న్యాయం కోసం మండుటెండలో...

న్యాయం కోసం మండుటెండలో... - Sakshi


ఖమ్మం: తనకు, తన బిడ్డకు పోలీసులే న్యాయం చేయాలని ఓ మహిళ మండుటెండలో గంటన్నరపాటు నడిరోడ్డుపై బైఠాయించింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... ఖమ్మం జిల్లా బూర్గంపాడుకు చెందిన కందుల ప్రసాద్ 2013లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సమయంలో స్వరూపని ప్రేమించి భద్రాచల ఆలయంలో పెళ్లి చేసుకున్నాడు. ఏడాదిపాటు వారి సంసారం సజావుగా సాగింది. 2014లో వారికి పాప శ్రావణి పుట్టింది. ఆమె పుట్టిన రెండునెలల నుంచి స్వరూపను వదిలి ప్రసాద్ మరొకరితో సహజీవనం సాగిస్తున్నాడు. ఈ విషయమై అప్పుడే మణుగూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అతనిని విధుల నుంచి సస్పెండ్ చేసి కేసు నమోదు చేశారు. అప్పట్నుంచి స్వరూపపై కక్షకట్టి మానసికంగా వేధిస్తున్నాడు. భార్య, కుమార్తె పోషణను పట్టించుకోవటం లేదు. ఎనిమిది నెలలుగా ఉంటున్న ఇంటికి అద్దె కట్టకపోవటంతో ఇల్లు ఖాళీచేయమని ఇంటి యజమాని హెచ్చరించాడు.




ఈ పరిస్థితుల్లో కేసు విత్‌డ్రా చేసుకోకుంటే చంపుతానని భార్యను ప్రసాద్ బెదిరిస్తున్నాడు. స్వరూపకు మతిస్థిమితం లేని తండ్రి తప్ప నా అనే వారు ఎవరూ లేరు. ఇంటి యజమాని ఇల్ల్లు ఖాళీ చేయమంటుండగా నాలుగురోజులుగా బూర్గంపాడు పోలీస్‌స్టేషన్ చుట్టూ భర్త కోసం తిరుగుతోంది. అతను కన్పించకపోయేసరికి గత్యంతరం లేని పరిస్థితుల్లో బుధవారం మధ్యాహ్నం సారపాక ప్రధాన కూడలిలో బైఠాయించింది. తనకు, తన బిడ్డకు పోలీస్ ఉన్నతాధికారులే న్యాయం చేయాలని కోరింది. ఆమెను స్థానిక ఎస్‌ఐ కరుణాకర్ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి మాట్లాడారు. సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top