నీరందని హరితహారం

నీరందని హరితహారం - Sakshi


► ఎండిన మొక్కలే దర్శనం..నీరందని వైనం

► ‘ఉపాధి’లోను దక్కని మొక్కలు

► ముస్తాబాద్‌లో  ఎండిన 3.25 లక్షల మొక్కలు

► నెరవేరని సర్కార్‌ లక్ష్యం




ముస్తాబాద్‌: వానలు వాపసు రావాలే.. కొతులు అడవులకు పోవాలే. నవ తెలంగాణ పచ్ఛధనం పరచుకోవాలేనన్న సీఎం కేసీఆర్‌ ఉన్నత లక్ష్యంతో హరితహరం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారు. కోట్లాది మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమస్థాయిలో ముందుకు తీసుకెళ్లగలిగారు. మొక్కల పెంపకానికి నిర్ధిష్ట ప్రణా ళికను సైతం అమలు చేస్తున్నారు.


ఇదంతా నాణెనికి ఒకవైపు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ఉద్దెశ్యాన్ని అమలు చేయాల్సిన అధికారులు,సిబ్బంది ఉదాసీనత ఒక్క గొప్ప లక్ష్యంతో ప్రారంభించిన హరితహరం ఆదిలోనే ఆవాంతరాలు ఎదుర్కొంటుంది. సరైన నీరందక.. నిర్వహణ సరిగా లేక కోట్లాది మొక్కలు ఎండిపోతున్నాయి. మండుతున్న ఎండలు.. అడుగంటిన భూగర్భ జలాలతో నీరు పోసేవారు లేక మొక్కలు మాడిపోతున్నాయి.



ఉన్నత లక్ష్యం నీరుగారుతోంది...

మండలంలో గత వర్షాకాలం అక్టోబర్‌లో ప్రభుత్వం హరితహరం పథకంలో భాగంగా 7 లక్షల 68 వేల 268 మొక్కలు నాటారు. ఉపాధిహమీ పథకంలో కూలీలకు పనులు కల్పిస్తూ హరితహరం అమలు చేపట్టారు. గుంతలు తవ్వడం, మొక్కలు నాటడం, మొక్కల చుట్టు కంచెను నిర్మించడం వంటి పనులను కూలీలతో చేయిం చారు. ఆ పై కూలీలతోనే ప్రతి రోజు మొక్కలకు నీరు పోయించారు. ఒక్కొ కూలికి 400 మొక్కలను కేటాయించారు. ప్రతి మొక్కకు రూ.5 చోప్పున ఇస్తారు. ఉపాధిహమీ పథకం ద్వారానే కాకుండా ముస్తాబాద్‌ మండలంలో ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, అటవీశాఖల ఆధ్వర్యంలో లక్షలాది మొక్కలు నాటారు. రోడ్ల వెంట, బంజరు భూముల్లో, చెరువుల గట్లపై, పాఠశాలలు, మైదానాల్లో, సామాజిక భవనాల వద్ద మొక్కలు నాటారు.



అడుగంటిన జలాలతో ఆవిరైన మొక్కలు..

సామాజిక భవనాలు, పాఠశాలల్లో మాత్రమే మొక్కలు దక్కాయి. అడవులు, రోడ్ల వెంట నాటిన మొక్కలలో నలభైశాతం నశించాయి. ముస్తాబాద్‌ మండలంలో ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం 3 లక్షల 24వేల 986 మొక్కలు ఎండిపోయినట్లు పేర్కొంటున్నారు. మరో 2 లక్షల వరకు మొక్కలు నీరందక ఎండిపోయినట్లు తెలుస్తోంది.



మండిపడ్డ ఉన్నతాధికారులు..

హరితహరంలో నాటిన మొక్కలను సంరక్షించడంలో ఉపాధిహమీ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహించారని సాక్షాత్తు జిల్లా కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉపాధి కూలీటలను సరిగా వినియోగించకపోవడం, మొక్కల పెంపకంలో అనుశీలన లోపించడం లక్షలాది మొక్కల ప్రాణాలు పోవడానికి కారణంగా భావిస్తున్నారు.



ఉపాధి కూలీలకు దక్కని వేతనాలు

హరితహరంలో మొక్కలు నాటిన నుంచి ఉపాధిహమీలో కూలీల ద్వారా నీరు అందిస్తున్నారు. గతేడాది అక్టోబర్‌ మాసం నుంచి కూలిలు నీళ్లు పోస్తుండగా.. ఇప్పటి వరకు పైసా వేతనం వారు పొందలేదు. వందలాది మంది కూలీలకు రావాల్సిన బకాయిలు సకాలంలో అందక కూలీలు సరిగా పనిచేయడం లేదు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top