భార్య చేతిలో భర్త హతం

భార్య చేతిలో భర్త హతం - Sakshi


► మృతదేహాన్ని కనిపించకుండా చేసే యత్నం

►పోలీసుల అదుపులో నిందితులు




కడప అర్బన్/ కాశినాయన: ఒకరినొకరు ఇష్టపడి వివాహం చేసుకున్నారు.  భర్త రోజూ మద్యం సేవించి వచ్చి భార్యను అనుమానంతో వేధించ సాగాడు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆమె తన అక్కతో కలిసి భర్తను గొంతు చుట్టూ తాడుతో బిగించి దారుణంగా హత్య చేసిన సంఘటన కడప నగరంలో సోమవారం సంచంలనం సృష్టించింది. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని మాయం చేసేందుకు కూడా తమ వంతుగా ప్రయత్నించారు. అయితే ప్రజల కళ్ల నుంచి తప్పించుకోలేక చిక్కిపోయారు.



ఈ సంఘటనపై స్థానికులు, కడప తాలూకా ఎస్‌ఐ రాజరాజేశ్వర్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.కమలాపురం మండలం చదిపిరాళ్లకు చెందిన ఏసోబు (25), కమలాపురానికి చెందిన విజయరాణి (27) ప్రేమించుకుని కొన్నేళ్ల కిందట వివాహం చేసుకున్నారు. విజయరాణి కడప నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తోంది. ఏసోబు కమలాపురానికి చెందిన ఓ పాఠశాలకు చెందిన బస్సుకు డ్రైవర్‌గా వెళుతూ జీవనం సాగిస్తుండేవాడు. రోజు సాయంత్రం సమయానికి ఏసోబు మద్యం సేవించి భార్యను వేధించేవాడు.



ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం కడప నగర శివార్లలోని ఆలంఖాన్ పల్లెలో మెయిన్ రోడ్డులో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. అక్కడ వచ్చినప్పటి నుంచి కూడా తనను అనుమానంతో వేధిస్తూ చిత్రహింసలకు గురి చేసేవాడని భార్య.. కమలాపురంలోని తన సోదరి సుందరిని ఈ నెల 21న రాత్రి తన ఇంటికి పిలిపించింది. మద్యం మత్తులో ఉన్న ఏసోబు మంచంపై నిద్రిస్తుండగా కాళ్లు చేతులు కట్టేసి గొంతు చుట్టూ తాడును బిగించి దారుణంగా హత్య చేశారు. మృతి చెందాడని నిర్ధారించుకున్న తర్వాత మృతదేహాన్ని మాయం చేసేందుకు తమ వంతు పథక రచన చేసుకున్నారు.



చెన్నూరులో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న నరసింహులు అనే వ్యక్తిని ఆటో తీసుకుని రావాలని కోరారు. ఆటోలో మృతదేహాన్ని సోమవారం తెల్లవారుజామున అక్కడి నుంచి తరలించారు. మృతదేహాన్ని బద్వేలు పరిధిలోని బి.కోడూరు అటవీ ప్రాంతాల్లోకి తీసుకెళ్లి ఖననం చేయాలని యాసిడ్‌తో సహా సిద్ధంగా తీసుకెళ్లారు. అటవీ ప్రాంతంలో యాసిడ్‌ పోసి తగలబెట్టేస్తే ఎవరికీ అనుమానం రాదని అనుకున్నారు. వీరి కదలికలు, చర్యలను బి.కోడూరు మండలంలోని ప్రజలు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.



పోరుమామిళ్ల నుంచి పోలీసులు వెళ్లి అక్కాచెల్లెళ్లు విజయరాణి, సుందరిలను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత సమాచారం అందుకున్న తాలూకా ఎస్‌ఐ ఆలంఖాన్ పల్లెలోని సంఘటన స్థలాన్ని తమ సిబ్బందితో సోమవారం రాత్రి పరిశీలించారు. మృతదేహం ప్రస్తుతం పోరుమామిళ్ల పోలీసుల సహకారంతో అక్కడి ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో ఉందని ఎస్‌ఐ వెల్లడించారు. నిందితుల గురించి అడుగగా.. పోరుమామిళ్ల పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం అందిందని, అక్కడికి వెళుతున్నామన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top