ఆర్‌ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యంతోనే మా కుమారుడు మృతి

ఆర్‌ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యంతోనే మా కుమారుడు మృతి - Sakshi


బ్రహ్మంగారిమఠం: జ్వరం వస్తోందని ఆర్‌ఎంపీ వైద్యుడి వద్దకు వెళితే ఆయన వేసిన  సూది మందు వలన ఇంటర్‌ చదివే తమ కుమారుడు మృతి చెందాడని బాలుని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రంగస్వామి   తెలిపారు. ఆయన కథనం మేరకు. బి.మఠానికి చెందిన నాగేంద్ర, పార్వతమ్మ దంపతులు కుంకుమ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం. పెద్దబ్బాయి రాఘవేంద్ర(17) ఇంటర్‌ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. గతనెల 3వతేదీన జ్వరం రావడంతో స్థానికంగా ఉన్న ఆర్‌ఎంపీ డాక్టర్‌ సుబ్రమణ్యం దగ్గరికి తీసుకెళ్లారు. అతను వేసిన సూదులు, మందులతో జ్వరం తగ్గకపోవడంతో మరుసటిరోజు తిరిగి అక్కడికే  వెళ్లారు. మళ్లీ సూదులు వేసినా తగ్గకపోవడంతో మైదుకూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్‌ అన్ని పరీక్షలు నిర్వహించారు. అప్పటికే పిల్లవాడికి చేయి, కాలు చచ్చుబడిపోయిందని, మందు మెదడుకు రియాక్షన్‌ ఇచ్చిందని తెలపడంతో ప్రొద్దుటూరుకి తీసుకెళ్లగా బాలుడు మృతి చెందినట్లు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. గత నెల 4వ తేదీన బాలుడు మృతి చెందాడన్నారు. బాలుడి అంత్యక్రియల లోపే తమ చిన్నబ్బాయికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో చెన్తె్నకి తీసుకెళ్లి తిరిగి వచ్చామని, పెద్దబ్బాయి మృతిపై అనుమానాలు ఉండటంతో శవపరీక్ష చేయాలని కోరామన్నారు. దీంతో పూడ్చిన మృతదేహాన్ని గురువారం వెలికి తీసి కడప రిమ్స్‌ వైద్యుడు డాక్టర్‌ ఆనందకుమార్‌ శవ పరీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ దామోదర్‌రెడ్డి, ఎస్‌ఐ రంగస్వామి, పోలీసు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top