వాటా ఎక్కడండీ

వాటా ఎక్కడండీ

  •  ఎర్ర చందనం వేలంతో రూ.800 కోట్ల ఆదాయం

  •  ఇందులో 5 జిల్లాలకు దక్కాల్సింది రూ.240 కోట్లు

  •  నెలలు గడుస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం

  •  అడగలేని దుస్థితిలో అటవీ శాఖ 

  •  

    సాక్షి ప్రతినిధి, తిరుపతి :  ఎర్ర చందనం విక్రయాల ద్వారా భారీ మొత్తంలో ఆదాయాన్ని సమకూర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇందులో జిల్లాలకు విడుదల చేయాల్సిన వాటాను విస్మరించింది. మొదటి విడత వేలం ముగిసి పది నెలలు గడిచినా వాటా నిధుల ఊసెత్తడం లేదు. రేపోమాపో రెండోవిడత ఎర్రచందనాన్ని వేలం వేసేందుకు సిద్ధమవుతున్న సర్కారు అటవీ శాఖ అవసరాలను మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో జిల్లాల్లో అటవీ సంరక్షణ చర్యలు తంతుగా సాగుతున్నాయి. చాలా చోట్ల అటవీ సంరక్షణ, అభివృద్ధి పనులు అటకెక్కాయి. 

     

    కిందటేడాది చివరలో నిర్వహించిన తొలి విడత ఎర్ర చందనం వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.800 కోట్ల మేర ఆదాయం లభించింది. ఫారెస్ట్‌ యాక్టు ప్రకారం ఎర్రచందనం ఇతరత్రా అటవీ సంపద విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంలో 30 శాతం నిధులను ఆయా వనరులున్న జిల్లాలకు ప్రత్యేక వాటా కింద జమ చేయాల్సి ఉంది. పట్టుబడిన ఎర్రచందనం మొత్తం  చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లోనే లభించింది. ఈ లెక్కన ఈ జిల్లాలకు ఆదాయంలో రూ.240 కోట్లను కేటాయించాల్సి ఉంది. కడప జిల్లాకు రూ.120 కోట్లు, చిత్తూరు జిల్లాకు రూ.90 కోట్లు, మిగతా నిధులు నెల్లూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాలకు విడుదల కావాల్సి ఉంది. జిల్లాలకు రావాల్సిన నిధులను ప్రభుత్వం కేటాయిస్తే అటవుల సంరక్షణ, కొత్త మొక్కలు నాటడం ద్వారా అభివృద్ధి, వన్యప్రాణుల సంరక్షణ, ఫారెస్ట్‌ రేంజి భవనాల నిర్మాణం, స్మగ్లర్ల కట్టడి వంటి పనులన్నీ చేపట్టే వెసులుబాటు లభిస్తుంది. అంతేకాకుండా స్మగ్లర్లను పసిగట్టేందుకు అవసరమైన సీసీ కెమెరాలు, చెక్‌పోస్టులు, హై ఫ్రీక్వెన్సీ స్కానర్లు ఏర్పాటు చేసుకోవచ్చు. నిధులు లేని కారణంగా అటవీ శాఖ ఇవేమీ చేయలేకపోతుంది. బాలపల్లి రేంజిలో సొంత భవనం లేకపోవడం నిధుల కొరతకు తార్కాణం. దీనికితోడు వాహనాల కొనుగోళ్లు, మౌలిక సదుపాయాల కల్పన వంటి పనులన్నీ నిధుల కొరత వల్లనే కార్యరూపం దాల్చడం లేదు. 

     

    నిధులున్నాయా... దారి మళ్లాయా..?

    ఎర్రచందనం విక్రయాల ద్వారా సమకూరిన రూ.800 కోట్లు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. నెలలు గడచినా జిల్లాలకు వాటా నిధులు విడుదల కాకపోవడంతో సందేహాలు తలెత్తుతున్నాయి. అసలీ సొమ్ములు భద్రంగా ఉన్నాయా లేక ఇతరత్రా అవసరాలకు మళ్లించారా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. నెలలు గడుస్తున్నా ఇబ్బందులను అలవాటుగా మార్చుకున్న వివిధ జిల్లాల అటవీ శాఖ అధికారులు నోరు విప్పి అడగలేక అవస్థలు పడుతున్నారు.  
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top