పుష్కరకాలంగా పునరుద్ధరణ !

పుష్కరకాలంగా పునరుద్ధరణ !


నత్తే నయంలా వేయిస్తంభాల ఆలయ పునరుద్ధరణ

పడుతూ.. లేస్తూ సాగుతున్న కల్యాణ మండప నిర్మాణ పనులు

పనులు ప్రారంభమై ఈ నెల 13కు    పన్నెండేళ్లు పూర్తి

చివరలో పైకప్పు దశలో ఆగిన వర్క్స్‌.. పెండింగ్‌లో రూ.83 లక్షలు..

ఏడాదిగా ఎక్కడి పనులు అక్కడే..




వరంగల్‌కు చారిత్రక గుర్తింపు తెచ్చే వేయిస్తంభాల ఆలయ కల్యాణ మండప నిర్మాణ పరిస్థితి దయనీయంగా మారింది. పూర్తిస్థాయిలో పునరుద్ధరణ కోసం మొదలైన పనులు ఎంతకీ పూర్తి కావడం లేదు. 12 ఏళ్లుగా కల్యాణ మండప నిర్మాణం సాగుతూనే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఈ పనులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు, విశిష్ట అతిథులు వచ్చి వెళ్లడమే గానీ.. ప్రాచీన నిర్మాణాన్ని పట్టించుకోవడం లేదు. రూ.3.48 కోట్ల అంచనా వ్యయంతో 2005 జూలై 13న పనులు మొదలు పెట్టగా ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి.



సాక్షి, వరంగల్‌ :

చారిత్రక వేయిస్తంభాల ఆలయ కల్యాణ మండప నిర్మాణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి.  రూ.3.48 కోట్ల అంచనా వ్యయంతో 2005 జూలై 13న ప్రారంభించిన పనులు.. పష్కర కాలం గడిచినా... పూర్తి కాలేదు. ఆలయ పునరుద్ధరనలో భాగంగా మొదటగా పాత మండపాన్ని పూర్తిగా తొలగించి.. శిల్పాలు, శిలలను పద్మాక్షి ఆలయం సమీపంలో పడేశారు. ఆ తర్వాత పునాది పనులకు ఐదేళ్లు పట్టింది. పునాది నిర్మాణం ఆలస్యం కావడంతో తొలగించిన శిలలు ఐదేళ్లపాటు పద్మాక్షి ఆలయం సమీపంలో దుమ్ముకొట్టుకుపోయాయి. వీటిని పట్టించుకునే నాథుడు కరువైపోవడంతో కొన్ని శిలలు తమ రూపును కోల్పోయాయి.



పెరిగిన అంచనా..

కల్యాణ మండపం పనులు మధ్యలో వదిలేయడంపై నలువైపులా విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో మరోసారి అంచనాలు సవరించడంతో పునరుద్ధరణ వ్యయం రూ.7.53 కోట్లకు చేరుకుంది. ఎట్టకేలకు కల్యాణ మండపం నిర్మాణ పనులు 2010 ఫిబ్రవరి 25న తిరిగి మొదలయ్యాయి. రూపుకోల్పోయిన 132 పిల్లర్లు, 160 బీమ్స్‌ శిలలు, శిల్పాలను తమిళనాడుకు చెందిన స్తపతి శివకుమార్‌ ఆధ్వర్యంలో 50 మందితో కూడిన బృందం తిరిగి చెక్కారు. కల్యాణ మండపం పునర్నిర్మాణంలో ప్రధానమైన శాండ్‌బాక్స్‌ టెక్నాలజీ ఆధారంగా నిర్మించిన పునాది, దానిపై మీటరు మందంతో డంగు సున్నం, గ్రాన్యువల్‌ ఫైల్స్‌తో కూడిన లేయర్‌ నిర్మాణం 2012 చివరి నాటికి పూర్తయింది.



అప్పటి నుంచి ఐదేళ్లుగా ఏడు వరుసల ప్రదక్షిణ పథం,  నాలుగు వరుసలు ఉండే కక్షాసనం, ఆపై గోడల వరకు నిర్మాణం చేపట్టారు. పైకప్పు వేస్తే కల్యాణ మండప నిర్మాణ పనులు పూర్తవుతాయి. చివరి దశలో మరోసారి పనులు నిలిచిపోయాయి. ఏడాదిన్నరగా ఒక్క రాయి ఇటు తీసి అటు వేయలేదు.  2010–11లో సవరించిన అంచనాల ప్రకారం ఇంకా రూ. 83 లక్షలు మంజూరు చేయాల్సి ఉంది. ఈ నిధుల రాకపోవడంతో చివరి దశలో పనులు నిలిచిపోయినట్లు తెలుస్తోంది.



ఇదీ వైభవం

వేయిస్థంబాల గుడిని క్రీస్తు శకం 1163లో కాకతీయ రాజు రుద్రదేవుడు వరంగల్‌లో నిర్మించాడు. ఈ ఆలయం వేదికగా జరిగే సాంస్కృతిక, థార్మిక కార్యక్రమాలకు కళ్యాణమండపం వేదికగా ఉండేది. కాకతీయుల శకం ముగిసిన తర్వాత తుగ్లక్‌ సేనలు జరిపిన దక్షిణ భారత దండయాత్రలో ఈ ఆలయం పాక్షికంగా దెబ్బతిన్నది. ఆ తర్వాత కాలక్రమంలో కళ్యాణమండపం దక్షిణం వైపు ప్రవేశద్వారం కుంగిపోయింది.  కళ్యాణమండపం నిర్మాణానికి మొత్తం 2560 శిలలు, శిల్పాలను కాకతీయలు ఉపయోగించారు.



కళ్యాణమండపం ఎత్తు 9.5 మీటర్లు ఉండగా భూమిలో ఆరు మీటర్లలోతు పునాదులు ఉన్నాయి. కళ్యాణమండపంలో ఉత్తర–దక్షిణ దిక్కుల మధ్య దూరం 33.18 మీటర్లు, తూర్పు–పడమరల మద్య దూరం 33.38 మీటర్లుగా ఉంది. మంటపం మధ్యలో నాట్యం చేసేందుకు వీలుగా వేదిక ఉంటుంది. 400 చదరపు మీటర్ల వైశాల్యంలో ఈ నిర్మాణం జరిగింది. తూర్పు ద్వారం గుండా రాజకుటుంబం, దక్షిణ ద్వారం  గుండా ప్రజలు కళ్యాణమండపంలోకి ప్రవేశించి ఆటుపై రుద్రేశ్వరాలయంలో దైవదర్శనం చేసుకునేవారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top