అటకెక్కిన రూ.20 కోట్లు..!

అటకెక్కిన రూ.20 కోట్లు..! - Sakshi

  •  విజయవాడ కార్పొరేషన్‌లో వృథాగా  ఆస్తిపన్ను ‘డీడీ’లు

  •  పుష్కర పనుల బిజీ పేరిట బ్యాంకులో జమ చేయని సిబ్బంది

  •  తిరిగి కొత్తవి తెచ్చివ్వాలంటూ అధికారుల సూచనలు

  •  మళ్లీ కమీషన్‌ ఎక్కడ చెల్లిస్తామంటూ  నగరవాసుల మండిపాటు

  • అసలే అప్పుల్లో ఉన్న విజయవాడ నగర పాలక సంస్థకు అధికారుల పనితీరు కారణంగా మరిన్ని ఆర్థిక ఇబ్బందులు తలెత్తనున్నాయి. నగర పాలక సంస్థ ఖజానాకు అంతో ఇంతో భరోసాగా ఉంటూ వస్తున్న ఆస్తిపన్ను సొమ్ము..అధికారుల అలసత్వంతో ఖజానాకు చేరకుండా పోయింది.



    సాక్షి, అమరావతి బ్యూరో: నగర వ్యాప్తంగా 59 డివిజన్ల పరిధిలో పుష్కరాలకు ముందు ప్రజల నుంచి వసూలు చేసిన ఆస్తిపన్ను డీడీలను సకాలంలో బ్యాంకులో జమ చేయలేదు.  వాటి కాలపరిమితి ముగిసి అవి ఎటూ కాకుండా పోవడంతో అధికారులు ఇప్పుడు తప్పును దిద్దుకునే పనిలో పడ్డారు. తాజాగా మళ్లీ కొత్త డీడీలను తెచ్చి ఇవ్వాలంటూ ఆయా యజమానులకు సూచిస్తున్నారు. మళ్లీ డీడీలు తీస్తే కమీషన్‌ వృథా అవుతుంది కదా అంటూ ప్రజలు మండిపడుతున్నారు.



    విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలోని 59 డివిజన్లలో 1.89 లక్షల  కట్టడాలు ఉన్నాయి. వీటన్నింటి నుంచి ఆస్తిపన్ను రూపంలో సుమారు  రూ. 86 కోట్లు వసూలు అవుతుంది.  ఏటా జూన్, మార్చి చివరాఖరి సమయాల్లో ఎక్కువగా వీటిని ప్రజలు చెల్లిస్తుంటారు. ఈ నేపథ్యంలో గత ఏడాది జూన్‌కు ముందు ఆస్తిపన్ను చెల్లిస్తూ వేలాది మంది బ్యాంకుల్లో డీడీలు తీసి సర్కిల్‌ కార్యాలయాల్లోని కార్పొరేషన్‌ అధికారులకు అందజేశారు. ఇలా డీడీల రూపంలో కార్పొరేషన్‌కు అందజేసిన మొత్తం రూ. 20 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అలా వచ్చిన డీడీలన్నీ ఇప్పుడు సర్కిల్‌ కార్యాలయాల్లో  పడి ఉన్నాయి. తీరిగ్గా కళ్లు తెరిచిన అధికారులు ఇప్పుడు వాటికి కాలం చెల్లిందని తెలిసి హడావుడి చేయడం మొదలెట్టారు.



    పుష్కరాల బిజీ పేరిట ...

    ఇప్పటికే ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల నుంచి రావాల్సిన రూ. కోట్ల ఆస్తిపన్ను సొమ్ము బకాయిలు కార్పొరేషన్‌కు గుదిబండగా మారాయి. వసూలవుతున్న అరకొర సొమ్మును సైతం అధికారులు ఖజానాకు జమచేయకపోవడంతో కార్పొరేషన్‌ నిర్వీర్యమయ్యే పరిస్థితులు నెలకొంటున్నాయి. నవ్యాంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కృష్ణా పుష్కరాలను విజయవంతం చేయడంలో కార్పొరేషన్‌ కీలక పాత్ర వహించింది. అయితే దీనిని సాకుగా చూపెట్టిన అధికారులు ఆస్తిపన్ను డీడీలను బ్యాంకులో జమ చేయడంలో అలసత్వం ప్రదర్శించారు. దీంతో ఖజానాకు జమ కావాల్సిన రూ. కోట్ల డీడీలు అటకెక్కాయి. ఇప్పుడు వాటిని జమ చేయడానికి అధికారులు సిద్ధమవ్వగా.. చాలా డీడీలకు కాలపరిమితి చెల్లిందని సిబ్బంది పేర్కొనడంతో..  చేసిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నంలో అధికారులు నిమగ్నమవడం గమనార్హం.



     తాజాగా మళ్లీ ఆయా యజమానుల నుంచి కొత్త డీడీలను తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఇప్పటికే డీడీలు కట్టి వాటికి కమీషన్లు చెల్లించామని.. మళ్లీ కొత్తగా డీడీలు తీసి ఇవ్వడమంటే మరోసారి అదనంగా కమీషన్‌ చెల్లించాల్సి వస్తుందని  ప్రజలు మండిపడుతున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమంటే ఇదే కాబోలు..!

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top