బందరు పోర్టు భూసమీకరణ జీవోను ఉపసంహరించుకోవాలి


బందరు పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం ఏకపక్షంగా జారీచేసిన భూ సమీకరణ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్ చేశారు. పోర్టుపేరుతో సుమారు లక్ష ఎకరాల భూమిని బలవంతంగా తీసుకోడానికి చేస్తున్న ప్రయత్నాలను అక్కడి రైతులు, తీరప్రాంత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేవలం 1800 ఎకరాల భూమి సరిపోతుందని చెప్పిన టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత లక్ష ఎకరాలు తీసుకోడానికి ప్రయత్నించడం ప్రజలను మోసగించడమేనన్నారు. నిత్యం పారదర్శకత జపం చేసే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంత భూమిని భూసమీకరణ ద్వారా తీసుకోనున్నదీ ఆ జీవోలో పేర్కొనలేదని, భూసమీకరణ వలన నష్టపోయే మత్స్యకారులు, ఇతర వృత్తిదారులకు ఎంత నష్టపరిహారం చెల్లించనున్నదో ఆ జీవోలో ప్రస్తావించకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఏ పరిశ్రమ వస్తుంది, దానికి ఎంత భూమి అవసరమో ప్రకటించని ప్రభుత్వం ముందస్తుగా రైతుల నుంచి భూమిని లాక్కునే ప్రయత్నం భూమితో భూమితో వ్యాపారం చేయడానికేనని స్పష్టమవుతోందన్నారు.



 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top