గ్రామాల్లోకి సువర్ణముఖి నీరు

కొప్పర ఎస్సీ కాలనీలోకి ప్రవేశించిన సువర్ణముఖి నది నీరు - Sakshi


వంగర : కొప్పర, కొండచాకరాపల్లి గ్రామాల్లోకి సువర్ణముఖి నది నీరు శుక్రవారం వేకువజామున ప్రవేశించింది. గురువారం అర్ధరాత్రి వరకు నదుల్లో ఎటువంటి నీటి ప్రవాహం లేకున్నా ఒక్కసారిగా శుక్రవారం వేకువజామున సువర్ణముఖి, వేగావతి నదుల్లో నీటి ఉధృతి భారీగా పెరిగింది. 60వేల క్యూసెక్కుల నీరు నదిలో ప్రవహించింది. అప్పటి వరకు మడ్డువలస గేట్లు ఎత్తకపోవడంతో నీరు పోటెత్తింది. దీంతో ఉదయం ఐదు గంటల సమయానికి కొండచాకరాపల్లి రైతుల కల్లాలు, ఆంజనేయస్వామి, రామాలయాల ఆవరణలోకి, రోడ్లుపైకి వరద నీరు ప్రవేశించింది.


కొప్పర ప్రధాన రహదారి, ఎస్సీ కాలనీ, రెల్లి వీధి, ప్రాథమిక పాఠశాల, పంట పొలాలు, కూరాకుల పొలాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఒక్కసారిగా రెండు గ్రామాల ప్రజలు ఆందోళన చెందారు. సమాచారాన్ని స్థానిక జెడ్పీటీసీ బొత్స వాసుదేవరావునాయుడు  కలెక్టర్, బొబ్బిలి నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ దృష్టికి ఉదయం ఆరు గంటల సమయంలో తీసుకువెళ్లారు. కలెక్టర్‌ ప్రాజెక్టు అధికారులను అప్రమత్తం చేయడంతో డీఈ డి.పద్మజ ఆధ్వర్యంలో ప్రాజెక్టు వద్ద ఏడు గేట్లు ఎత్తి 55వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడిచిపెట్టారు. దీంతో గ్రామాల్లో ఉన్న నీటి ఉధృతి కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఆయా గ్రామాల్లో వరి, జొన్న, కూరగాయల పంటలు నీట మునిగాయి. కొండచాకరాపల్లి తంపర పొలాల్లో వరి పంట నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

 


అధికారుల పర్యటన

కొప్పర, కొండచాకరాపల్లి గ్రామాల్లో రెవెన్యూ, మండల పరిషత్‌ అధికారులతో పాటు వీఆర్‌వోలు, పంచాయతీ కార్యదర్శులు ఆయా గ్రామాల్లో శుక్రవారం సందర్శించారు. ఎప్పటికప్పుడు సమస్యను ఉన్నతాధికారులకు చేరవేసే పనిలో ఉన్నారు.

 


గ్రామాలకు రక్షణ కల్పించాలి...

మా గ్రామాలకు రక్షణ కల్పించాలని ఆయా గ్రామాల సర్పంచ్‌లు కిమిడి సన్యాసినాయుడు, పారిశర్ల శ్రీదేవిలు డిమాండ్‌ చేశారు. ఏటా వరదల సమయంలో ఇదే పరిస్థితి నెలకొనడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారని, శాశ్వత పరిష్కారం కల్పించాలని వారు కోరారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top