రక్షణ కల్పిస్తే చదువుకుంటా...
గాలివీడు : తనకు రక్షణ కల్పిస్తే చదువుకొంటానని బద్దెల నాగయ్య కుమార్తె గంగాదేవి మంగళవారం యర్రదొడ్డిపల్లె దళితవాడ అంగన్వాడీ సూపర్వైజర్ శారదమ్మ ఎదుట కన్నీరుమున్నీరు అయ్యింది. ఈ సందర్భంగా సూపర్వైజర్ మాట్లాడుతూ లక్కిరెడ్డిపల్లె సీడీపీఓ అరుణశ్రీ ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగిందని తెలిపారు. మేనేత్త(నాన్న చెల్లెలు)ఇంట్లో తలదాచుకొన్న గంగాదేవిని విచారణ చేసినట్లు చెప్పారు. లక్కిరెడ్డిపల్లె గ్రామం కుర్నూతల దళితవాడకు చెందిన బద్దెల నాగయ్య కుమార్తెగా.. సంబేపల్లె మండలం దేవపట్ల కస్తూర్బా బాలికల పాఠశాలలో పదో తరగతి చుదువుతున్న సమయంలో మేనమామ(అమ్మ అన్న) ఒత్తిళ్లకు తట్టుకోలేక మేనేత్త ఇంట్లో తలదాచుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ఇందుకు రక్షణ కల్పిస్తే తాను చదువుకుంటానని బాలిక సూపర్వైజర్కు తెలిపారు. బాలికపై ఒత్తిడి చేస్తున్న మేనమామ పైన శిశు సంక్షేమ శాఖ ద్వారా తగు చర్యలు తీసుకొంటామని ఆమె తెలియజేశారు.