క్రీమీలేయర్ అమలు చేయాలా? వద్దా?


♦ ప్రభుత్వ స్పష్టత కోసం ఎదురుచూపులు

♦ డైలమాలో నియామక సంస్థలు



 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో బీసీ క్రీమీలేయర్  (సంపన్నవర్గాలు)ను అమలు చేయాలా? వద్దా? అన్న స్పష్టత లేకుండాపోయింది. బీసీ క్రీమీలేయర్ అమలును నిలిపివేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న గతంలోనే ప్రకటించారు. అయితే ఇంతవరకు ఉత్తర్వులు మాత్రం జారీ కాలేదు. ఈక్రమంలో టీఎస్‌పీఎస్సీ ఏఈ, ఏఈఈ వంటి పోస్టుల భర్తీకి ఉద్యోగ పరీక్షలను నిర్వహించింది. అలాగే విద్యుత్ శాఖ కూడా పలు ఇంజనీర్ పోస్టులకు రాత పరీక్షలను నిర్వహించింది. కానీ ఫలితాలు ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో అటు విద్యుత్ శాఖ, ఇటు టీఎస్‌పీఎస్సీ ఇంటర్వ్యూలు నిర్వహించడానికి ముందే క్రీమీలేయర్‌పై స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నోటిఫికేషన్‌లో మాత్రం అభ్యర్థులు క్రీమీలేయర్ సర్టిఫికెట్లు తెచ్చుకోవాలని ప్రకటించించింది.



ఇంటర్వ్యూల నిర్వహణ కంటే ముందే అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో క్రీమీలేయరా, నాన్ క్రీమీలేయరా అన్న సర్టిఫికెట్‌ను అందజేయాల్సి ఉంటుంది. వాటి ఆధారంగానే బీసీ రిజర్వేషన్ కోటాలో తీసుకురావాలా? ఓపెన్ కోటాలో పరిగణనలోకి తీసుకోవాలా? అన్న నిర్ణయం తీసుకుంటాయి. అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. 6 లక్షల లోపు ఉంటే వారిని నాన్ క్రీమీలేయర్ అభ్యర్థులుగా రిజర్వేషన్ కోటా లో, అదే రూ. 6 లక్షలకు పైగా ఉన్న వారిని వెనుకబడిన వర్గాల్లో సంపన్న శ్రేణులుగా గుర్తించి, ఓపెన్ కేటగిరీలోనే పరిగణనలోకి తీసుకుంటాయి. ప్రభుత్వం క్రీమీలేయర్ అమలును నిలిపివే స్తామని మౌఖి కంగా పలుమార్లు పేర్కొన్న నేపథ్యంలో నియామక సంస్థలు ఆలోచనలో పడ్డాయి. సర్కారు నుంచి దీనిపై స్పష్టత కోసం ఎదురుచూస్తున్నాయి.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top