పుష్కరస్నానం కష్టమే!

ధరూరు మండలం పెద్ద చింతరేవుల పుష్కరఘాట్లలోకి నీళ్లు చేరి నిలిచిపోయిన సైడ్‌వాల్‌ పనులు

  •  ఉధృతంగా ప్రవహిస్తున్న కృష్ణమ్మ 

  •  ఘాట్లలోకి చేరిన నీళ్లు 

  •  నిలిచిన పుష్కర పనులు

  • గద్వాల: రోజురోజుకూ పుష్కరాలకు సమయం దగ్గర పడుతోంది. ఒకటి రెండుఘాట్ల పనులు మినహా మిగిలినవి మందకొడిగా సాగుతున్నాయి. వీటి వేగం పుంజుకోవాల్సి ఉంది. గద్వాల నియోజకవర్గంలోని ధరూర్, గద్వాల మండలాల పరిధిలో మొత్తం తొమ్మిది పుష్కరఘాట్లను నిర్మిస్తున్నారు. అందులో కొన్నిఘాట్ల పనులు పూర్తి కావచ్చాయి. మరికొన్ని ఘాట్ల దగ్గర పనులు నత్తనడకన సాగు..తున్నాయి. ఐదురోజుల నుంచి ఎగువ ప్రాంతం నుంచి వరద ఉధృతి పెరగడంతో కృష్ణానది నిండుగా ప్రవహిస్తోంది. దీంతో జూరాల ప్రాజెక్టు పవర్‌హౌస్‌ ద్వారా, కాలువల ద్వారా నీటిని దిగువకు వదిలారు. కృష్ణానదిలో పెరిగిన నీటి ప్రవాహంతో కొత్తగా చేపడుతున్న పుష్కరఘాట్లలోకి నీరు వచ్చి చేరింది. దీంతో కొన్నిచోట్ల పనులకు ఆటంకాలు ఏర్పడగా, మరికొన్ని చోట్ల పనులను నిలిపివేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే కొన్ని ఘాట్ల నిర్మాణాలు అర్థాంతరంగా నిలిచిపోనుండటంతో ఈసారి పుష్కరభక్తులకు ఇబ్బందులు తప్పవు.

     

    పెద్ద చింతరేవుల (ధరూరు మండలం)

    పొడవు : 60మీ., వెడల్పు: 12మీటర్లు (నాలుగు వరుసలు) 

    పని విలువ: రూ.1.29 కోట్లు 

    పరిశీలన: ధరూరు మండలం పెద్దచింతరేవుల వద్ద నూతన ఘాట్‌ను నిర్మిస్తున్నారు. నెలరోజుల క్రితం పనులను ప్రారంభించారు. మొదట్లో పనులు నత్తనడకన సాగాయి. ప్రస్తుతం పుష్కరాల సమయం ముంచుకొస్తుండటంతో కాంట్రాక్టర్లు ఆదరాబాదరగా ఘాట్ల నిర్మాణాన్ని చేపడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ కరువైంది. ఈ సమయానికి పనులు కాస్త పూర్తి కావాల్సి ఉంది. నాలుగు వరుసల పుష్కరఘాట్ల నిర్మాణంలో రెండు వరుసలు మాత్రమే పూర్తయ్యాయి. మూడో వరుస పనులు సాగుతున్నాయి. మూడు రోజుల క్రితం కృష్ణానదికి వరద ఉధృతి పెరగడంతో నీటిని దిగువకు విడుదల చేశారు. ఘాట్లపైకి నీళ్లు చేరాయి. దీంతో పూర్తి చేసిన రెండు వరుసల ఘాట్లలో నీళ్లు చేరడం వల్ల మెట్లను అసంపూర్తిగా నిర్మించారు. వరద ఉధృతికి అడ్డుకునేందుకు సైడ్‌వాల్‌ను నిర్మించాల్సి ఉంది. దీని కోసం పునాదులు తవ్వారు. నీటి ఉధృతి పెరగడంతో అవి కాస్త మునిగిపోయాయి. ప్రస్తుతం సైడ్‌వాల్‌ నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. పుష్కరాలకు సమయం దగ్గర పడుతుండటంతో పనుల నాణ్యతపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

    నాణ్యత పాటిస్తున్నాం..

    పనులు చేపడుతున్న పుష్కర ఘాట్లలోకి నీళ్లు చేరాయని సంబంధిత ఏఈ రాంచందర్‌ తెలిపారు. రెండు, మూడు రోజుల్లో నీళ్లు తగ్గగానే అసంపూర్తిగా ఉన్న మెట్లను పూర్తిచేస్తాం. తర్వాత సైడ్‌వాల్‌ నిర్మాణాన్ని నిర్మిస్తామన్నారు. పనులను పర్యవేక్షిస్తూ నాణ్యత ప్రమాణాలను పాటిస్తున్నామన్నారు. 

     

    జమ్ములమ్మ రిజర్వాయర్‌(గద్వాల మండలం)

    పొడవు: 30 మీ., వెడల్పు : 10 మీ. 

    పని విలువ: రూ. 48.50 లక్షలు

    పరిశీలన: గద్వాల మండలం, జమ్ములమ్మ రిజర్వాయర్‌ ఆనకట్ట పక్కన నిర్మించ తలపెట్టిన పుష్కరఘాట్‌ పనులు నత్తను తలపిస్తున్నాయి. మరో 20రోజుల్లో పుష్కరాలు ప్రారంభమవుతున్న దశలో కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. వారం రోజుల క్రితం పుష్కరఘాట్‌ నిర్మాణ పనుల కోసం శ్రీకారం చుట్టారు. కేవలం మట్టి పనులు మాత్రమే పూర్తయ్యాయి. సిమెంట్‌ కాంక్రీటు పనులు ప్రారంభం కాలేదు. జమ్ములమ్మ పుష్కరఘాట్‌పై మొదటి నుంచి అధికారులు, కాంట్రాక్టర్లు పట్టనట్లుగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జూరాల కాలువ ద్వారా జమ్ములమ్మ రిజర్వాయర్‌కు భారీస్థాయిలో నీళ్లు చేరాయి. దీంతో పుష్కరఘాట్‌ కోసం తవ్విన గుంతల్లోకి నీళ్లు వచ్చి చేరాయి. రెండు రోజుల పాటు నీటిని మోటార్ల సహాయంతో తోడి వేసే చర్యలు చేపట్టారు. కాలువ నుంచి రోజురోజుకు నీటి ప్రవాహం పెరగడంతో పుష్కరఘాట్ల గుంతలు పూర్తిగా మునిగిపోయాయి. ప్రస్తుత నీటి పరిస్థితి చూస్తే ఘాట్‌ నిర్మాణ పనులు ప్రశ్నార్థకంగా మారింది. చిన్నపాటి మట్టికట్టను అడ్డుగా ఏర్పాటు చేసి పనులు చేయాలని చూస్తున్నారు. నీటి నిల్వలోనే పనులు చేస్తే ఘాట్‌ ఏ మేరకు నిలుస్తుందోనని నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

     తాత్కాలికంగా నిలిపివేశాం

    పుష్కరకాలం నాటికి ఘాట్‌ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఏఈ ఉపేంద్ర తెలిపారు. ప్రస్తుతం నీటి ఉధృతి పెరగడంతో తాత్కాలికంగా పనులను నిలిపివేశాం. నీటిని బయటకు తోడి మట్టికట్టను అడ్డంగా ఏర్పాటు చేసి ఘాట్ల నిర్మాణం చేపడతాం. నాణ్యత ప్రమాణాలతోనే ఘాట్లను నిర్మిస్తామన్నారు. 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top