నిధులేవి?

నిధులేవి? - Sakshi

  • నష్టాల్లో నడుస్తున్న పీఏసీఎస్‌లు

  • కంప్యూటరీకరణ చేయాలని ప్రభుత్వ ఆదేశాలు

  • కంప్యూటర్ల కొనుగోలుకు నిధులివ్వని వైనం

  • తిరువూరు : సహకార వ్యవస్థను కంప్యూటరీకరించాలని ఆదేశించిన రాష్ట్రప్రభుత్వం అందుకు అవసరమైన నిధులు మాత్రం కేటాయించలేదు. దీంతో ప్రాథమిక సహకార పరపతి సంఘాల పాలకవర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. రెండేళ్లుగా రాష్ట్రప్రభుత్వం రుణమాఫీ ప్రకటించిన కారణంగా సహకార సంఘాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. ఫలితంగా రైతులకు రుణాల మంజూరులో సైతం వెనుకబడ్డాయి.



    పెద్దనోట్ల రద్దు సమయంలో కూడా సహకార బ్యాంకులు, సంఘాలను పక్కన పెట్టడంతో ఖాతాదారుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. జిల్లాలో 425 సహకార సంఘాలుండగా, గతంలోనే 300కు పైగా సంఘాలు సొంతగా కంప్యూటర్లు సమకూర్చుకున్నాయి. తాజాకంప్యూటరీకరణతో వాటిపైనా ఆర్థికభారం పడే పరిస్థితి ఉందని పాలకవర్గ సభ్యులు పేర్కొం టున్నారు. సహకార సంఘాల్లో మైక్రో ఏటీఎంల ఏర్పాటు విషయంలో ఆర్థికభారం మోపకుండా జిల్లా కేంద్రబ్యాంకు సహకరించాలని కోరుతున్నారు.



    ప్రభుత్వ సహకారం ఏది? : కంప్యూటరీకరణకు హడావుడిగా ఆదేశాలిచ్చిన ప్రభుత్వం రెండు సంవత్సరాలుగా రైతులకు రూ.లక్ష లోపు రుణాలకు ఇచ్చిన వడ్డీ రాయితీని సహకార సంఘాలకు బదలాయించడంలో ఉదాసీనవైఖరి అవలంబిస్తోందని పీఏసీఎస్‌ అధ్యక్షులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు వడ్డీరాయితీ సొమ్ము చెల్లించకపోయినా రైతులకు ముందుగానే రశీదు ఇస్తుండటంతో సహకార సంఘాలు నష్టాల్లో కూరుకుపోతున్నాయని చెబుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్న పీఏసీఎస్‌లు మినహా మిగిలిన సొసైటీలు ఉద్యోగుల జీతాలు చెల్లించే పరిస్థితి కూడా లేక అల్లాడుతున్నందున కంప్యూటరీకరణకు అవసరమైన లక్షలాది రూపాయలు ఎలా కేటాయించాలని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల ఆప్కాబ్‌ అధ్యక్షుడు పిన్నమనేని వెంకటేశ్వరరావు రాష్ట్రప్రభుత్వంతో సహకార సంఘాల కంప్యూటరీకరణ విషయమై సంప్రదించినా పురోగతి లేదని పలువురు పీఏసీఎస్‌ అధ్యక్షులు చెబుతున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top