వానొస్తేనే.. సీత పెళ్లి..!

వానొస్తేనే.. సీత పెళ్లి..!


నీళ్లులేక ఆగిన గొత్తికోయ యువతి వివాహం

♦ వర్షాల కోసం ఎదురుచూస్తున్న సిర్తనిపాడు

♦ పాల్వంచ ఏజెన్సీ అడవిలో గిరిజన గూడెం గోడు

 

 సాక్షి ప్రతినిధి, ఖమ్మం:
ఆ ఆదివాసీ గూడెమంతా వరుణుడి కరుణ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తోంది. వర్షం ఎప్పుడు వస్తుందోనన్న ఆత్రుత వారిది. వర్షం పడితే ఈ ఆదివాసీ గొత్తికోయల గూడెంలోని 40 కుటుంబాల్లో పండగే. మాట.. ముచ్చట చేసుకున్న ఆ గూడెంలోని సీత పెళ్లి చేయాలన్నది వీరందరి తపన. గ్రామానికి ఆధారమైన ఒక్క తోగులోనే ఉదయం.. రాత్రి 40 బిందెల నీళ్లే వస్తాయి. ఈ నీళ్లతో సీత పెళ్లి ఎలా చేయాలన్నది ఖమ్మం జిల్లా పాల్వంచ ఏజెన్సీలోని సిర్తనిగూడెం గొత్తికోయల వేదన. మండే ఎండల్లో వచ్చే కారుమబ్బులను చూసి ఆ గూడెం అంతా వరుణ దేవా.. కటాక్షించు.. అంటూ వర్షం కోసం నిరీక్షిస్తోంది. పాల్వంచ పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉల్వనూరు పంచాయతీ పరిధిలో ఉంది సిర్తనిగూడెం. దీనికి కరెంట్ లేదు. 15 ఏళ్ల క్రితం ఛత్తీస్‌గఢ్ నుంచి 40 గొత్తికోయ కుటుంబాలు ఇక్కడికి వలస వచ్చాయి. గూడెంలో ఉండే 150 మంది అడవిలో పోడు కొట్టుకొని వ్యవసాయం చేస్తున్నారు. పంటల సేద్యం, ఇంట్లో శుభకార్యాలన్నీ ఈ పదేళ్లలో ఆటంకాల్లేకుండా సాగాయి. కానీ ఈసారి వర్షాభావంతో వారంతా దప్పిక తీర్చుకోవడానికి 2 కి.మీ. వెళ్లి తోగు నీళ్లు తెచ్చుకుంటున్నారు.



 మాట ముచ్చట చేసుకున్నారు

 బాహ్యప్రపంచానికి దూరంగా ఉన్న ఈ గొత్తికోయల సంప్రదాయం నాగరిక సమాజానికి నడత నేర్పేలా ఉంది. సీత పెళ్లి మాట ముచ్చటే ఇందుకు నిదర్శనం. చర్ల మండ లం పెద్దమిడిసిలేరు పంచాయతీ పరిధి తిప్పాపురంలోని మాడివి ఉంగారావు సీతకు వరుసకు బావ అవుతాడు. ఆమెను ఇతడికి ఇవ్వడానికి ఇరు కుటుంబాలు జనవరిలో సిర్తనిపాడులో మాట ముచ్చట చేసుకున్నా రు. గ్రామస్తుల సమక్షంలో సీతను, ఉంగారావును పిలిచి ఇద్దరికీ ఇష్టమా కాదా అని మాట్లాడించారు. ఇద్దరూ ఇష్టపడటంతో ఆరోజే గూడెంలో పండుగ చేసుకున్నారు. పెళ్లి సిర్తనిగూడెంలోనే చేయాలని నిర్ణయిం చారు. కానీ.. గూడెంలో ఎవరి పెళ్లి చేయాలన్నా ఇంటిల్లిపాదికీ 3 రోజులు పండగే. గూడెమే కాదు అబ్బాయి తరఫున వచ్చిన వారికి నచ్చినన్ని వంటలు చేసి పెట్టాలి.

 గొత్తికోయల పెళ్లిలో బిర్యానీలాంటి ఇష్టభోజనం వండేందుకు ‘లంది’ (నూకల రవ్వ) కూడా సిద్ధంగా ఉంచారు. మరి నీళ్లే లేకుంటే ఇక పెళ్లి ఎలా..? అని ఆ గూడేనికి రంధి పట్టుకుంది.

 

 సీత పెళ్లి కోసం భగీరథ యత్నం


 గూడెం చుట్టుపక్కల వాగులు, వంకలు ఎండిపోయాయి. తాగడానికి నీళ్లు లేకపోవడంతో పశువులనే అడవికి వదిలారు. గూడేనికి 2 కి.మీ.దూరంలో ఒక్క తోగే (బావి) ఉండటంతో సరిపోవడం లేదు. దీంతో వారంతా మరో రెండు తోగుల్ని ఒక్కోటి  10 మీటర్ల లోతున తవ్వేందుకు భగీరథ యత్నం చేసినా.. చుక్క నీరు రాలేదు.

 

 అన్నీ సిద్ధం చేసిన..

 ఈమె పేరు ఉంగమ్మ.. సీత తల్లి. కూతురు పెళ్లికి కావాల్సినవన్నీ తయారు చేసి పెట్టుకుంది. లంది, నూనె, కొర్రలు, సంతలకు పోయి పెళ్లికి కావాల్సిన వస్త్రాలు తెచ్చి పెట్టుకుంది. ఆమెను కది లిస్తే.. ‘గూడేనికి దూరంలో ఉన్న తోగులోనే నీళ్లు దొరకడం లేదు.. వానొస్తేనే మా సీత పెళ్లి’ అని ఆవే దనతో చెప్పింది.    సీత పెళ్లిని పండుగలా చేద్దామని.. పంటలు నూర్చి సిద్ధంగా పెట్టుకొని, భగీరథ యత్నంచేసి ఆశలు వదులుకున్న సిర్తనిపాడు గొత్తికోయలు.. ఇక చేసేదేమీ లేక వరుణుడి కటాక్షం కోసం కళ్లల్లో వత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top