టీడీపీ, బీజేపీ మధ్య వార్!

టీడీపీ, బీజేపీ మధ్య వార్! - Sakshi


సాక్షి, విజయవాడ : కృష్ణాపుష్కరాల పేరుతో విజయవాడలో కలెక్టర్ అహ్మద్ బాబు, ఎంపీ కేశినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో అడ్డగోలుగా దేవాలయాలు కూల్చివేయడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటివరకు కిందిస్థాయి నేతలే టీడీపీ చర్యల్ని ఖండిస్తుంటే.. తాజాగా బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు దేవాలయాలు, గోశాలల కూల్చివేతపై మండిపడ్డారు. టీడీపీ నేతలు గూండాలు, రౌడీల్లాగా వ్యవహరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.

 

చారిత్రక ఆలయాలు.. పురాతన గోశాల..

పుష్కరాలకు అభివృద్ధి పేరుతో ఎంతో చారిత్రకమైన సీతమ్మవారి పాదాలు, శనీశ్వరస్వామి దేవాలయం, భూగర్భ వినాయకుడు, సాయిబాబా మందిరం తదితర 25కి పైగా దేవాలయాలను, 350 ఆవులకు ఆశ్రయమిచ్చే గోశాలను అధికారులు అడ్డగోలుగా కూల్చివేశారు. అర్ధరాత్రి దాటిన తరువాత విపరీతమైన పోలీసు బందోబస్తు మధ్య భక్తులు అడ్డుకుంటున్నా లెక్కచేయకుండా కూల్చివేయడం నగరంలోనే పెద్ద సంచలనంగా మారింది.  



గోశాలను కూల్చివేయవద్దంటూ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌కు విన్నవించుకునేందుకు వెళ్లిన గోశాల నిర్వాహకులు ఆయన ఛీత్కారాలను చవిచూశారు. వారిని లాలూప్రసాద్ యాదవ్‌తో పోల్చుతూ గడ్డి తింటారా..? అంటూ ఎంపీ కేశినేని చేసిన వ్యాఖ్యలు వీడియోల రూపంలో నగరంలోని ప్రతిఒక్కరి వాట్స్‌యాప్‌లో దర్శనమిచ్చాయి. దేవాలయాలను అడ్డంగా  కూల్చివేయడం, వ్యాపారుల్ని ఎంపీ కేశినేని చులకనగా భావించడం బీజేపీ నేతలు సీరియస్‌గా తీసుకున్నారు. నగరంలో టీడీపీ చేస్తున్న అరాచకాలను బీజేపీ జాతీయ నేతలకు స్థానిక నేతలు ఎప్పటికప్పుడు చేరవేశారు.

 

రంగంలోకి దిగిన ఎంపీ గోకరాజు

ముఖ్య దేవాలయాలను టీడీపీ నేతలు కూల్చివేసిన ఘటన టీడీపీ, బీజేపీకి మధ్య ఉన్న విభేదాలను మరింతగా పెంచింది. అధిష్టానం ఆదేశాల మేరకు నరసాపురం బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు రంగంలోకి దిగి టీడీపీ నేతలు చేస్తున్న దేవాలయాల కూల్చివేత కార్యక్రమానికి తాము ఎంతమాత్రం మద్దతు తెలపబోమంటూ  గురువారం బహిరంగంగానే ప్రకటించారు. టీడీపీ నేతలు పోలీ సులను సైతం ఏరా, ఓరే అంటూ పిలుస్తూ పోలీసు వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని పోగొడుతున్నారన్నారు.



గోశాల కూల్చివేతను అడ్డుకునే వ్యాపారులను ఏ విధంగా వ్యాపారాలు చేస్తారంటూ బెదిరించారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.  ఎవరూ బెదిరింపులకు భయపడాల్సిన పరిస్థితి లేదని, బాధితులకు తాము అండగా ఉంటామని గంగరాజు హామీ ఇచ్చారు.  అభివృద్ధి పేరుతో హిందూ దేవాలయాలను ధ్వంసం చేయాలని చూస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. గంగరాజు చేసిన వ్యాఖ్యల్ని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఖండిస్తూ.. అభివృద్ధిని ఎంపీ గంగరాజు అడ్డుకుంటే తాము సహించబోమంటూ హెచ్చరికలు చేశారు. దేవాలయాల కూల్చివేత కార్యక్రమాన్ని పీఠాధిపతులు సీరియస్‌గానే తీసుకుంటున్నారు. నగరానికి సమీపంలో ఉండే శివక్షేత్రం పీఠాధిపతి శివస్వామి గోకరాజు గంగరాజుతో కలిసి నాలుగో తేదీన నగరంలో ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ ప్రదర్శనలో 352 మంది స్వాములు, పీఠాధిపతులు పాల్గొంటారని శివస్వామి చెప్పారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top