బానిసలుగా చూస్తే ఐక్య పోరాటం

బానిసలుగా చూస్తే ఐక్య పోరాటం

విజయవాడరూరల్‌ :

గ్రామ పంచాయతీ కార్యదర్శులను బానిసలుగా చూస్తే ఐక్య పోరాటాలు చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ కార్యదర్శుల కృష్ణాజిల్లా సంఘం(అమరావతి) హెచ్చరించింది. విజయవాడ రూరల్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో జిల్లా పంచాయతీ కార్యదర్శుల సమావేశం విజయవాడ డివిజన్‌ అధ్యక్షుడు గరిమెళ్ళ వెంకటశ్రీనివాసరావు అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాసరావు మాట్లాడుతూ పనిచేయని పరికరాలతో ప్రజా సాధికారిక సర్వే చేయమనడం సరికాదన్నారు. శాఖాపరమైన విధుల్లో ఉన్న కార్యదర్శులకు అదనపు బాధ్యతలు అప్పజెప్పడంపై ఆవేదన వ్యక్తం చేశారు. పనిచేయని ట్యాబ్‌లతో సర్వే ఎలా చేయాలని ప్రశ్నించారు. అదనపు విధులతో ఒత్తిడి ఎదుర్కుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో 970 గ్రామ పంచాయతీలు ఉండగా 370 మంది కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వీఎస్‌ఆర్‌. ఆంజనేయులు, రాష్ట్ర నాయకులు జీటీవీ రమణ, ఉపాధ్యక్షురాలు వెంకటేశ్వరమ్మ, కోశాధికారి కోటేశ్వరరావు, కార్యవర్గం సభ్యురాలు మైధిలి, గౌరవాధ్యక్షుడు ఏసుదాసు, వీఆర్వోల సంఘం రాష్ట్ర నాయకుడు ఆంజనేయకుమార్‌లు పాల్గొన్నారు. 

సస్పెండ్‌ చేస్తే మూకుమ్మడి సెలవు

విజయవాడరూరల్‌/ రామవరప్పాడు : రామవరప్పాడు పరిధిలోని ఎన్‌హెచ్‌ పక్కన చెత్త నిల్వలు ఉండటంపై పంచాయతీ కార్యదర్శి, విజయవాడ రూరల్‌ మండల ఈవోఆర్డీలపై ఉన్నతాధికారులు ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. అలాగే ఇబ్రహీంపట్నం గ్రామ కార్యదర్శి, ఈవోఆర్డీలపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అయితే పనిభారంతో సతమతమవుతున్న తమపై ‘చెత్తనిల్వ సాకుతో’ సస్పెన్షన్‌ వేటు వేస్తే మూకుమ్మడి సెలవులు పెడతామని పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు తెలిపారు. పంచాయతీ కార్యదర్శుల సమస్యల పరిష్కారం కోరుతూ త్వరలో మంత్రులకు వినతిపత్రం అందజేస్తామని ఆయన తెలిపారు. 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top