మూడో విడత రుణమాఫీ ఎప్పుడు

మూడో విడత రుణమాఫీ ఎప్పుడు - Sakshi


రెండో విడత జాబితాలోని రైతుల ఖాతాల్లో జమ కాని నగదు

బడ్జెట్‌లో కేటాయింపులు జరిగేనా?




మచిలీపట్నం : రైతు రుణమాఫీకి సంబంధించి మూడో విడత జాబితా ఎప్పటికి విడుదలవుతుంది? ఎప్పటికి రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమఅవుతుంది?..రుణమాఫీ కింద ప్రభుత్వం విడుదల చేసిన నగదు అసలు బకాయికి వడ్డీకైనా సరిపోతుందా? అనే అంశాలపై రైతుల్లో అనుమానాలు నెలకొన్నాయి.  టీడీపీ ప్రభుత్వం రెండు విడతల్లో రుణమాఫీ నామమాత్రంగా విడుదల చేసి చేతులు దులుపుకుంది. మూడో విడత రుణమాఫీ కింద నగదును రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు మీనమేషాలు లెక్కిస్తోందని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి బడ్డెట్‌లో రుణమాఫీకి ఎంతసొమ్ము కేటాయిస్తుందనే అంశంపైనా రైతుల్లో అనుమానాలున్నాయి. ప్రభుత్వం రుణమాఫీ అంశంపై ఇప్పటివరకు పెదవి విప్పకపోవడం గమనార్హం. వ్యవసాయశాఖ, బ్యాంకు అధికారులకు మూడో విడత రుణమాఫీకి సంబంధించి ఎలాంటి సమాచారం లేకపోవడం గమనార్హం.



రెండు విడతల్లో 805కోట్లు జమ

జిల్లాలో 7.03 లక్షల మంది రైతులు రూ.9,137 కోట్లు రుణాలుగా తీసుకున్నారని గతంలో బ్యాంకు అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. వ్యవసాయ రుణాలన్నింటిని మాఫీ చేస్తామని ప్రకటించినా రుణమాఫీ అమలు చేసే నాటికి ప్రభుత్వం  ఆంక్షలు విధించి 4,44,972 మంది రైతులకు రూ.1,519 కోట్లు రుణమాఫీ జరుగుతుందని ప్రకటించింది.



మొదటి విడతగా రూ.577కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో నాలుగుసార్లుగా జమచేశారు. రెండో విడతగా 2.96,324మంది రైతులకు రూ. 232.11 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమచేసే నిమిత్తం రైతు రుణ ఉపశమన పత్రాలను గతేడాది జూన్‌లో అందజేశారు. ఈ నగదు  రైతుల ఖాతాల్లో ఇంకా సక్రమంగా జమకాలేదనే విమర్శలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో వ్యవసాయరుణాలన్నీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చి రైతులను నమ్మించి అధికారం చేపట్టిన టీడీపీ అనంతరం మాట మార్చి ఒక కుటుంబం మొత్తానికి లక్షన్నర వరకు రుణమాపీ చేస్తామని చెప్పింది.  మొదటి విడతలో రూ. 50వేల వరకు రుణమాఫీ జరుగుతుందని ప్రకటించింది. అంతకు మించి పంటరుణం ఉంటే నాలుగు విడతల్లో రుణమాఫీ చేస్తామని చెప్పి సాచివేత ధోరణితో వ్యవహరిస్తోంది. ఒకటి, రెండు విడతల్లో రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిన నగదు తమపేరున ఉన్న రుణానికి వడ్డీ కిందే సరిపోయిందని అసలు బకాయి అలానే ఉందని పలువురు రైతులు         అంటున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top