విశాఖ సేఫ్‌ కాదట!

విశాఖ సేఫ్‌ కాదట! - Sakshi


ఇది తుపాన్ల ప్రభావిత నగరమట..

అందుకే రాజధానిగా ఎంపిక చేయలేదట

జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో సర్కారు వితండవాదం

అమరావతి ఎంపికను సమర్థించు కునేందుకు విశాఖపై అభాండం

తుపాన్ల ముప్పున్నప్పుడు అంతర్జాతీయ నగరంగా ఎలా చేస్తామన్నారు

సదస్సులు, సంబరాలకు ఎందుకు దీన్నే వేదిక చేస్తున్నారు

విశాఖ ఇమేజ్‌ దెబ్బతీసే వ్యాఖ్యలు చేశారంటూ స్థానికుల ఆగ్రహం




విశాఖ నగరం తుపాను ప్రభావిత ప్రాంతం.. హుద్‌హుద్‌లో దారుణంగా నష్టపోయింది.. అందుకనే రాజధాని ప్రాంతంగా దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు.. –జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో రాష్ట్ర ప్రభుత్వ వాదన



ప్రకృతి ప్రసాదించిన వరం.. విశాఖ నగరం.. అందుకే దీని మీద ఫోకస్‌ చేస్తున్నాం.. అంతర్జాతీయ నగరంగా బ్రాండ్‌ ఇమేజ్‌ తీసుకొస్తున్నాం.. – పలు వేదికలపై సీఎం చంద్రబాబు విశాఖకు ఇచ్చిన కితాబు



రెండింటిలో ఎందుకింత వైరుధ్యం.. ఏమిటీ వితండవాదం.. తుపాన్ల నగరమని అభాండం ఎందుకు?! అంతర్జాతీయ సదస్సులు.. సంబరాల నిర్వహణకు.. లెక్కకు మిక్కిలి హబ్బుల ప్రకటనలకు అడ్డురాని తుఫాన్లు.. రాజధాని చేయడానికే అడ్డొస్తున్నాయా?? వాస్తవానికి విశాఖ నగరం ఎంతో సురక్షితమైనది.. తుపాన్లు ఇక్కడ తీరం దాటడం చాలా అరుదన్నది నిపుణుల మాట. తరచూ తుపాన్ల ముప్పు ఎదుర్కొనే చెన్నై నగరం తమిళనాడు రాజధానిగా దశాబ్దాలుగా కొనసాగుతోంది.. వీటన్నింటినీ విస్మరించి తుపాన్ల విశాఖను రాజధానిగా ఎంపిక చేయలేమని ట్రిబ్యునల్‌ను తప్పుదారి పట్టించడం.. విశాఖను చిన్నచూపు చూడటమే..



విశాఖపట్నం: ‘రాజధాని నిర్మాణం కా(లే)ని నవ్యాంధ్రప్రదేశ్‌లో ఆర్థిక రాజధాని, సహజ సౌందర్య నగరి  విశాఖపట్నం మీదే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఫోకస్‌ ఉంది. అందుకే ప్రతిష్టాత్మక ఐఎఫ్‌ఆర్‌ విశాఖలోనే నిర్వహించాం.. సీఐఐలు వరుసగా రెండేళ్లు ఇక్కడే పెట్టాం.. ఐదు దేశాల ప్రతినిధులు పాల్గొన్న  బ్రిక్స్‌ సదస్సుకు ఇదే నగరాన్ని వేదిక చేశాం..  విశాఖ నగరానికి మేము ఇంత ప్రాధాన్యత ఇస్తున్నాం’.. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబునాయుడు నగరానికి వచ్చినప్పుడుల్లా చేసే వ్యాఖ్యలివి.



సదస్సులు,  సమావేశాల నిర్వహణే అభివృద్ధికి సూచికలు.. అన్న రీతిలో మాట్లాడే పాలకులు ఇప్పటి వరకు విశాఖ సమగ్రాభివృద్ధికి పక్కాగా ప్రణాళికలే రూపొందించలేదు. ఈ సంగతి అటుంచితే  రాజధాని ఎంపిక విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వినిపించిన వాదనల్లో తుపాన్ల విశాఖను రాజధానికి ఎలా పరిగణిస్తామని రాష్ట్ర ప్రభుత్వం జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో వాదించడం వివాదాస్పదమవుతోంది. హుద్‌హుద్‌ లాంటి విలయాలను కూడా తట్టుకుని నిలిచిన విశాఖను తుపానుల నగరంగా తేలిగ్గా తీసిపారేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ ఇమేజ్‌ను దెబ్బతీసే విధంగా ప్రభుత్వం ట్రిబ్యునల్‌ వద్ద వ్యాఖ్యలు చేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.



ట్రిబ్యునల్‌లో ప్రభుత్వ వాదన ఇదీ..

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని ఎంపిక చేయడాన్ని  సవాల్‌ చేస్తూ  జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ)లో దాఖలైన పలు పిటిషన్లను జస్టిస్‌ స్వతంత్రకుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం.. రాజధాని ఎంపిక విషయంలో ఇతర ప్రాంతాలను పరిగణించారాః? అని ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాది ఏకే గంగూలీ వాదనలు వినిపిస్తూ.. రాజధానిగా విశాఖ నగరాన్ని కూడా పరిశీలించామని.. ఇది అధిక వర్షపాతం ఉన్న సైక్లోన్‌ ప్రభావిత ప్రాంతమని, హుద్‌హుద్‌ వల్ల సుమారు రూ.25వేల కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పుకొచ్చారు. అందువల్ల దాన్ని పరిగణనలోకి తీసుకోలేదని చెప్పుకొచ్చారు.



రాజధానిగా విశాఖను పరిశీలించిదెప్పుడు?

ఇక రాజధానిగా విశాఖ నగరాన్ని పరిశీలించామని ప్రభుత్వ న్యాయవాది ట్రిబ్యునల్‌కు నివేదించారు. కానీ వాస్తవానికి ప్రభుత్వం ఎప్పుడూ విశాఖను క్యాపిటల్‌గా పరిశీలించిన దాఖలాలే లేవు. సమైక్యాంధ్ర విభజన సమయంలో ఏర్పాటైన జస్టిస్‌ శ్రీ కృష్ణ కమిటీ పర్యటన మినహా రాజధాని ఎంపిక పరిశీలన నిమిత్తం ఎప్పుడూ.. ఎవ్వరూ.. పర్యటించలేదు.



తప్పుడు వాదనలపై అభ్యంతరాలు

వాస్తవానికి హుద్‌హుద్‌ విలయం 2014 అక్టోబర్‌లో సంభవించింది. అప్పటికే రాజధానిగా అమరావతిని నిర్ధారిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన కూడా చేసేసింది. కానీ విశాఖను రాజధానిగా ఎంపిక చేయకపోవడానికి హుద్‌హుద్‌ తుపానునే సాకుగా చూపించడం వివాదాస్పదమవుతోంది. వాస్తవానికి హుద్‌హుద్‌ను తట్టుకుని నిలబడిన నగరంగా విశాఖ చరిత్రకెక్కింది. ఇక అధిక వర్షపాతం ఉన్న సైక్లోన్‌ ప్రభావిత ప్రాంతంగా విశాఖను పేర్కొనడంపై కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.



ఒక్క హుద్‌హుద్‌ మినహా ఇప్పటివరకు తుపాన్లు విశాఖను తీవ్రంగా ప్రభావితం చేసిన దాఖలాలే లేవు. రాష్ట్రంలో అధిక వర్షపాతం నమోదయ్యే నగరంగా కూడా విశాఖ ఇంతవరకు రికార్డులకెక్కలేదు. కానీ  ప్రభుత్వం మాత్రం ట్రిబ్యునల్‌లో విశాఖ ఇమేజ్‌ను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యానించందంటూ విశాఖ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరదలు, ఎండల ముప్పు తీవ్రంగా ఉన్న అమరావతిపై ఉన్న మోజు, రహస్య లావాదేవీల కారణంగానే దాని ఎంపికను సమర్థించుకునేందుకు విశాఖపై బురద జల్లుతున్నారని విమర్శిస్తున్నారు.



విశాఖపై తుఫానుల ప్రభావం తక్కువ

ఆంధ్రప్రదేశ్‌లో ఇంతటి అందమైన నగరం మరొకటి లేదనేని వాస్తవం. వాతావరణ పరంగా విశాఖ ఎంతో అనుకూలం. తుఫానులు అధికంగా నెల్లూరు, మచిలీపట్నం, కాకినాడల్లో తీరాన్ని తాకుతుంటాయి. విశాఖ ప్రాంతంలో తీరం తాకడం చాలా అరుదు. హుద్‌హుద్‌ మినహా పెద్ద తుఫానులు విశాఖపై ప్రభావం చూసిన సందర్భాలు లేవు. గోదావరి జలాలను విశాఖకు తరలించడం సులభం. అదే విధంగా విశాఖ నగరాన్ని మూడు వైపుల విస్తరించుకుంటూ వెళ్లే అవకాశం ఉంది. డైవెర్సిఫైడ్‌ ఆలోచనతో పనిచేస్తే శ్రీకాకుళం నుంచి ఉభయ గోదావరి జిల్లాల వరకు రాజధాని అనుబంధంగా నగరాలు, కార్యాలయాలు ఏర్పాటు చేసుకునే అవకాశాలు అధికం. విశాఖ రాజధాని అయితే వ్యవసాయ భూములు నష్టపోకుండా రాజధాని నిర్మాణం జరిగేది.

– ఆచార్య ఓ.ఎస్‌.ఆర్‌ భాను కుమార్, విశ్రాంత ఆచార్యులు, మెట్రాలజీ, ఓషనోగ్రఫీ విభాగం



ఎంతో సురక్షితం

పర్యావరణ పరంగా.. వాతావరణ పరంగా పరిశీలిస్తే విశాఖ నగరం ఎంతో సురక్షితమైనది. భూకంపాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. తుపాను ప్రభావం  అన్ని ప్రాంతాలకూ ఉంటుంది. హుద్‌హుద్‌ను సాకుగా చూపుతూ విశాఖ రాజధానిగా సరిపడదు అని భావించడం తగదు. పోర్టు కూడా ఉంది కాబట్టి అభివృద్ధికి తోడ్పాటుగా నిలిచేది. ప్రస్తుత రాజధాని అమరావతి ప్రాంతంలో ఎండలు అధికంగా ఉంటాయి. దాంతో పోల్చితే వాతావరణ పరంగా విశాఖ ఎంతో అనుకూలం.  తమిళనాడు రాజధాని చెన్నై, ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లు తీర ప్రాంతంలో ఉన్నవే. మరి వాటికి లేని ముప్పు  విశాఖకు ఎలా ఉంటుంది. –ఆచార్య ఎస్‌.ఎస్‌.వి.ఎస్‌ రామకృష్ణ, మెటీరియాలజీ, ఓషనోగ్రఫీ విభాగం, ఏయూ

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top