క్రియాశీలకంగా వ్యవహరిస్తాం

క్రియాశీలకంగా వ్యవహరిస్తాం - Sakshi


సమస్యలపై తాత్సారం చేశాం: కోదండరామ్

 ప్రభుత్వ పనితీరుపై స్పష్టత కోసమే ఆగాం

 రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు వాస్తవమే, అధ్యయనం చేస్తాం

 రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఉద్యోగుల విభజన జరగాలి

 వేగంగా పూర్తిచేయాలంటూ కేంద్రంపై ఒత్తిడి తెస్తామని వెల్లడి

 

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పరిస్థితుల విషయంలో భవిష్యత్తులో క్రియాశీలకంగా వ్యవహరిస్తామని.. సమస్యలను ప్రస్తావించడంలో కొంత తాత్సారం చేసిన మాట వాస్తవమేనని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ చెప్పారు. ప్రభుత్వ పనితీరుపై స్పష్టత కోసమే ఇన్నాళ్లూ ఆగామని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లో శనివారం టీఎన్జీవోల కేంద్ర కార్యాలయంలో కోదండరామ్ అధ్యక్షతన టీజేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం కమిటీ సభ్యులతో కలసి కోదండరామ్ విలేకరులతో మాట్లాడారు. ‘‘ప్రజా సంఘాలతో కూడిన టీజేఏసీ లక్ష్యం తెలంగాణ అభివృద్ధి. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆలోచనల మధ్య వైవిధ్యం ఉంటుంది. రాజకీయ పార్టీలు అధికారాన్ని కైవసం చేసుకునే దిశగా పనిచేస్తాయి. మేం సమస్యల పరిష్కారం దిశగా పనిచేస్తాం. పార్టీలకు అవసరమైతే మా పక్షాన సహకారం, విమర్శ రెండూ ఉంటాయి..’’ అని కోదండరామ్ చెప్పారు. ఏడాది కాలంగా విభజన నత్తనడకన సాగుతోందని, విభజన ప్రక్రియ వేగవంతంగా జరిగేలా కేంద్రం చొరవ తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విభజన ప్రక్రియను పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక మంత్రికి బాధ్యత అప్పగించాలన్నారు. విభజన సమస్యలపై అవసరమైతే టీజేఏసీ పక్షాన ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతామని... విభజన ప్రక్రియ తీరుతెన్నులపై నివేదిక సమర్పిస్తామని కోదండరామ్ తెలిపారు. విభజన ప్రక్రియ వేగవంతం చేయాలంటూ ఆగస్టు 6న ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా టీజేఏసీ పక్షాన పలు కార్యక్రమాలు, దీక్షలు, సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు.

 

 రైతు ఆత్మహత్యలు వాస్తవమే!

 

 రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు వాస్తవమేనని, రైతులకు సహకారం ఇచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కోదండరామ్ వ్యాఖ్యానించారు. ఆత్మహత్యలపై టీజేఏసీ తరపున సబ్‌కమిటీ ఏర్పాటు చేసి అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. రైతు సంఘాల సహకారంతో సమస్యల పరిష్కారానికి తమ వంతు ప్రయత్నం చేస్తామని, నెల రోజుల్లోగా ఈ అంశంపై టీజేఏసీ పక్షాన ప్రకటన చేస్తామని తెలిపారు. ‘‘ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పెత్తనానికి హైకోర్టు వేదికగా నిలిచింది. హైకోర్టును ఎంత త్వరగా విభజిస్తే అంత త్వరగా సంపూర్ణ తెలంగాణ సిద్ధించినట్లుగా భావిస్తున్నాం. 90 ప్రభుత్వ రంగ సంస్థలకు గాను షిలాభిడే కమిటీ 60 సంస్థల్లో మాత్రమే ఆస్తుల పంపిణీ పూర్తి చేసింది. తెలంగాణ వికాసానికి ఈ సంస్థల విభజన కీలకం. విభజన పూర్తి కాకుండా ఏ ప్రభుత్వమూ పనిచేయలేదు..’’ అని ఆయన పేర్కొన్నారు.

 

 రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకే..

 

 రాష్ట్రపతి ఉత్తర్వులు, గిర్‌గ్లానీ కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకోకుండా జరిగే ఉద్యోగుల విభజనతో తెలంగాణకు న్యాయం జరగదని... రాష్ట్ర స్థాయికే పరిమితం కాకుండా జోనల్, జిల్లా స్థాయిలోనూ పొరుగు రాష్ట్రం వారిని వెనక్కి పంపాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ  రంగ సంస్థల్లో తెలంగాణ ఉద్యోగులు, స్థానికులకు ఉద్యోగాల కల్పన తదితర అంశాలపై ఆగస్టు 15 తర్వాత కార్మిక సంఘాలతో సమావేశమవుతామని తెలిపారు. ఉస్మానియా తరలింపు అంశంపై సోమవారం మధ్యాహ్నం టీజేఏసీ బృందం ఆసుపత్రిని సందర్శించి అభిప్రాయం వ్యక్తం చేస్తుందని పేర్కొన్నారు. ఆంధ్రా ప్రాంత అధికారుల సహకారం లేకపోవడం వల్లే విద్యుత్ ఉద్యోగుల విభజన సమస్య తలెత్తిందంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని కోదండరామ్ సమర్థించారు. ఈ సమావేశంలో ఉద్యోగ, ప్రజాసంఘాల ప్రతినిధులు కారెం రవీందర్‌రెడ్డి, మమత, రాజేందర్‌రెడ్డి, శ్రీధర్, కృష్ణాయాదవ్, రఘు, మల్లికార్జున్, ప్రహ్లాద్, మహిపాల్‌రెడ్డి, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.


 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top