చీకటి వ్యాపారం గుట్టు రట్టు

చీకటి వ్యాపారం గుట్టు రట్టు

– వేరుశనగ మిల్లులపై విజిలెన్స్‌ దాడులు

– ఎటువంటి అనుమతులు లేవని వెల్లడి

– భారీగా పప్పు, సీడ్‌ నిల్వలు

– కోటి రూపాయల విలువైన సరుకు స్వాధీనం, మిల్లులు సీజ్‌

చీరాల :

జిల్లాలో చీరాల కేంద్రంగా నిర్వహిస్తున్న చీకటి వ్యాపారం బయటపడింది.  వేరుశనగ మిల్లులు సాగిస్తున్న అక్రమ దందాను విజిలెన్స్‌ అధికారులు బయటపెట్టారు. దీంతో భారీగా వేరుశనగపప్పు నిల్వలు చేస్తున్న అక్రమ వ్యాపారుల డొంక కదిలింది. కొన్నేళ్లుగా ఎటువంటి అనుమతులు లేకుండా భారీస్థాయిలో మిల్లులు ఏర్పాటు చేసి కోట్ల రూపాయల  చీకటి వ్యాపారం సాగిస్తున్నారు.  దీనిపై జిల్లా విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు సమాచారం అందింది. దీంతో విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీఎస్పీ ఈ.సుప్రజ నేతృత్వంలో సీఐలు వి.శ్రీరాం, కిషోర్‌కుమార్, సేల్స్‌ టాక్స్‌ అధికారులు, రెవెన్యూ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అనేక అక్రమాలు బయటపడ్డాయి. కనీస అనుమతులు లేకుండా కోట్లాది రూపాయల అక్రమ వ్యాపారం జరుగుతోందని వెల్లడైంది.   ఫుడ్‌గైన్‌ లైసెన్స్‌ (ఎఫ్‌జిఎల్‌) అనుమతులు లేవు. 5 క్వింటాళ్ల కంటే అధిక నిల్వలు ఉంచకూడదనే నిబంధనను పక్కకు నెట్టి ఒక్క మిల్లులో వెయ్యి క్వింటాళ్లకు పైగా నిల్వలు చేశారు. దీనికి తోడు రైతులకు అవసరమైన సీడ్‌ (విత్తన పప్పు)ను కూడా భారీగా నిల్వ ఉంచి కృత్రిమ కొరత  సృష్టిస్తున్నారు. దీంతో అనేక కోణాల్లో విజిలెన్స్‌ అధికారులు విచారణ చేపట్టారు. ఉజిలిపేట ఫ్లైఓవర్‌ పక్కన ఉన్న వాసవాంబిక గ్రౌండ్‌నట్‌ మిల్లును గుగ్గిలం శ్రీనివాసరావు అనే వ్యాపారి ఎటువంటి అనుమతులు లేకుండా మిల్లు నడపడంతో పాటు అనధికారకంగా రూ.40 లక్షలు విలువైన 1200 బస్తాలు నిల్వ ఉంచడంతో విజిలెన్స్‌ అధికారులు ఆ మిల్లును సీజ్‌ చేసి 6 ఏ కేసు నమోదు చేశారు. అలానే కారంచేడు రోడ్డులోని ఎఫ్‌సీఐ గౌడౌన్స్‌ వద్ద ఉన్న కనకదుర్గ గ్రౌండ్‌నట్‌ మిల్లుపై దాడులు జరిగాయి. అక్కడ కూడా ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా నడుస్తోందని గుర్తించిన విజిలెన్స్‌ అధికారులు రూ.20 లక్షల విలువైన వేరుశనగపప్పు బస్తాలను స్వాధీనం చేసుకుని మిల్లును సీజ్‌ చేసి 6 ఏ కేసు నమోదు చేశారు. అలానే నాగవెంకటేశ్వర ట్రేడర్స్, సాంబశివ ట్రేడర్స్‌ అనే మిల్లులపై విజిలెన్స్‌ అధికారులు దాడులు చేసి పెద్ద ఎత్తున వేరుశనగ బస్తాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మిల్లులను కూడా సీజ్‌ చేసి వారిపై 6ఏ కేసు నమోదు చేశారు. మొత్తం కోటి విలువైన సరుకు స్వాధీనం చేసుకుని వాటిని స్థానిక రెవెన్యూ అధికారులకు అప్పగించారు. 

ఇండియన్‌ సీడ్స్‌ యాక్ట్‌  కింద కేసు పెట్టే యోచనలో...

రైతులకు అవసరమైన సీడ్‌ను ఎటువంటి అనుమతి లేకుండా భారీగా మిల్లులో నిల్వ ఉంచి విత్తన కృత్రిమ కొరతను సృష్టించి రైతులకు అన్యాయం జరిగేలా మిల్లుల యజమానులు చేస్తున్నారని విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. దీనిపై విజిలెన్స్‌ డీఎస్పీ సుప్రజ మాట్లాడుతూ మిల్లు యాజమానుల తీరు రైతులకు అన్యాయం జరిగేలా ఉందని, ఇండియన్‌ సీడ్స్‌ యాక్ట్‌  కింద కేసు నమోదు చేసే యోచనలో ఉన్నట్లు ఆమె తెలిపారు. విజిలెన్స్‌ దాడుల్లో ఎస్సై మస్తాన్‌వలి, ఒంగోలు ఏసీటీవో ప్రసాదరావు, ఎఫ్‌ఐలు ఉమామహేశ్వరరావు, ముస్తాఫా, సిబ్బంది రామానాయుడు, ప్రసాద్‌  ఉన్నారు.

కొన్నేళ్లుగా సాగుతున్న దందా...

వేరుశనగ పప్పు వ్యాపారం పేరుతో చీరాలలో పదుల సంఖ్యలో మిల్లులు ఏర్పాటు చేసి ఈ అక్రమ వ్యాపారాన్ని నిరాటంకంగా నిర్వహిస్తున్నారు. కొందరు అధికారులకు మామూళ్లు అందిస్తూ ఈ దందాను నిర్వహిస్తున్నారు. కనీస అనుమతులు లేకుండా మిల్లులు ఏర్పాటు చేసి పలు జిల్లాల్లో రైతుల నుంచి  వేరుశనగకాయలు కొనుగోలు చేస్తారు. కూలీల ద్వారా పప్పును వేరు చేసి తెనాలి, విజయవాడ ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అయితే వీటికి అనుమతి లేకపోవడంతో పాటు సేల్స్‌ ట్యాక్స్‌ కూడా కట్టకపోవడం గమనార్హం. ఇతర వాహనాల్లో పంపితే పన్నులు వసూలు చేస్తారని పార్శిల్‌ లారీల్లో పంపుతున్నారు. లారీలో కొంత భాగం వరకు వేరుశనగ బస్తాలు వేసి మిగిలిన దానిలో ఇతర పార్శిల్‌ వస్తువులు వేసి విజయవాడ పంపుతున్నారు. ఎటువంటి పన్ను లేకుండానే జిల్లాలు దాటిస్తున్నారు. రోజుకు లక్షల్లో ఈ దందా కొనసాగుతోంది. సేల్స్‌ టాక్స్‌ అధికారులు కూడా చూసిచూడనట్లు ఉండడంతో వేరుశనగపప్పు వ్యాపారం మూడు పప్పులు ఆరు కాయలుగా సాగుతోంది. 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top