ఈ రోడ్డు సంగతేంటి?

ఈ రోడ్డు సంగతేంటి?


హంసలదీవి వద్ద రోడ్డు నిర్మాణానికి హైకోర్టు బ్రేక్

కొల్లేరు అభయారణ్య రోడ్లపైనా దృష్టిపెట్టండి

పరిశీలనతోనే సరిపెట్టిన అటవీ అధికారులు

 

కైకలూరు : చట్టం ఎక్కడైనా చట్టమే. అందరూ దీనికి లోబడి నడుచుకోవాల్సిందే. అభయారణ్య చట్ట ప్రకారం కొన్ని కఠిన నియమనిబంధనలు రూపొందించారు. కృష్ణా వన్యప్రాణుల అభయారణ్య పరిధిలోని అవనిగడ్డ ఫారెస్టు రేంజ్‌లో హంసలదీవి వద్ద రోడ్డు నిర్మాణానికి హైకోర్టు బుధవారం బ్రేక్ వేసింది.


తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావుతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిన విషయం విదితమే. కేంద్ర, అటవీ పర్యావరణ అనుమతులు తీసుకోవాలని వారు తమ   ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కొల్లేరు అభయారణ్యంలో రోడ్లు వేయించిన టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్‌విప్ చింతమనేని ప్రభాకర్ అంశం చర్చనీయాంశమవుతోంది.

 

చట్టాలపై లెక్కేలేదు..

కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల పరిధి కొల్లేరులో 77,131 ఎకరాలను అభయారణ్యంగా గుర్తించి టీడీపీ ప్రభుత్వం 1999లో జీవో 120 జారీ చేసింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం కనీసం అగ్గిపెట్టెను సైతం అభయారణ్యంలోకి తీసుకెళ్లకూడదనే నిబంధనలు ఉన్నాయి. టీడీపీ అధికారంలోకి రాగానే అభయారణ్య చట్టాలు కొల్లేరులో కలిసిపోయాయి. పచ్చ నాయకుల కనుసన్నల్లో పనిచేయడం అటవీశాఖాధికారులకు కత్తిమీద సాములా మారింది. కొల్లేరు ఆపరేషన్ సమయంలో ధ్వసం చేసిన అక్రమ చేపల సాగుకు రెండింతల సాగు నేతల కనుసన్నల్లో కొల్లేరులో యథేచ్ఛగా జరుగుతోంది.

 

చింతమనేని తీరుపై చర్యలేవి?

చింతమనేని ప్రభాకర్ కొల్లేరు అభయారణ్యంలో అనుమతులు లేకుండా దగ్గరుండి రోడ్లు వేయిస్తుంటే ఆయనకు చట్టాలు వర్తించవా? అనే అనుమానం కలుగుతోంది. కైకలూరు మండలం ఆటపాక పక్షుల కేంద్రం వద్ద 2015 నవంబరు ఏడో తేదీ అర్ధరాత్రి కోమటిలంక గ్రామానికి చేరే పక్షుల దొడ్డి గట్టుపై రబ్బీస్ రోడ్డును చింతమనేని దగ్గరుండి వేయించారు.


అడ్డు వచ్చిన అటవీ అధికారులపై   దౌర్జన్యానికి దిగారు. చింతమనేనిపై అదే రోజు కైకలూరులో పోలీస్‌స్టేషన్‌లో అటవీ అధికారులు ఫిర్యాదు కూడా చేశారు. మండవల్లి మండలం చింతపాడు వద్ద 2016 మే 23వ తేదీన అభయారణ్యంలోని పెదయాగనమిల్లి రోడ్డును వేయించారు. వద్దని చెప్పిన అటవీశాఖ ఏసీఎఫ్ అధికారి వినోద్‌కుమార్‌ను ‘దమ్ముంటే రారా..’ అని తిడుతూ చింతమనేని సవాల్ విసిరారు. పై రెండు రోడ్లు పక్కా అభయారణ్యంలో ఉన్నప్పటికీ అటవీ అధికారులు అడ్డుకోలేకపోయారు.

 

జీవో లొసుగులను అడ్డుపెట్టుకుని..

అభయారణ్యంలో జీవో 120 ప్రకారం పూర్వం   ఏర్పాటుచేసుకున్న రోడ్లకు యథాతథంగా మరమ్మత్తులు చేసుకోవాలని, రోడ్ల విస్తీర్ణం పెంచకూడదని ఉంది. అధికార నాయకులు మాత్రం ఏకంగా అభయారణ్యంలో తారురోడ్డు నిర్మాణాలకు పూనుకుంటున్నారు. అభయారణ్య పరిధిలోని చింతపాడు-పెదయాగనమిల్లి రోడ్డుకు ప్రభుత్వం రూ.2.15 కోట్ల నిధులు కేటాయించింది. మా అనుమతులు లేకుండా ఎలా చేస్తారని అటవీ అధికారులు ప్రశ్నించారు. అసలు ఈ రోడ్ల నిర్మాణం కొల్లేరులోని చేపల చెరువులకు మేతల రవాణా కోసం అన్నది అందరికీ తెలిసిన విషయమే.

 

ఉన్నతాధికారులకు నివేదించాం..

అభయారణ్యం అనేది ఎక్కడైనా ఒక్కటే. ఒకే రకమైన చట్టాలు వర్తిస్తాయి. ఆటపాక, చింతపాడు అభయారణ్యంలో జరిగిన రోడ్ల విషయాన్ని ఉన్నతాధికారులకు వివరించాం. కేంద్ర అటవీ, పర్యావరణశాఖ నుంచి అనుమతులు కచ్చితంగా కావాలి. అనుమతులు లేకుండా అటవీ అధికారులపై ఒత్తిడి తేవడం సరికాదు.     

     - వినోద్‌కుమార్, అటవీశాఖ ఏసీఎఫ్

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top