గెలవడం కష్టమే


చేతులెత్తేసిన అధికారపార్టీ నేతలు

– పట్టభద్ర ఎన్నికల్లో మింగుడుపడని అభ్యర్థి వ్యవహార శైలి

- కొంపముంచనున్న ప్రలోభాల పర్వం

– నేరుగా అధిష్టానానికి నివేదిక అందజేత

- కలిసికట్టుగా వైఎస్‌ఆర్‌సీపీ నేతల ప్రచారం

 

సాక్షి ప్రతినిధి, కర్నూలు: పట్టభద్ర ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు చేతులెత్తేశారు. ఈ ఎన్నికల్లో మనం గెలవలేమని తేల్చిచెబుతున్నారు. ఇదే విషయాన్ని నేరుగా అధిష్టానానికి నివేదిక రూపంలో అందజేసినట్టు తెలిసింది. ఇందుకు ప్రధాన కారణం అభ్యర్థి వ్యవహారశైలి అంటూ వివిధ ఆధారాలతో ఈ నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ అంశంపై దిద్దుబాటు కూడా సాధ్యం కాదని ఖరాఖండిగా తేల్చిచెప్పినట్టు అధికారపార్టీ నేతలు వివరిస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రం కలిసికట్టుగా ముందుకు సాగుతోందని కూడా ఈ సందర్భంగా పేర్కొనడం గమనార్హం. ఈ నేపథ్యంలో నేరుగా అధిష్టానం రంగంలోకి దిగినప్పటికీ ఎలాంటి ఫలితం ఉండదని అధికారపార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీలు మూకుమ్మడిగా స్పష్టం చేసినట్టు తెలిసింది. దీంతో పాటు బ్యాగ్‌లపై ఫొటోలతో అధికార పార్టీ అభ్యర్థి ఓటర్లను ప్రలోభ పెడుతున్న వైనంపైనా ఎన్నికల సంఘం కూడా దృష్టి సారించినట్టు తెలిసింది. ఇదే జరిగితే తిప్పలు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

 

అధిష్టానానికి ఫిర్యాదు

అభ్యర్థి వ్యవహరిస్తున్న తీరుపట్ల అధికార పార్టీ నేతలందరూ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. పోటీలో నిలిచిన అభ్యర్థి వ్యవహరిస్తున్న తీరుతో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రధానంగా ఎమ్మెల్యేలే ఈ రకమైన ఫిర్యాదులు చేయడంతో ఏమి చేయాలో తెలియక అధిష్టానం తలలు పట్టుకుంటోంది. మొత్తం వ్యవహారంపై ఇన్‌చార్జి మంత్రి కనీసం ఎప్పటికప్పుడు దృష్టి సారించలేదని కూడా అధికారపార్టీ నేతలే మండిపడుతున్నారు. ఇన్‌చార్జి మంత్రిగా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి తప్పులు సరిదిద్దే బదులుగా.. కనీసం పట్టించుకోలేదని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇన్‌చార్జి మంత్రి వ్యవహారంపై అధిష్టానం కూడా గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. 

 

కలిసికట్టుగా వైఎస్‌ఆర్‌సీపీ

మరోవైపు ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు అందరూ కలిసికట్టుగా అభ్యర్థి గోపాల్‌ రెడ్డి కోసం పనిచేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థితో పాటు తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ప్రత్యేక హోదా డిమాండ్‌ నేపథ్యంలో చదువుకున్న పట్టభద్ర ఓటర్లు తమకే పట్టం కడతారని భావిస్తున్నారు. ప్రధానంగా ప్రత్యేక హోదా డిమాండ్‌ను బలంగా వినిపిస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వైపు చదువుకున్న ఓటర్లు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. అంతేకాకుండా ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో గోపాల్‌ రెడ్డి చూపిన చొరవ కూడా ఆయనకు ప్లస్‌ పాయింట్‌గా మారిందనే అభిప్రాయం ఆ పార్టీలో వ్యక్తమవుతోంది.

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top