నీటి బుగ్గలు వస్తుంటే నివసించేదెట్టా?

నీటి బుగ్గలు వస్తుంటే నివసించేదెట్టా?

- గోరుకల్లులో పరిస్థితిపై గ్రామస్తుల ఆవేదన

- సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట భారీ ధర్నా

- ప్యాకేజీ పునరావాసానికి ఎమ్మెల్యే గౌరు చరిత డిమాండ్‌

 

 

 

 

కర్నూలు(న్యూసిటీ):

‘నరసింహరాయ సాగర్‌(గోరుకల్లు రిజర్వాయర్‌) కారణంగా ఊరిలో నీటి బుగ్గలు, ఊటలు వస్తున్నాయి.. ఈ కారణంగా ఇళ్లు పడిపోతున్నాయి.. నిత్యం ఈ పరిస్థితి ఉండడంతో గ్రామంలో ఉండలేకపోతున్నాం.. సమస్యను పరిష్కరించాలని, పునరావాసం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోవడం లేదు.. ఈ పరిస్థితుల్లో అక్కడ ఎలా నివాసం ఉండాలి’ అంటూ గోరుకల్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎం పాణ్యం జోన్‌ కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో గురువారం గ్రామం నుంచి భారీగా తరలివచ్చి కర్నూలు కలెక్టరేట్‌ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ముందుగా సి.క్యాంప్‌ నుంచి మద్దూర్‌నగర్, గాయత్రి ఎస్టేట్‌ మీదుగా ర్యాలీగా చేశారు. కలెక్టరేట్‌ ఎదురుగా బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.  ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి అక్కడకు వచ్చి గ్రామస్తులతో మాట్లాడారు. రిజర్వాయర్‌ పనులు నాసిరకంగా చేయడం వల్లే సమస్య వచ్చిందన్నారు. రిజర్వాయర్‌ సామర్థ్యం 12 టీఎంసీలు కాగా ప్రస్తుతం నింపింది 2.5 టీఎంసీలేనని, ఈ మాత్రం నింపితేనే ఇలా ఉంటే పూర్తిస్థాయిలో నిల్వ చేస్తే సమస్య తీవ్రంగా ఉంటుందన్నారు. ఇప్పటికే 15 గృహాలు పడిపోయాయని, మరికొన్ని ఇళ్ల పునాదులు కూలిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యులైన అధికారులను సస్పెండ్‌ చేయాలని, పనులు చేసిన కాంట్రాక్టర్లను బ్లాక్‌ లిస్టులో పెట్టాలని డిమాండ్‌ చేశారు. రిజర్వాయర్‌ కోసం భూములు కోల్పోయిన రైతులకు ఆర్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాలని, గ్రామస్తులకు పునరావాసం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఇందుకు సంబంధించి నాలుగు నెలల క్రితమే కలెక్టర్‌ సి.హెచ్‌.విజయమోహన్‌కు విజ్ఞప్తి చేసినా పట్టించుకున్న పాపాన పోలేదని ధ్వజమెత్తారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.షడ్రక్‌ మాట్లాడుతూ సమస్యపై కమిటీ వేసి కలెక్టర్‌..కాలయాపన చేస్తున్నారని ‍కలెక్టరఆరోపించారు. అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నిర్మలమ్మ మాట్లాడుతూ గ్రామస్తులకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామన్నారు.

కలెక్టరేట్‌లోకి దూసుకుపోయిన గ్రామస్తులు..

సమస్యపై గ్రామస్తులు డీఆర్వో గంగాధర్‌ గౌడ్‌కు వినతిపత్రం అందించారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వానికి నివేదిక పంపుతామని ఆయన హామీ ఇవ్వగా ఈ పద్ధతి సరికాదంటూ గ్రామస్తులు కలెక్టరేట్‌ లోపలికి దూసుకెళ్లారు. జిల్లాకలెక్టర్‌ వచ్చేవరకు అక్కడ అర్ధగంటకు పైగా బైఠాయించారు. అయితే కలెక్టర్‌ వచ్చిన తర్వాత మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి, సీపీఎం నాయకులు హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. ధర్నాలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, సీపీఎం నగర నాయకులు ఎం.గోపాల్, వెంకట్రాముడు, సాయిబాబా, మహిళా సంఘం నాయకులు విజయలక్ష్మి, ఐద్వా నాయకురాలు ఈ.ఎల్‌.ఎస్‌.రత్నమ్మ తదితరులు పాల్గొన్నారు. 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top