మళ్లీ అదే తప్పు!

మళ్లీ అదే తప్పు!


తెలుగు అనువాదం లేని ప్రశ్నాపత్రం

బీకాం విద్యార్థుల అవస్థలు




ఏయూ క్యాంపస్‌:  ఆంధ్ర విశ్వవిద్యాలయం పరీక్షల విభాగంలో డొల్లతనం రోజుకో రూపంలో బయటపడుతోంది. డిగ్రీ పరీక్షల్లో పేపర్‌ లీక్‌ కావడంతో మొదలైన పొరపాట్లు రోజుకు ఒకటి చొప్పున వెలుగులోకి వస్తున్నాయి. సోమవారం జరిగిన పరీక్షలో శనివారం నాటి పొరపాటే పునరావృతం అయింది. అనువాదమేదీ?: వర్సిటీ పరిధిలో సోమవారం మధ్యాహ్నం జరిగిన బీకాం ఆడిటింగ్‌ పరీక్ష నిర్వహిం చారు.



అయితే ప్రశ్నాపత్రాన్ని పూర్తి గా ఆంగ్లంలోనే ముద్రించి తెలుగు అనువాదం ఇవ్వకపోవడంతో తెలుగు మాధ్యమం విద్యార్థులు బిక్కమొహం వేశారు. శనివారం జరిగిన బీకాం పరీక్షలోనూ ఇదే తప్పు జరిగింది. ప్రశ్నాపత్రం తయారుచేసిన వ్యక్తి తెలుగు అనువాదం ఇవ్వకపోవడం, ముద్రణా విభాగంలో అధికారులు, సిబ్బంది కూడా గుర్తించకపోవడం గమనార్హం.



అదే అధ్యాపకుడు!: శనివారం పరీక్ష జరిగిన ప్రశ్నాపత్రాన్ని తయారు చేసిన అధ్యాపకుడే సోమవారం నాటి ఆడిటింగ్‌ ప్రశ్నాపత్రాన్నీ తయారు చేసినట్లు వర్సిటీ అధికారులు చెబుతున్నారు. అయితే ప్రశ్నలు ఆంగ్లంలోనే ఉన్నట్లు అధికారులు శనివారమే గుర్తించా రు. కానీ ఒక్క రోజులో ప్రశ్నాపత్రం పునర్ముద్రణ, పంపిణీ అసాధ్యమని భావించి అదే ప్రశ్నాపత్రాన్ని విద్యార్థులకు ఇచ్చారు. కానీ నష్టనివారణ చర్యలు చేపట్టారు. పరీక్ష కేంద్రాల్లో అధ్యాపకులు అనువదింపజేసే లా ఆదేశాలు జారీ చేశామని, తెలుగు మాధ్యమం వి ద్యార్థులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారని పరీక్షల విభాగం ఉన్నతాధికారి ఒకరు సాక్షికి తెలిపారు.



బాధ్యులపై చర్యలతోనే చెక్‌

ప్రశ్నాపత్రాల రూపకల్పన, ముద్రణ, పంపిణీ వ్యవస్థలలో నిపుణులను నియమించడం, ఉద్యోగులను జవాబుదారీగా చేయడం ఎంతో అవసరం. తప్పులు  పునరావృతం అయితే బాధ్యులపై చర్యలు తీసుకునేలా అధికారులు చర్యలు చేపడితే గానీ వీటికి అడ్డుకట్ట వేయలేమని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



కమిటీ విచారణ ప్రారంభం

బీఎస్సీ గణితం ప్రశ్నాపత్రం లీక్‌కు కారణాలను అన్వేషించే పనిలో వర్సిటీ అధికారులు ఉన్నారు. ఆచార్య రామ్మోహనరావు నేతృత్వంలో ఆచార్య పి.హృషీకేశవ రావు, ఆచార్య కె.విశ్వేశ్వరరావు పరీక్షల విభాగం అధికారులతో సమావేశమై ప్రాథమిక సమాచారం సేకరించారు. లీక్‌ జరిగినట్లు అనుమానిస్తున్న చోడవరంలోని పలు కళాశాలల వివరాలు, ఆధారాలను ఇప్పటికే అధికారులు పరీక్షల విభాగం నుంచి సేకరించారు.



ప్రశ్నాపత్రం సామాజిక మాధ్యమాలలో ఉంచడంతో దీనిని సైబర్‌ క్రైమ్‌ వారితో విచారణ జరిపించాలని ప్రయత్నిస్తున్నారు. మంగళవారం సైబర్‌ క్రైమ్‌ విభాగానికి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ప్రస్తుత కమిటీ ప్రశ్నాపత్రం లీకేజీ కారణాలు, బాధ్యులను గుర్తించడంతో పాటు, పరీక్షల నిర్వహణ వ్యవస్థలో లోపాలను సరిదిద్దడానికి పలు సూచనలు చేసే దిశగా ప్రయత్నిస్తోంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top