ఆభరణాలు కాజేసి.. నిప్పంటించి చంపేశారు..


మెదక్ : ఓ ఒంటరి మహిళ నుంచి ఆభరణాలు దోచుకుని ఆమెపై పెట్రోల్ పోసి దహనం చేసిన దారుణ ఘటన మెదక్-బోధన్ ప్రధాన రహదారి మెదక్ మండల శాలిపేట శివారులో గల మంగమ్మగుట్ట అటవీప్రాంతంలో జరిగింది. మెదక్ డీఎస్పీ రాజారత్నం కథనం ప్రకారం... జోగిపేట మండలం అక్సాన్‌పల్లి గ్రామానికి చెందిన గడ్డమీది అనిత(33)కు పుల్కల్ మండలం మలపాడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఓ కూతురు(8) ఉంది. కొంతకాలం క్రితం భర్త చనిపోవడంతో అనిత తన తల్లిగారింటి వద్ద కిరాణ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తోంది.



అనిత చెల్లెలు సుమలతకు నిజామాబాద్ జిల్లా లింగంపేట మండలం సజ్జన్‌పల్లికి చెందిన వ్యక్తితో వివాహమైంది. కాగా  సుమలత పెద్ద బంగారు గొలుసును కడిగించడం కోసం తన అక్క అయిన అనితకు ఇచ్చి పంపించింది. ఆ గొలుసును ఈ నెల 4న జోగిపేటలోని భరత్ జ్యూయెలర్స్‌లో కడిగించి తీసుకొని గురువారం ఉదయం జోగిపేట నుంచి చెల్లెలి వద్దకు బయలుదేరింది. ఈ క్రమంలో మెదక్‌లో బస్సు దిగిన అనిత అక్కడి నుండి ఆటోలో సజ్జన్‌పల్లికి బయల్దేరింది.



మార్గమధ్యంలోకి ఆటో వెళ్లాక చెల్లెలు సుమలత భర్త అనితకు ఫోన్‌చేయగా తను ప్రస్తుతం అడవిప్రాంతంలో నుంచి వస్తున్నామని తనకు అడ్రస్ తెలియదంటూ ఆటోడ్రైవర్‌తో మాట్లాడించింది. దీంతో ఆటోడ్రైవర్ ఫోన్ తీసుకుని తాము మెదక్ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నామని, మరో గంటలో వస్తామని చెప్పాడు. అనంతరం అనిత ఫోన్ స్విచ్చాఫ్ అయ్యింది. దీంతో అనుమానించిన చెల్లెలు సుమలత జోగిపేటలోని తల్లిగారింటికి సమాచారం అందించింది. ఆందోళనకు గురైన వారు కలిసి అనితను వెతకడం ప్రారంభించారు.



శుక్రవారం ఉదయం పశువుల కాపర్లు శాలిపేట శివారులోని అడవిలో సగం కాలిన శవాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అనిత మెడలో ఉండాల్సిన మూడు తులాల బంగారు ఆభరణాలతోపాటు చెవికమ్మలు, సంచిలో ఉన్న 5 తులాల బంగారు గొలుసు లేవు. డాగ్ స్క్వాడ్, క్లూస్‌టీం, పోలీసు ఉన్నత అధికారులు సంఘటన స్థలంలోనే వివరాలు సేకరించారు.



అనుమానాలన్నీ ఆటో డ్రైవర్‌పైనే....

ఆటో డ్రైవరే ఆమె నగలు గమనించి అడవిలోకి తీసుకెళ్లి ఆమెను హత్యచేసి, ఒంటిపై పెట్రోల్ పోసి తగులబెట్టి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top