అవసరమైతే బ్రాండిక్స్ కార్మికుల కోసం దీక్ష: వైఎస్ జగన్

అవసరమైతే బ్రాండిక్స్ కార్మికుల కోసం దీక్ష: వైఎస్ జగన్ - Sakshi


ఐదేళ్లకోసారి జీతాలు పెంచుతూ.. అది కూడా కేవలం 20 శాతమే ఇస్తున్నారని, బ్రాండిక్స్ ఫ్యాక్టరీలో పనిచేసే పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. బ్రాండిక్స్ కార్మికులకు కనీస వేతనం రూ. 10వేలు ఇచ్చి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వాళ్ల కోసం అవసరమైతే తాను స్వయంగా నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధమని చెప్పారు. ఇందుకోసం వాళ్లకు నెల రోజుల గడువు ఇస్తున్నానన్నారు. కార్మికులను కనీసం బాత్రూంకు కూడా సరిగా వెళ్లనివ్వకుండా తలుపులు కొట్టి పిలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న సమస్యలు ఏంటి, వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రభుత్వాన్ని నిలదీస్తూ, ఒత్తిడి తెస్తూ.. వాళ్ల ద్వారా బ్రాండిక్స్ మీద కూడా ఒత్తిడి తెచ్చి పరిష్కారం తెచ్చుకోడానికి ప్రయత్నించాలని చెప్పారు. విశాఖపట్నం అచ్యుతాపురంలోని బ్రాండిక్స్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం బుధవారం నాడు నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే...



2006లో ఫ్యాక్టరీ పెట్టినపుడు ఐదేళ్ల తర్వాత వేతన సవరణ జరగాలి. 2011లో అలాంటి సవరణ జరిగింది. కానీ వీళ్లకు ప్రయోజనాలు మాత్రం దక్కలేదు.

రివిజన్ జరిగినప్పుడు ఫిబ్రవరిలో 326 జీవో ఇష్యూ చేశారు. అప్పుడు జీతాలు పెంచుతున్నట్లు చూపించారు. సెక్యూరిటీ, వాచ్‌మన్, స్వీపర్ లాంటి పోస్టులకు కూడా 6వేల రూపాయల వరకు ఇస్తున్నట్లు చెప్పారు.

మామూలుగా ఎక్కడైనా ఐదేళ్లకోసారి వేజ్ బోర్డు నుంచి వచ్చే ఉత్తర్వుల కోసం ఆశగా ఎదురు చూస్తాం. కానీ నవంబర్‌కు వచ్చేసరికి మళ్లీ అప్పటి ప్రభుత్వం అందులో మార్పులు చేసి, జీతాలు పూర్తిగా తగ్గించింది.

కనీసవేతనాలను రూ. 4,100కు తగ్గించారు. మామూలుగా అయితే 9 నెలల తర్వాత మరికొంత పెంచాలి. కానీ యాజమాన్యంతో కుమ్మక్కైన ప్రభుత్వం జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్న జీతాలను తగ్గించారు.

అంతకుముందు కంటే కేవలం 20 శాతం మాత్రమే జీతాలు పెంచారు.

ఒకవైపు కూరగాయల రేట్లు భగ్గుమంటున్నాయి. ధరలన్నీ పెరిగిపోయాయి. కందిపప్పు, మినప్పప్పు అన్నీ 150-200 వరకు ఉంటున్నాయి.

పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. ఐదేళ్లకోసారి, అది కూడా కేవలం 20 శాతం పెంచుతున్నారు.

పోనీ నిజంగానే ఇది నష్టాలతో కూడిన సంస్థ అయితేనో, ప్రభుత్వ సాయం లేకపోతేనో పోనీలే అనుకోవచ్చు.

కానీ ప్రభుత్వం ఈ కంపెనీకి భూములు ఇచ్చేటపుడు ముఖ్య ఉద్దేశం స్థానికులకు మంచి ఉద్యోగాలు రావాలని.

60వేల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు.. కనీసం 18 వేల ఉద్యోగాలైనా ఇచ్చారు, సంతోషం.

కానీ జీతాలు ఇలా ఇస్తే వీళ్లు ఏం తినాలి, ఏం బతకాలి, పిల్లలకు ఏం చదువులు చెప్పిస్తారు? ఈ విషయాలు పరిష్కరించకుండా వదిలేస్తే ఎలా?

ఇప్పుడు మళ్లీ జీతాలు రివైజ్ చేయాలి. గతంలోలా 20 శాతం మాత్రమే ఇవ్వకుండా న్యాయం చేయాలని పోరాడుతున్నాం.

మనం బతకడానికి, కనీసం పిల్లలను చదువులకు పంపాలంటే కనీసం నెలకు 10 వేల రూపాయలు ఉండాలని మహాలక్ష్మి అందరి తరఫున అడుగుతోంది.

బ్రాండిక్స్ యాజమాన్యానికి ఒకటే చెబుతున్నా.

ఇక్కడి దుస్తులను మీరు అమెరికా, యూరప్ దేశాలకు ఎగుమతి చేస్తారు. అక్కడ వాళ్లు పనిచేస్తే గంటకు 9 డాలర్లు ఇస్తారు. అంటే, 600 రూపాయలు. రోజుకు 8 గంటలు పనిచేస్తే... 4800! అంటే, నెలకు దాదాపు లక్ష రూపాయలు.

ఈవాళ మనకు నెలకు కనీసం పదివేలు ఇవ్వాలని అడగాల్సి వస్తోంది, చంద్రబాబు మీద ఒత్తిడి తెస్తే తప్ప పని జరగని పరిస్థితి ఉంది.

ఇది అన్యాయం కాదా? పనిచేస్తున్న అక్కచెల్లెమ్మల ముఖాల్లో చిరునవ్వులు రావాలి.

బాత్రూంకు వెళ్లి 5 నిమిషాల్లో రాకపోతే ఏమవుతుంది? తలుపులు కొట్టి పిలవాలా?

పని చేస్తుంటే కనీసం పక్కన తాగడానికి మంచినీళ్లు కూడా పెట్టడం లేదు.

ఈ పరిస్థితి మారాలి. పనులు చేసేవాళ్లు సంతోషంగా చేయాలి, చేయించుకునేవాళ్లు సంతోషంగా చేయించుకోవాలి.

ఇక్కడ మాట్లాడితే ఉద్యోగాలు తీస్తారని ఎవరూ భయపడక్కర్లేదు. అలా తీస్తే తర్వాత వాళ్లకు ఉంటుంది

సీఎం చంద్రబాబు ఈ జిల్లాలో ఉండగానే కార్మికులను కొట్టించారు. ఇంతకంటే అన్యాయం, దారుణం ఏమైనా ఉంటుందా?

ప్రజాస్వామ్యంలో ధర్నా చేస్తుంటే నీళ్లు, మైకులు కూడా ఇవ్వనివ్వకుండా అడ్డుకున్నారు

ధర్నా చేస్తుంటే మాలో 500 మందిని తీసుకెళ్లి ఎస్.రాయవరం స్టేషన్‌లో పెట్టారు. పొద్దున్నుంచి రాత్రిదాకా పెట్టారు

ఆడవాళ్లు, పిల్లల మీద తన ప్రతాపం చూపిస్తున్నారంటే చంద్రబాబు ఆ స్థానంలో కూర్చోడానికి కూడా అనర్హుడు

నేను కూడా కేంద్రానికి, రాష్ట్రానికి లేఖలు రాస్తాను. ధర్నాలు చేస్తాం

వాళ్లలో మార్పు రావాలి, మంచి విధానంలోకి రావాలి.

జీతాలు కూడా 10 వేల కంటే తక్కువ ఇస్తే ఒప్పుకునేది లేదు

పనిచేసే పరిస్థితులు కూడా సరిగా లేకపోతే ఎక్కడికెళ్లాలి, ఎటు పోవాలని అడుగుతున్నారు.. అందులో న్యాయం ఉంది

ఇక్కడికొచ్చి, ధైర్యం చేసి తమ సమస్యల మీద మాట్లాడిన ప్రతి చెల్లెమ్మకు అభినందనలు

బ్రాండిక్స్ సంస్థ వాళ్లమీద చర్యలు తీసుకుంటే ఊరుకునేది లేదని గట్టిగా చెబుతున్నాం

జీతాలు తక్కువగా ఉండి.. కష్టాలు అనుభవిస్తున్నారు. గతంలోలా 20, 30 శాతం పెంచుతామంటే కుదరదు

4 వేల జీతంతో ఎవరూ బతికే పరిస్థితి లేదు. వాళ్లకు అన్నీ తక్కువకు వస్తాయి. మనకు మాత్రం కూరగాయల నుంచి అన్నీ ధరలు పెరుగుతున్నాయి

ఈ డిమాండ్లు నెరవేరేవరకు వైఎస్ఆర్‌సీపీ మీకు అండగా ఉంటుంది

వేజ్‌బోర్డు రివైజ్ చేయించేలా ప్రభుత్వమే చూడాలి

అలా చేయకపోతే ప్రభుత్వానిది, చంద్రబాబుది తప్పు అవుతుంది

అవసరమైతే నేను కూడా ఇక్కడికొచ్చి వీళ్ల కోసం నిరాహార దీక్ష చేస్తా

ముందుగా వాళ్లకు నెలరోజుల గడువు ఇస్తున్నా.. ఆలోపు వీళ్ల జీతాలు పెంచాలి, పని చేసే పరిస్థితులు మెరుగుపరచాలి

గుడివాడ అమర్‌నాథ్ కూడా మీకు అన్నివిధాలుగా తోడుగా ఉంటారు

మీరు కష్టాల్లో ఉన్నా, బాధలను కడుపులో పెట్టుకుని ఇక్కడకు వచ్చినందుకు ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top