‘జీవం’ కోల్పోయిన కృష్ణమ్మ


సాక్షి, విజయవాడ: బిరాబిరా పరుగులెట్టాల్సిన కృష్ణమ్మ వెలవెలబోతుంది. నీటితో కళకళలాడాల్సిన జీవనది ఎడారిని తలపిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రకాశం బ్యారేజీ ఎగువన ఏడాది పొడవునా 12 అడుగుల మేర నీరు ఉండేది. బ్యారేజీకి మరమ్మతులు జరిగినప్పుడు తప్ప మండు వేసవిలోనూ నీటిమట్టం కనీసం 10 అడుగులకు తగ్గేది కాదు. కానీ ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం ఇక్కడి నీటిమట్టం నాలుగు అడుగులకు పడిపోయింది. ఆ నీటిని కూడా నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్(ఎన్టీటీపీఎస్)తో పాటు నగర పాలక సంస్థ నిత్యావసరాలకు వాడేస్తున్నారు.   

 

ఎటు చూసినా ఇసుక తిన్నెలే..

గతంలో ప్రకాశం బ్యారేజీ దిగువనే ఇసుక తిన్నెలు కనపడేవి. ఎగువన  మాత్రం నీటితో నిండి ఉండేది. కానీ ఇప్పుడు ఎటు చూసినా ఇసుక తిన్నెలే దర్శనమిస్తున్నాయి. వీఐపీ ఘాట్, దుర్గా ఘాట్, భవానీ ఘాట్లలో నీరు కరువయింది. ఒకవైపు ఫ్లైఓవర్ పనులు జరుగుతుండడం, మరోవైపు కృష్ణానదిలో నీరు లేకపోవడంతో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు నదీ స్నానం చేయడం నరకంగా మారుతోంది. ఉండవల్లి వైపు కూడా ఇసుక తిన్నెలు దర్శనమిస్తున్నాయి.



నీటిమట్టం కొలిచేందుకు ఏర్పాటు చేసిన సూచీ స్కేల్ కూడా బయటపడింది. ఇదిలాఉండగా, నగరం మధ్యగా వెళ్లే రైవస్, బందరు, ఏలూరు, బుడమేరు కాల్వలకు ఐదారు నెలలుగా పూర్తి స్థాయిలో నీరు వదలకపోవడంతో నగరంలోని డ్రైనేజ్ వాటరే వీటి గుండా ప్రవహిస్తోంది. దీంతో ఈ కాల్వల నుంచి తీవ్రమైన దుర్గంధం వెలువడుతోంది. దీంతో కాల్వల వద్ద దోమల బెడద పెరిగిపోయి ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.

 

 శ్రీశైలం నుంచి నీరు వస్తేనే..


 శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 6 టీఎంసీల నీరు వదులుతామని కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు ప్రకటించింది. ఈ నీటినే ప్రకాశం, గుంటూరు జిల్లాలకు కొంత ఇవ్వాల్సి ఉంటుంది. ఇక మిగిలిన నీటిని కృష్ణా డెల్టాకు ఉపయోగించుకోవాలి. ఇందులో కనీసం నాలుగు టీఎంసీలు కృష్ణా డెల్టాకు ఇచ్చే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఈ నీరు వస్తేనే ప్రకాశం బ్యారేజీవద్ద నీటిమట్టం పెరిగే అవకాశం ఉంది. లేదా పులిచింతల దిగువన, ప్రకాశం బ్యారేజీ ఎగువన భారీవర్షాలు పడితేనే ప్రకాశం బ్యారేజీకి నీరు చేరే అవకాశం ఉంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top