలు. అందులో పెద్ద కూతురై సుప్రియ(24)ను హసన్‌పర్తి మండలం ఆరెపల్లి గ్రామానికి చెందిన పొగాకు కిరణ్‌కు ఇచ్చి 2010లో వివాహం చేశారు.



పెళ్లి సమయంలో ఒప్పుకున్న రూ.5లక్షలు కట్నం కింద ఇచ్చారు. సుప్రియ, కిరణ్ దంపతులకు సింధూశ్రీ, నిత్యశ్రీ(3) ఇద్దరు కూతళ్లు జన్మించారు. రెండవ కూతురు పుట్టినప్పటి నుంచి కిరణ్ సుప్రియను వేధించడం మొదలు పెట్టాడు. నీకు మీ అమ్మ సాలు పడిందని అందుకే ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని.. అదనంగా రూ.5లక్షల కట్నం తేవాలని వేధించడం ప్రారంభించాడు. రెండు నెలలక్రితం కట్నం తేవాలని సుప్రియను కొట్టడంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. సుప్రియ తండ్రి పెద్దమనుషులను తీసుకొని ఆరెపల్లికి వెళ్లారు. అక్కడ పెద్ద మనుషుల సమక్షంలోనే సుప్రియ, ఆమె తండ్రి రాజేందర్‌ను కొట్టారు.



దీంతో సుప్రియ తన ఇద్దరు పిల్లలను తీసుకొని కంఠాత్మకూరుకు వచ్చింది. తల్లిగారింటికి వచ్చిన సుప్రియకు భర్త కిరణ్ తరుచూ ఫోన్ చేసి వేధిస్తునే ఉన్నాడు. శుక్రవారం ఉదయం కూడా సుప్రియకు ఫోన్ చేసి కట్నం తేవాలని ఒత్తిడి చేశాడు. అయితే, తండ్రి రాజేందర్ తాటిచెట్లు ఎక్కడానికి వెళ్లగా.. తల్లి ఉపాధిపనికి పోయింది. తాత పింఛన్ తెచ్చుకోవడానికి వెళ్లగా నానమ్మ కిరాణం షాపు పోవడంతో ఇంట్లో ఎవరూ లేరు. సుప్రియ తన ఇద్దరు పిల్లలను వెనుక గదిలోకి తీసుకుపోయి పిల్లలతోపాటు తనపై నాలుగు లీటర్ల కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకుంది. సుప్రియ, చిన్న కూతురు నిత్యశ్రీ అక్కడికక్కడే మృతి చెందగా పెద్ద కూతురు భయంతో తలుపుపక్కన దాక్కుంది. ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు తలుపులు తీసేసరికి సుప్రియ, నిత్యశ్రీ మంటలకు కాలిపోయారు. సింధూశ్రీ స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడింది. పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ మల్లయ్య, ఎస్సై దీపక్ హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సివిల్ ఆస్పత్రికి తరలించారు. మృతురాలు తండ్రి రాజేందర్ ఫిర్యాదు మేరకు సుప్రియ భర్త కిరణ్, మామ సుదర్శన్, అత్త సుజాత, మరిది హరికృష్ణపై కేసు నమోదు చేసిన దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ మల్లయ్య తెలిపారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top