మేయరా.. మోనార్కా!?

మేయరా.. మోనార్కా!? - Sakshi


 


  •  మేయర్ తీరుపై కార్పొరేటర్ల గుర్రు

  •  సమోసాలు తినేందుకేనా స్టాండింగ్ కమిటీ

  •  చిన్నబుచ్చడమేనా ‘పెద్దరికం’


 

విజయవాడ : ఏమ్మా.. స్టాండింగ్ కమిటీలో ఏదో వచ్చేస్తోంది అనుకోవద్దు. సమోసాలు తిని వెళ్లేందుకే ఈ మీటింగ్.. చాయ్ తాగి, సమోసాలు తినేందుకే అయితే స్టాండింగ్ కమిటీ సమావేశాలెందుకు అన్నది స్టాండింగ్ కమిటీ సభ్యుల ప్రశ్న.

 

జీతాలు చాలకపోతే వెళ్లిపోండి. రెండేవేలకు పని చేసేందుకు ఏఎన్‌ఎంలు వస్తారని అన్నా. అంటే మీరు పేపరోళ్లకు చెబుతారా. ఆందోళన చేస్తే జీతాలు రావు. అర్బన్ హెల్త్ సెంటర్ల సిబ్బందిపై కస్సుబుస్సు..


 


మాట్లాడింది చాల్లే అమ్మా.. కూర్చో, కూర్చుంటారా సభ నుంచి బయటకు పంపేయమంటారా? కౌన్సిల్ సమావేశంలో ప్రతిపక్ష సభ్యులకు ఇచ్చే వార్నింగ్.


ఏం కమిషనర్ మాటే వింటారా? నా దగ్గరకు వచ్చే పన్లేందా. మీరు సమావేశంలో ఉండొచ్చు. ఇంకెక్కడైనా ఉండొచ్చు. పిలిస్తే రావాలికదా. ఓ ముఖ్య అధికారిపై కన్నెర్ర వివిధ సందర్భాల్లో మేయర్ వ్యవహారశైలి ఇది...

 

నగరపాలక సంస్థలో మేయర్ కోనేరు శ్రీధర్ ఏకపాత్రాభినయంపై నిరసన వెల్లువెత్తుతోంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయిన తమను డమ్మీల్ని చేస్తూ అంతా నా ఇష్టం అన్న చందంగా మేయర్ వ్యవహారశైలి మారిందని టీడీపీ కార్పొరేటర్లే ధ్వజమెత్తుతున్నారు. పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసి అమీతుమీ తేల్చుకొనేందుకు సిద్ధమవుతున్నారు. రెండు రోజుల క్రితం స్టాండింగ్ కమిటీ సమావేశంలో మేయర్ వ్యవహరించిన తీరుపై సభ్యులు గుర్రుగా ఉన్నారు. సమావేశానికి ముందు ఓ సభ్యురాలు చాంబర్‌కు వెళ్లగా స్టాండింగ్ కమిటీలో ఏదో వచ్చేస్తోంది అనుకోవద్దని, సమోసాలు తిని వెళ్లేం దుకు తప్ప ఎందుకు ఉపయోగం ఉండదని మేయర్ అనడంపై ఆమె మనస్తాపానికి గురయ్యారు. ఈ విషయాన్ని తోటి సభ్యులకు చెప్పి వాపోయారు. నగరపాలక సంస్థ ఆప్స్ కాంట్రాక్ట్‌ను కోడ్‌ట్రీ టెక్నాలజీస్‌కు రూ.27.36 లక్షలు కట్టబెట్టే విషయంలో చర్చకు సభ్యులు పట్టుబట్టగా మేయర్ ఏకపక్షంగా టెండర్‌ను ఆమోదిస్తూ తీర్మానం చేయడంలో ఆంతర్యమేమిటని సభ్యులు ప్రశ్నిస్తున్నారు.

 

కోటరీకే ప్రాధాన్యం

మేయర్ కీలక నిర్ణయాలు తీసుకొనే సందర్భంలో కోటరీకే ప్రాధాన్యత ఇస్తూ తమను పక్కకు నెట్టేస్తున్నారని పలువురు కార్పొరేటర్లు పేర్కొంటున్నారు. మూడు నెలలకు ఒకసారి జరిగే కౌన్సిల్ సమావేశాల్లో సైతం తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదనే ఆవేదనను జూనియర్ కార్పొరేటర్లు వ్యక్తం చేస్తున్నారు. కొందరికి ‘లబ్ధి’ చేకూర్చేలా మేయర్ నిర్ణయాలు ఉంటున్నాయన్నది టీడీపీ కార్పొరేటర్ల వాదన.  

 

చిన్నబుచ్చుతున్నారు

కౌన్సిల్ సమావేశాల అజెండాలో ఎన్ని అంశాలు ఉన్నప్పటికీ ఒక్క రోజులో అయిపోవాలనే విధంగా మేయర్  తీరు ఉంటుందని, దీనివల్ల ప్రధాన అంశాలపై సమగ్ర చర్చ జరగడం లేదన్నది పలువురి సభ్యుల అభిప్రాయం. తమ ప్రశ్నలకు అధికారులతో సమాధానం చెప్పించాల్సి ఉండగా మేయరే జోక్యం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఇబ్బందికరంగా ఉందని కార్పొరేటర్లు పేర్కొంటున్నారు. ప్రశ్నోత్తరాల నుంచి తీర్మానాల వరకు అంతా గందరగోళంగా సాగుతోందన్నది సభ్యుల ఆరోపణ. అజెండా లో చేర్చాల్సిన ప్రతిపాదనల్లోనూ కోతలు వేయడాన్ని తప్పుబడుతున్నారు. నగరపాలక సంస్థకు ‘పెద్ద’లా వ్యవహరించాల్సిన మేయర్ తమను ‘చిన్న’బుచ్చడంపై అధికారపార్టీ సభ్యులు మనస్తాపానికి గురవుతున్నారు.

 

 హైకమాండ్‌కు ఫిర్యాదు చేస్తాం

 - స్టాండింగ్ కమిటీ సభ్యులు

నగరపాలక సంస్థ మేయర్ కోనేరు శ్రీధర్ వ్యవహారశైలిపై హైకమాండ్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు స్టాండింగ్ కమిటీ సభ్యులు, కార్పొరేటర్‌లు కాకు మల్లిఖార్జున యాదవ్, కొరకాని అనూరాధ, నాగోతు నాగమణి స్పష్టం చేశారు. ప్రజాఫిర్యాదుల కమిటీ హాల్లో శుక్రవారం వారు విలేకర్లతో మాట్లాడారు. స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో తమను ఉత్సవ విగ్రహాలను చేస్తున్నారన్నారు. అధికారులను తాము ప్రశ్నిస్తే మేయర్ ఎందుకు సమాధానమిస్తున్నారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు.

 

నగరపాలక సంస్థ ఆప్స్ కాంట్రాక్ట్‌పై సమగ్ర చర్చ జరగాల్సి ఉండగా ఆమోదించాననే ఒక్క మాటతో మేయర్ తేల్చేశారన్నారు. గంటలో సమావేశం పూర్తి చేయాలనే హైరానా తప్ప స్టాండింగ్ కమిటీలో సమగ్ర చర్చ జరగడం లేదని తెలిపారు. కబేళాలో కోటి రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన మిషన్‌ను వాడకుండా పక్కన పడేశారని కాకు పేర్కొన్నారు. ఆప్స్ కాంట్రాక్ట్‌ను ఐదుగురు సభ్యులు ఆమోదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. మేయర్‌పై తమకు వ్యక్తిగత ద్వేషం లేదని, కార్పొరేటర్లకు కనీస గౌరవం ఇవ్వాలన్నదే తమ వాదన అన్నారు.

 

మేయర్ నియంతలా వ్యవహరిస్తున్నారు

-వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ పుణ్యశీల

విజయవాడ సెంట్రల్ : మేయర్ కోనేరు శ్రీధర్ నియంతలా వ్యవహరిస్తున్నారని నగరపాలక సంస్థ వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ బండి నాగేంద్ర పుణ్యశీల దుయ్యబట్టారు. శుక్రవారం తన చాంబర్లో విలేకర్లతో మాట్లాడారు. కౌన్సిల్‌లో ప్రతిపక్షాల గొంతునొక్కుతున్న మేయర్ స్టాండింగ్ కమిటీలో సొంతపార్టీ వారికి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. గుట్టుగా పాలన సాగిద్దామనుకుంటే కుదరదని, ప్రతి సభ్యుడికి స్వతంత్రంగా అభిప్రాయాలు తెలియజేసే అవకాశం ఉందన్న విషయాన్ని మేయర్ గుర్తిస్తే మంచిదని ఆమె పేర్కొన్నారు. రాజ్యాంగం దేశానికి బైలా లాంటిదంటూ ప్రసంగం చేసిన మేయర్ ప్రజాప్రతినిధులకు మాట్లాడే స్వేచ్ఛను ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు.



స్టాండింగ్ కమిటీ సభ్యుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా యాప్స్ కాంట్రాక్ట్‌ను ఎం దుకు ఆమోదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. స్టాండింగ్ కమిటీని, కౌన్సిల్‌ను అడ్డుపెట్టుకొని మేయర్ దోచుకుంటున్నారని ఆరోపించారు. కనకదుర్గ సొసైటీ లే అవుట్ అప్రూల్ విషయంలో మేయర్ తొందరపాటు నిర్ణయం వెనుక కాసుల కక్కూర్తి ఉందన్నారు. సొంతపార్టీ సభ్యుల నుంచే వ్యతిరేకత ఎదుర్కొంటున్న శ్రీధర్ నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్ దాసరి మల్లీశ్వరి పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top