‘ఎర్ర’ వనంలోకి మహిళా డాన్‌లు

‘ఎర్ర’ వనంలోకి మహిళా డాన్‌లు


రూ.కోట్లు కూడబెడుతున్న వైనం

నిన్న సంగీత.. నేడు జ్యోతి

నివ్వెరపోతున్న పోలీసులు




చిత్తూరు (అర్బన్‌): ఇప్పటి వరకు మగవాళ్లు మాత్ర మే చేస్తున్న ఎర్ర చందనం స్మగ్లింగ్‌లోకి తాజాగా మహిళలు కూడా చేరారు. గతేడాది రంగుల లోకం సుందరి సంగీత చటర్జీని అరెస్టు చేసిన పోలీసులు.. తాజాగా జ్యోతి అనే మహిళా డాన్‌ను అరెస్టు చేశారు.



వెలగని జ్యోతి...

తమిళనాడులోని వేలూరు నగరం అళగిరినగర్‌కు చెంది న ఎన్‌.జ్యోతి, ఆమె భర్త, ఇద్దరు కొడుకుల్ని చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. ఎర్రచందనం అక్రమ వ్యాపా రంలో జ్యోతి ప్రస్తావన తెలుసుకున్న పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జ్యోతి నాలుగో తరగతితోనే విద్యాభ్యాసాన్ని ముగించింది. భర్త నాగేంద్రన్‌ లారీ డ్రైవర్‌ కావడంతో ఇసుక లోడ్లు తీసుకెళుతూ ఎర్ర చం దనం స్మగ్లర్లతో పరిచయాలు పెంచుకున్నాడు. ఈ విష యం జ్యోతికి చెప్పడంతో అవకాశాన్ని వదులుకోవద్దని భర్తకు చెప్పి తానూ 2013 నుంచి  స్మగ్లింగ్‌లోకి అడుగుపెట్టింది. అనతికాలంలోనే రూ.కోట్లకు పడగలెత్తింది. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలకు చెందిన బడా స్మగ్లర్లతో పరిచయాలు పెంచుకుంది. వీరప్పన్‌ కంచుకోటైన జవ్వాదిమలై గ్రామం నుంచి చెట్లను నరికే కూలీలను పిలిపించి శేషాచలం అడవుల్లోకి పంపి ఎర్రచందనం దుంగలు తరలించడమే పనిగా పెట్టుకుంది.



ఇలా మూడేళ్ల కాలంలో జిల్లా నుంచి వంద టన్నుల ఎర్రచందనం దుంగల్ని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసి రూ.10 కోట్ల వరకు ఆస్తులు కూడబెట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆమెపై జిల్లాలోని పోలీస్‌ స్టేషన్లలో నాలుగు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం జ్యోతి అరెస్టు కావడంతో ఆమె వెనుక ఉన్న బడా స్మగ్లర్లు రామ్‌నాథ్, రంగనాథ్, మాలూర్‌ బాషా కోసం పోలీసుల అన్వేషణ కొనసాగుతోంది.



కనిపించని సంగీత

మోడల్‌గా, ఎయిర్‌ హోస్టెస్‌గా పనిచేస్తున్న సంగీత చటర్జి అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్‌ లక్ష్మణ్‌ను రెండో పెళ్లి చేసుకుంది. భర్త జైల్లో ఉండగా అంతర్జాతీయ ఎర్రచందనం సామ్రాజాన్ని ఆమె చేతుల్లోకి తీసుకుంది. ఐదు రాష్ట్రాల్లోని బడా స్మగ్లర్లకు హవాలా రూపంలో రూ.కోట్లు సమకూర్చి వంద టన్నుల ఎర్రచందనం దుంగలను జిల్లా నుంచి విదేశాలకు పంపినట్లు జిల్లా పోలీస్‌ రికార్డులకెక్కింది.



ఆమె బ్యాంకు లాకర్లను బద్దలుకొట్టిన పోలీసులు కిలోల లెక్కన బంగారు, రూ.కోట్ల విలువ చేసే స్థిరాస్తులను సీజ్‌ చేశారు. కోల్‌కతాకు చెందిన సంగీతపై చిత్తూరులో అరెస్టు వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. తమ కళ్లుగప్పి తిరుగుతున్న సంగీతను పట్టుకోవడం ఇప్పట్లో సాధ్యపడే విషయం కాదని పోలీసులు పెదవి విరుస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top