ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు..

ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు..


 ప్రేమిస్తున్నాని వెంటపడ్డాడు.. అతడి మాయమాటలకు ఆమె పొంగిపోయింది.. ఏదేమైనా అతడితోనే జీవితమునుకుంది.. కులాలు వేరైనా పెద్దలను ఎదిరించి ఒక్కటయ్యారు.. కొంతకాలానికే అతడి నిజస్వరూపం బయటపడింది..కట్నం కావాలంటూ వేధించాడు. బాధలకు పంటికింద అదిమిపెట్టుకుని ఓర్చుకుంది. ఇద్దరు పిల్లలు జన్మించాక కూడా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు.. చేసేదేమీ లేక.. పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లి ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ బతికీడుస్తోంది.. అయినా ఆమెపై కక్ష పెంచుకుని దారుణానికి ఒడిగట్టాడు.              

 

మిర్యాలగూడ అర్బన్ : కట్టుకున్న భార్యను భర్త సుత్తెతో మోది దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన మిర్యాలగూడ పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని నందిపాడుకు చెందిన కొంక నర్మద(27) పట్టణంలోని కలాల్‌వాడకు చెందిన కొంక రాము ప్రేమించుకు ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు.

 

 కుటుంబ కలహాల కారణంగా నర్మద  పట్టణంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తూ పుట్టింట్లోనే తన ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తోంది. రోజు మాదిరిగా పాఠశాలకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో నందిపాడు బైపాస్ వద్ద మాటు వేసిన ఆమె భర్త రాము సుత్తెతో నర్మద తలపై బలం గా మోదాడు. దీంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందింది.

 

 కాగా వీరికి ఐదు సంవత్సరాల కుమారుడు మణిదీప్, 3సంవత్సరాల కూతురు గాయత్రి ఉన్నారు. కాగా నర్మద భర్త రాము పట్టణంలోని కేఆర్ ఎస్టేట్‌లో చైనాబజారును నిర్వహిస్తున్నట్లు తెలిసింది. భార్యను హత్య చేసిన తరువాత పిల్లలను తీసుకుని పారిపోయినట్టు సమాచారం.

 

 గతంలోనూ హత్యకు కుట్ర..

 నాలుగేళ్లగారాము, నర్మద తరుచూ గొడవ పడుతుం డగా పెద్దల సమక్షంలో  ఒకటి చేశారు.  కొద్ది రోజుల పాటు నందిపాడులోనే కాపురం పెట్టిన వారు నర్మదను హత్య చేయడానికి రెండు సార్లు ప్రయత్నిం చినట్లు మృతురాలి తల్లి ఆరోపించింది. ఎలాగోలా తప్పించుకున్న నర్మద భర్తకు దూరంగా ఉండాలని నిశ్చయించుకుంది. అయినా దారుణం జరగడంతో గ్రామస్తులు కన్నీరు మున్నీరవుతున్నారు.

 

 అదనపు కట్నం కావాలని..

 నర్మదను పెళ్లి చేసుకున్న అనంతరం తరుచూ కట్నం కావాలని వేధించేవాడని కుటుంబ సభ్యులు తెలి పారు. దీంతో దొరికిన కాడికల్లా అప్పు తెచ్చి రూ.లక్ష  వరకు ఇచ్చామని విలపిస్తూ చెప్పారు.


పోలీసుల పరిశీలన

 హత్యకు గురైన నర్మద మృతదేహాన్ని డీఎస్పీ సందీప్‌గోనే, వన్ టౌన సీఐ దూసరి భిక్షపతి పరిశీలించారు. హత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.  పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.



 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top