బీరుకు ‘నీటి’ గండం!

బీరుకు ‘నీటి’ గండం!


 సాక్షి, హైదరాబాద్: బీరు బాబులకు కష్టకాలం రానుంది. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ ప్రభావం బీర్ల కంపెనీలపైనా పడింది. రోజూ బీర్ల తయారీకి అవసరమైన లక్షలాది లీటర్ల నీటిని సరఫరా చేసే మంజీరా ఇప్పటికే ఎండిపోగా, సింగూరు నీరు ప్రజావసరాలకు కూడా సరిపోని పరిస్థితి ఉంది! దాంతో బ్రూవరీలకు నీరు సరఫరా చేయలేమంటూ సర్కారు చేతులెత్తేసింది. దాంతో, రాష్ట్రంలోని పది జిల్లాలతో పాటు పక్క రాష్ట్రాలకు కూడా బీర్లను సరఫరా చేసే మెదక్ జిల్లా సంగారెడ్డి పరిధిలోని ఐదు బ్రూవరీలు (బీర్ల కంపెనీలు) ఆందోళనకర పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. నీరివ్వకుంటే తాత్కాలికంగా కంపెనీలను మూసివేయడం తప్ప మరో మార్గం లేదని ఆబ్కారీ అధికారులకు తేల్చిచెప్పాయి. దాంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీరందించే విషయమై ఎక్సైజ్ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.



 రోజుకు 44 లక్షల లీటర్ల నీరు

 వర్షాకాలం, చలికాలాల్లో తెలంగాణలో నెలకు దాదాపు 30 లక్షల పెట్టెల బీర్లు విక్రయిస్తారు. పెట్టెలో 12 బీర్లుంటాయి (ఒక్కొక్కటి 650 ఎంఎల్ పరిమాణం). ఫిబ్రవరి నుంచి జూన్ వరకు డిమాండ్ నెలకు 40లక్షల పెట్టెలు దాటుతుంది. మెదక్ జిల్లా పటాన్‌చెరు పరిసరాల్లో ఉన్న ఐదు బ్రూవరీలు తయారు చేసే బీర్లు రాష్ట్రంతోపాటు ఏపీ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకూ సరఫరా అవుతాయి. బీర్ల తయారీకి బ్రూ వరీలు రోజుకు దాదాపు 44 లక్షల లీటర్ల నీటిని వినియోగించుకుంటాయి. పటాన్‌చెరు ప్రాంతంలోని ఇతర పరిశ్రమలతో పాటు ఈ 5 బ్రూవరీలకు కూడా హైదరాబాద్ వాటర్ బోర్డే ‘సింగూరు-మంజీరా నీటి సరఫరా వ్యవస్థ’ ద్వారా నీటిని సరఫరా చేస్తుంది. మంజీరా నుంచి సింగూరు జలాశయం ద్వారా నీటి సరఫరా జరుగుతుంది.



మంజీరా ఎండి, సింగూ రు డెడ్‌స్టోరేజీకి చేరడంతో సింగూరు జలాలను తాగు అవసరాలకే వాడాలని బోర్డు నిర్ణయిం చింది. ఈ మేరకు బ్రూవరీల యాజమాన్యా లకు వారం క్రితమే బోర్డు పటాన్‌చెరు జనరల్ మేనేజర్ లేఖలు రాశారు. అయినా ప్రస్తుతానికి సింగూరు నుంచి బ్రూవరీలు కొంతమేర నీరు వాడుకుంటున్నాయి. డిసెంబర్ 1 నుంచి వాటికి నీటి సరఫరాను పూర్తిగా ఆపేయాలని వాటర్‌బోర్డు అధికారులు నిర్ణయించి ఎక్సైజ్ అధికారులకు తెలియజేశారు. నీటి సరఫరా లేకపోతే బ్రూవరీల మూసివేత తప్ప మార్గం లేదని యాజమాన్యాలంటున్నాయి. బీరు ఉత్పత్తి ఇప్పటికే కొంతమేర తగ్గింది.



 ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి

 ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది. లక్షలాది లీటర్ల నీటిని బీరు కంపెనీలు ప్రైవేటుగా కూడా సమకూర్చుకునే పరిస్థితి లేదు. భారీ స్థాయి బోర్‌వెల్స్ ఏర్పాటుకు వాల్టా చట్టం అడ్డొస్తోంది. దాంతో డిసెంబర్ నెలాఖరులో నగరానికి వస్తాయని భావిస్తున్న గోదావరి జలాలపైనే ఎక్సైజ్ శాఖ ఆశలు పెట్టుకుంది. కానీ డిసెంబర్ 1 నుంచే బ్రూవరీలకు నీటిని పూర్తిగా నిలిపేస్తే పరిస్థితేమిటనేదే ప్రశ్న.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top