రండమ్మా .. రండి

రండమ్మా .. రండి - Sakshi


కడప అగ్రికల్చర్‌ :


నిన్న....మొన్నటి వరకు ఆకాశంలో విహరించిన కూరగాయల ధరలు నేడు నేలకు దిగి రావడంతో వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసరంగా వినియోగించే టమాటా మొన్నటికి మొన్న కిలో ధర రూ.20–30లు పలికింది. అలాగే మిరప ధర కిలో రూ. 30–40లు పలికింది. నేడు టమాటా కిలో రూ. 4–5లకు తగ్గింది. పచ్చిమిరపకాయలు కిలో రూ.15లు పలుకుతున్నాయి. అలాగే వంకాయలు కిలో రూ.8, బెండ కిలో రూ.8, మటిక కిలో రూ.8, బీర కిలో రూ.10. కాకర కిలో రూ.8 మాత్రమే పలుకుతుండడంతో వినియోగదారులు కిలోల కొద్ది తీసుకెళుతున్నారు. కూరగాయ ధరలు తగ్గడంతో వ్యాపారులు రండమ్మా...రండి కూరగాయలు సంచి నిండుగా తీసుకెళ్లండని కేకలు వేసి కడప నగరంలోని రైతుబజారులోను, పెద్ద మార్కెట్‌లోను విక్రయిస్తున్నారు. నిన్న మొన్నటివరకు అధిక ధరలతో పావు కిలో, అరకిలో మాత్రమే కొనుగోలు చేసిన వినియోగదారులు ఇప్పుడు ధరలు తగ్గడంతో ఒక్కో రకం కిలో, రెండు కిలోలు తీసుకెళుతున్నారని వ్యాపారులు చెబుతున్నారు.

తగ్గని కర్ణాటక కాయలు

అయితే కర్ణాటక నుంచి వచ్చే కూరగాయ ధరలు మాత్రం తగ్గడం లేదు. బీట్రూట్, కంద, చేమ, కాలిఫ్లవర్, క్యారెట్, క్యాబేజీ, బెంగళూరు మిరప, కీర ధరలు రెండు నెలల నుంచి ఉన్న ధరలే ఇప్పుడు అలాగే ఉన్నాయి. అయితే స్థానికంగా జిల్లాలో పండే కూరగాయలు మాత్రం అన్నిరకాలు కిలో రూ.10ల లోపే ఉంటున్నాయి. దీంతో వినియోగదారులు కర్ణాటక నుంచి వచ్చిన కూరగాయల కొనుగోలు తగ్గించుకుని స్థానికంగా తక్కువ ధరకు లభ్యమయ్యే కూరగాయల పైనే మొగ్గుచూపుతున్నారని వ్యాపారులు తెలిపారు. ఇంకా ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top