పస్తులు

పస్తులు


8 నెలలుగా వేతనాల్లేవ్..

దుర్భరస్థితిలో సాక్షరభారత్ కోఆర్డినేటర్లు

జిల్లాలో 2,154 మంది గ్రామ కోఆర్డినేటర్లు

మండల కోఆర్డినేటర్ల పరిస్థితీ అంతే...

పత్రికలకు సైతం రాని బిల్లులు


జోగిపేట: జిల్లాలోని సాక్షర భారత్ కోఆర్డినేటర్లు దుర్భర స్థితిని ఎదుర్కొంటున్నారు. ఎనిమిది మాసాలుగా వేతనాలు అందక పోవడంతో పస్తులతో కాలం గడుపుతున్నారు. ఇదిగో ఇప్పుడిస్తాం..అప్పుడిస్తాం అంటూ అధికారుల మాయ మాటలు చెప్పి ఊరిస్తున్నారే తప్ప జీతాలు మాత్రం ఇవ్వడంలేదు. దీంతో కుటుంబాలు గడవక కోఆర్డినేటర్ల అవస్థలు వర్ణణాతీతం. గ్రామీణ ప్రాంతాల్లోని అక్షరాస్యులను సంపూర్ణ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ‘సాక్షరభారత్’ కార్యక్రమాన్ని 2010లో ప్రారంభించింది. ఇటీవలే 5వ దశ సాక్షర భారత్ కార్యక్రమం పూర్తయ్యింది. త్వరలో ఆరో దశకు కూడా ప్రారంభించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తొంది.


 సంపూర్ణ అక్షరాస్యత సాధిస్తేనే సమాజం వేగవంతంగా ప్రగతి సాధిసాధిస్తుందనే సదాశయంతో కేంద్ర సాక్షరభారత్ చేపట్టింది. ఇందుకు ప్రతి గ్రామ పంచాయతీలో రెండు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. రెండు కేంద్రాలలో ఇద్దరు సాక్షర భారత్ కో ఆర్డినేటర్లను  నియమించింది. ఉదయం వేళ పత్రికలు చదవడానికి అడల్డ్ ఎడ్యుకేషన్ సెంటర్ (ఏఈసీ) సాయంత్రం సమయంలో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు సాక్షర భారత్ కేంద్రాలను ప్రారంభించింది. కోఆర్డినేటర్లకు నెలకు రెండు వేల రూపాయల గౌరవ వేతనం, ఇవ్వాలని నిర్ణయించి అర్హులైన వారిని సాక్షర భారత్ కోఆర్డినేటర్లుగా గ్రామానికి ఇద్దరిని ఎంపిక చేసింది.


ఏఈసీ కేంద్రాన్ని ఒకరు, సాక్షర భారత్ కేంద్రాన్ని మరొకరు ఉదయం, సాయంత్రం సమయాల్లో తెరచి ఉంచాలని విధి విధానాలను రూపొందించింది. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు మండలానికి ఒకరు చొప్పున మండల సాక్షర భారత్ కోఆర్డినేటర్‌గా నియమించింది. వీరికి నెలకు 6వేల చొప్పున వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. జిల్లాలో మొత్తం 2,154 మంది వీసీఓలు, 46 మంది ఎంసీఓలు పనిచేస్తున్నారు. వీరికి గత సంవత్సరం అక్టోబర్ వరకు వేతనాలను అందజేశారు. నవంబర్ మాసం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి వేతనాలు అందించలేదు. జిల్లా అంతట వేతనాలు లేక అలమటిస్తున్నారు. ప్రతినిత్యం కేంద్రాలను తెరచి సంపూర్ణ అక్షరాస్యత కోసం కృషి చేస్తున్న తమకు వేతనాలు ఇవ్వకపోవడం భావ్యం కాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


 రెండేళ్లుగా పత్రికలకూ బిల్లులు లేవు

ప్రతి గ్రామ పంచాయతీలోని సాక్షర భారత్ కేంద్రంలో రెండు దినపత్రికలు వేసుకోవాలనే నిబంధన ఉంది. దీంతో సాక్షర భారత్ కోఆర్డినేటర్‌లు దినపత్రికలు వేసుకుంటున్నారు. రెండేళ్లుగా దినపత్రికలకు సైతం బిల్లులు చెల్లించడంలేదని గ్రామాల కోఆర్డినేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల నెలా తామూ పత్రికల ఏజెంట్లకు డబ్బులు చెల్లిస్తున్నామన్నారు. తమకు మాత్రం రెండేళ్లుగా పత్రికల బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని  కోఆర్డినేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


త్వరలో వేతనాలు వస్తాయి

జిల్లాలో పనిచేస్తున్న మండల, గ్రామ కోఆర్డినేటర్లకు పెండింగ్‌లో ఉన్న వేతనాలు త్వరలో వస్తాయి. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో అధికారులు తమకు తెలియజేశారు. వేతనాలకు సంబంధించిన బడ్జెట్ రిలీజ్ అయ్యిందని, ఆరు మాసాల వేతనాలు చెల్లించే అవకాశం ఉంది. గత సంవత్సరం అక్టోబర్ మాసం వరకు మండల, గ్రామ కోఆర్డినేటర్లకు వేతనాలు చెల్లించాం. గ్రామాల్లో సాక్షర భారత్ కేంద్రాలను కూడా ప్రతి రోజు నడిపేందుకు గ్రామ కోఆర్డినేటర్లు చర్యలు తీసుకోవాలి.  - ఉషామార్థా సాక్షర భారత్ డిప్యూటీ డెరైక్టర్

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top