‘పాలమూరు’పై మీరెటు?

‘పాలమూరు’పై మీరెటు? - Sakshi


♦ ఆంధ్రా పాలకుల వైపా..పాలమూరు వైపా.. కాంగ్రెస్, టీడీపీలు తేల్చుకోవాలి: హరీశ్‌రావు

♦ ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పాలమూరు నిర్మించి తీరుతాం

♦ మహబూబ్‌నగర్ జిల్లాలోని నార్లాపూర్, ఏదుల వద్ద రిజర్వాయర్ల పనులకు శంకుస్థాపన

 

 సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై రెండేళ్లవుతున్నా ఏపీ సీఎం చంద్రబాబు ఏదో రకంగా ఇక్కడి అభివృద్ధిని అడ్డుకొనేందుకు యత్నిస్తున్నారని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని నిలిపేయాలని రోజుకో ఉత్తరం రాస్తూ.. గుంటూరు రైతులు కోర్టులకెక్కేలా రెచ్చగొడుతున్నారని విమర్శించారు. అయినా తెలంగాణ టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు చోద్యం చూస్తున్నాయే తప్ప పాలమూరు బిడ్డల పక్షాన నిలబడడం లేదన్నారు. ఇప్పటికైనా ఆ పార్టీలు పాలమూరు వైపో, ఆంధ్రా పాలకుల వైపో తేల్చుకోవాలన్నారు.



మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని నార్లాపూర్, గోపాల్‌పేట మండలంలోని ఏదుల వద్ద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన రిజర్వాయర్ల నిర్మాణ పనులను హరీశ్‌రావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏదులలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. తెలంగాణలో వలసలతో అల్లాడుతున్న అత్యంత పేద జిల్లా మహబూబ్‌నగర్‌కు సాగునీరు అందించాలన్న తమ సంకల్పానికి ఏపీ కాంగ్రెస్, టీడీపీలు అడుగడుగునా అడ్డు తగులుతున్నాయన్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈ ప్రాజెక్టును ఆపాలంటూ శ్రీశైలం వద్ద ధర్నా చేస్తే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నించారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా.. వచ్చే మూడేళ్లలో పూర్తిచేసి తీరుతామని స్పష్టంచేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లా రైతాంగానికి 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని తీరుతామని, అప్పటి వరకు కేసీఆర్ నిద్రపోరని.. తమని నిద్రపోనివ్వరన్నారు.



 ఎగతాళి చేసిన వారికి జవాబు చెబుతాం...

 పాలమూరు ఎత్తిపోతల పథకం సాధ్యమయ్యే పని కాదని ఎగతాళి చేసిన వారందరికీ సమాధానం చెబుతామని హరీశ్ పేర్కొన్నారు. దేశంలో ఏ ప్రాజెక్టు పూర్తికాని రీతిలో అత్యంత తక్కువ వ్యవధిలో ఈ ప్రాజెక్టును పూర్తిచేసి తీరుతామన్నారు. దూరదృష్టితో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నామని చెప్పారు. జిల్లాలోని ఆర్‌డీఎస్ ప్రాజెక్టు కింద 80,600 ఎకరాలకు నీరందించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపామని, సానుకూల నిర్ణయం కోసం వేచి చూస్తున్నామని చెప్పారు. జిల్లాలో ఉన్న బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి వంటి పెండింగ్ ప్రాజెక్టులను వచ్చే ఖరీఫ్ నాటికి పూర్తి చేస్తామని, ఇందుకోసం రూ.2,600 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు వెల్లడించారు.



19 సంవత్సరాలుగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని సగం కూడా పూర్తిచేయని నేతలు తమకు నీతులు చెబితే ప్రజలు ఊరుకోరన్నారు. జిల్లా లో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రతి 15 రోజులకోసారి సమీక్ష చేయడమే కాకుండా ఆ ప్రాజెక్టుల వద్దే బస చేస్తామని వెల్లడించారు. జిల్లాలో గత ప్రభుత్వాలు చేపట్టిన నాలుగు ప్రాజెక్టుల్లో కేటాయించిన నీటికి.. సాగుచేయాల్సిన ఎకరాలకు ఎక్కడా పొంతన లేదన్నారు. వచ్చే ఐదేళ్లలో మహబూబ్‌నగర్ జిల్లాలో 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని స్పష్టంచేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నీటి సామర్థ్యాన్ని 25 టీఎంసీల నుంచి 40 టీఎంసీలకు పెంచిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు.

 

 కల్వకుర్తి రెండో లిఫ్టు వద్ద మంత్రుల బస

 కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టులో అంతర్భాగమైన జొన్నలబొగుడ లిఫ్టు వద్ద శుక్రవారం రాత్రి మంత్రులు హరీశ్‌రావు, జూపల్లి, లక్ష్మారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి బస చేశారు. సాయంత్రం వారు లిఫ్టు పనులను పరిశీలించారు. వచ్చే ఖరీఫ్ నాటికి పనులు పూర్తిచేయాలని హరీశ్ ఆదేశించారు.

 

 కాంగ్రెస్ వ్యతిరేకమా..? అనుకూలమా?

 పాలమూరు ప్రాజెక్టుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమో అనుకూలమో చెప్పాలని హరీశ్ డిమాండ్ చేశారు. ఒకవేళ ఇక్కడి ప్రజల ఆకాంక్షలకు అండగా ఉండదల్చుకుంటే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డిని కట్టడి చేయాలన్నారు. తెలంగాణ టీడీపీ సైతం ఏపీ సీఎం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలన్నారు. కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో అనేక అక్రమ ప్రాజెక్టులు కట్టుకున్నారని, పాలమూరు నీళ్లను అనంతపురానికి తరలించినప్పుడు జిల్లాకు చెందిన అప్పటి మంత్రి డీకే అరుణ హారతులు పట్టారని గుర్తు చేశారు.



ఇప్పుడు ఈ ప్రాజెక్టును ఆపడం కోసం ఏపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలను జిల్లా కాంగ్రెస్, టీడీపీ నేతలు ఎందుకు అడ్డుకోవడం లేదని, డీకే అరుణ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రైతులకిచ్చే సాగునీటితో రాజకీయాలు చేయడం తగదని హితవు పలికారు. రఘువీరారెడ్డి పాలమూరుకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీసీఎల్పీ నేత జానారెడ్డి స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రజల పక్షాన నిలబడతారో.. పాలమూరు ప్రజల పొట్టకొడతారో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top