కార్పొరేషన్లో అక్రమ వసూళ్లు తగవు: ఎమ్మెల్యే అనిల్‌

కార్పొరేషన్లో అక్రమ వసూళ్లు తగవు: ఎమ్మెల్యే అనిల్‌ - Sakshi


► పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలి



నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): కార్పొరేషన్లో అక్రమ వసూళ్లకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్‌ అనిల్‌కుమార్‌యాదవ్‌ పేర్కొన్నారు. 53వ డివిజన్‌ వెంకటేశ్వరపురంలో శుక్రవారం పర్యటించిన ఆయన ప్రజల సమస్యలను ఆరాతీశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ ప్రాంతంలో 300 కుటుంబాలు మరుగుదొడ్లకు దరఖాస్తు చేసుకున్నారని, ఈ విషయమై పలుమార్లు అధికారులకు తెలియజేసినా నేటికీ పట్టించుకోలేదని ఆరోపించారు. భగత్‌సింగ్‌కాలనీ, జనార్దన్‌రెడ్డికాలనీల్లో మరుగుదొడ్లను నిర్మించుకునే వారి నుంచి ఇంటికి రూ.రెండు వేలు వసూలు చేశారని, అయితే నేటికీ ఆ దరఖాస్తులను పరిశీలించే పరిస్థితి కూడా లేదని విమర్శించారు.



ఇంజినీరింగ్‌ విభాగంలోని ఇంజినీర్లకు గతంలో కట్టిన మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించాల్సిన బాధ్యత ఉందన్నారు. టెండర్‌ తీసుకున్న వారు వేగవంతంగా నిర్మాణ పనులను చేపట్టడంలేదని ఆరోపించారు. హౌస్‌ ఫర్‌ ఆల్‌ కింద స్థలం ఉంటే ఇల్లు కట్టుకోమని చెప్తున్నారని, అయితే వెంకటేశ్వరపురం, జనార్దన్‌రెడ్డికాలనీ ప్రాంతాల్లో ఇంటి ప్లాన్‌కు కార్పొరేషన్‌ రూ.700 నిర్ణయిస్తే నిరుపేదల వద్ద రూ.1500 వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌నగర్‌లో జరిగిన అవకతవకలపై అధికారులను సస్పెండ్‌ చేశారని, దీన్ని కలెక్టర్, కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు.



ఈ వసూళ్లలో అధికారుల ప్రమేయం ఉంటే వారికి క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని కోరారు. ఈ ప్రాంతంలో 30 కరెంట్‌ స్తంభాలను వేయించాల్సిన అవసరం ఉందని, అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. కార్పొరేటర్లు దేవరకొండ అశోక్, ఓబిలి రవిచంద్ర, నాయకులు నాగరాజు, నాగభూషణం, జాకీర్, జమీర్, కేవీఆర్‌ శ్రీను, వెంకటేశ్వర్లు, అన్వర్, హర్షద్, కరిముల్లా, ప్రసాద్, సుధాకర్, సంక్రాంతి కల్యాణ్, పోలంరెడ్డి వెంకటేశ్వర్లురెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top