అల్పపీడనంపైనే ఆశలు

అల్పపీడనంపైనే ఆశలు

జిల్లా వ్యాప్తంగా కరువు ఛాయలు

వరుణుడి కరుణ కోసం తపిస్తున్న పంటపొలాలు

ఎండిపోతున్న నారుమళ్లు బతికించుకునేందుకు అగచాట్లు

ఉభాలు జరిగినా నెర్రెలు చాస్తున్న నేలతల్లి 

అల్పపీడనంతో వర్షాలు పడితే కాస్త నయం

 

 

 

సాక్షి ప్రతినిధి, విజయనగరం: వాన చినుకు కోసం నేల తల్లి పరితపిస్తోంది. తడారిన నారుమళ్లు... వరుణుడి కరుణకోసం ఎదురుతెన్నులు చూస్తున్నాయి. కరువు కోరల్లో చిక్కుపోతున్నామని రైతాంగం బెంబేలెత్తిపోతోంది. సగానికి పైగా మండలాల్లో ఇప్పటికే దయనీయ స్థితి నెలకొంది. వర్షాల్లేక వేసిన నారుమడులు ఎండిపోతున్నాయి. ఉభాలు పూర్తయిన చేను తడికోసం పరితపిస్తోంది. ఇప్పుడు రైతన్నను ఆదుకోవాల్సింది... చేనుకు చేవనందించేది... అల్పపీడనమే. బుధ, గురువారం జిల్లాలో అక్కడక్కడ కురిసిన వర్షం చల్లదనాన్నిచ్చినా... పంటను రక్షించలేకపోతోంది. అదీ కనికరించకపోతే... ఇక ప్రభుత్వమే ఆదుకోవాలి. గతేడాది ప్రకటించిన కరువుమండలాలపైనే.. కరుణ లేదు. ఇక ఈ ఏడాది ఏం చేస్తుందోనన్నది అన్నదాత సందేహం. జిల్లాలో సాగైన విస్తీర్ణం, నమోదైన వర్షపాతం గమనిస్తే కరువు తీవ్రత స్పష్టమవుతోంది. పొట్ట దశలోకి రావల్సిన ఉభాలు ప్రారంభంలోనే ఉందంటే ఖరీఫ్‌ సీజన్‌ ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతోంది. వేసిన పంట కూడా బతుకుతుందో లేదోనన్న భయం పట్టుకుంది. నారుమళ్లు రక్షించుకోవడానికి... పూర్తయిన ఉభాలను తడుపుకోవడానికి రైతులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యామ్నాయం తప్ప మరో అవకాశం లేదు. ఇప్పటికే సీజన్‌ ఆలస్యమైపోయింది. తాజా సీజన్‌కు తగ్గట్టు పంటలు వేసుకోవాల్సిన ఆవశ్యకత కనిపిస్తోంది. వరికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న, చోడి, పెసర, మినుము పంటలు వేసేలా ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించే పనిలో అధికారులు కూడా నిమగ్నమయ్యారు. 

 

ఆదుకోని ప్రభుత్వం... అందని సాయం

గతేడాది ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితులతో పలుచోట్ల కరువు ఏర్పడింది. సీతానగరం, పాచిపెంట, బొబ్బిలి, జియ్యమ్మవలస, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, సాలూరు, మెంటాడ మండలాల్లో తీవ్ర స్థాయిలో కరువు చోటు చేసుకుంది. ఇందులో తొలి విడతగా బొబ్బిలి, సీతానగరం, పాచిపెంట మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది. మిగిలిన మండలాలను పరిశీలిస్తామని ప్రతిపాదనలు తీసుకుని ప్రకటించకుండా తాత్సారం చేసింది. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన మండలాల్లోని 92గ్రామాలు కరువు బారిన పడ్డాయి. వాటిలో 7089.65హెక్టార్ల పంటకు నష్టం వాటిల్లింది.  రూ. కోటి 6లక్షల మేర 2877రైతులు నష్టపోయారని ఎన్యుమరేషన్‌లో వ్యవసాయ అధికారులు గుర్తించారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదించారు. ఇక ప్రకటనకు నోచుకోని కొమరాడ, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, సాలూరు, మెంటాడ మండలాల్లో 5,522హెక్టార్లలో కరువు ఏర్పడిందని, రూ. 13.80కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో అధికారులు పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన మూడు కరువు మండలాలకు ఇంతవరకు ఒక్క రూపాౖయెనా విడుదల చేయలేదు. ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద ఎటువంటి సాయం చేయకపోవడంతో రైతులు అప్పుల పాలయ్యారు. అదనపు కరువు మండలాలుగా అ«ధికారులు పంపించిన నివేదికలపై ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. ఆ మండలాల రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది.

 

ఇప్పుడేం చేస్తుందో 

గతేడాది ఎనిమిది మండలాలకే పరిమితమైన కరువు ఈ సారి జిల్లా వ్యాప్తంగా 21మండలాల్లో తిష్టవేసింది. సాధారణ విస్తీర్ణంలో సగం వరకు సాగుకు నోచుకోక పోగా, వేసిన పంట ఎండిపోయి నెర్రెలు చాస్తోంది. ఇప్పటికే రుణాలివ్వకుండా బ్యాంకులు ముఖం చాటేస్తున్నాయి. ఎంతసేపూ రుణాలు రెన్యువల్‌ చేయడం తప్ప కొత్తగా రుణాలిచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇప్పటివరకు రూ. 25కోట్లు మాత్రమే కొత్తగా రుణాలిచ్చాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరి, మన పాలకులు ఏం చేస్తారో చూడాలి.

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top