రోజులో లక్ష మందికి దర్శనం సాధ్యమా?

రోజులో లక్ష మందికి దర్శనం సాధ్యమా? - Sakshi


♦ రికార్డుల కోసం భక్తులకు నరకం చూపిస్తున్న అధికారులు

♦ దారి తప్పిన మూడు క్యూల విధానం

♦ ఊపిరాడక అవస్థలు పడుతున్న భక్తులు  

♦ లక్ష దాటించాలని చూస్తే తొక్కిసలాటలు తప్పవంటున్న నిపుణులు

 

 సాక్షి, తిరుమల: వెంకన్న సాక్షిగా.. తిరుమల ఆలయ నిర్మాణం, నిత్య పూజా, కైంకర్యాల పరంగా ఒక రోజులో లక్ష మంది భక్తులకు స్వామివారి దర్శనం కల్పించే పరిస్థితుల్లేవు. అయినా పదే పదే లక్ష మందికిపైగా దర్శనం కల్పించామని ఇటీవల ఆలయ అధికారులు గొప్పలు చెబుతున్నారు. ఈ రికార్డు కోసం భక్తులకు నరకం చూపిస్తూ ఆలయంలో గెంటేసే పరిస్థితులు పెరిగిపోయాయి.



 తోపులాటల మధ్య 90 వేలకు మించే ప్రశ్నేలేదు

 ఆలయంలో గతంలో అమలయ్యే క్యూల ప్రకారం రోజుకి కులశేఖరపడి నుంచి అయితే 27 వేలు, రాములవారి మేడ నుంచి అయితే 45వేలు (లఘుదర్శనం), జయవిజయులు నుంచి అయితే 90 వేల మందికి(మహాలఘు) దర్శనం కల్పించేవారు. సామూహికంగా కల్పించే దర్శన విధానం వల్ల తీవ్రస్థాయిలో తోపులాటలు, రోదనలతో భక్తులు స్వామిని దర్శించుకునేవారు. తోపులాటలు తగ్గించేందుకు గంటామండపంలో 2013లో మూడు క్యూల విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఇక్కడ 12 ఇంచ్‌లు, 6 ఇంచ్‌లు, నేలమీద అన్నట్టుగా 3 క్యూలను ఏర్పాటు చేశారు. ఒక్క సెకను కూడా భగవంతుణ్ని చూసే అవకాశం ఇవ్వడం లేదని భక్తులువాపోతున్నారు.



 దారితప్పిన మూడు క్యూల విధానం: రద్దీ రోజుల్లో 90 వేల వరకు దర్శనం కల్పించే పరిస్థితి నుంచి మూడు క్యూల విధానంతో ఈ సంఖ్య 60 వేల నుంచి 70 వేల వరకు వచ్చింది. ప్రస్తుత టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు మూడు క్యూల విధానంలోని నిటారుగా ఉండే బల్లల్ని ఏటవాలు(ర్యాంపు పద్ధతి)గా మార్చడంతో ఈ సంఖ్య 80 వేల దాకా పెరిగింది. అంతవరకు బాగానే ఉంది. ప్రస్తుత ఆలయ అధికారులు రికార్డుల వేటలో పడ్డారు. ఫలితంగా మూడు క్యూల విధానంలోని భక్తులను కూడా ఇష్టానుసారంగా లాగేస్తున్నారు.



ఎంత లాగినా మరో 5 నుంచి 10 వేలలోపే భక్తులకు దర్శనం కల్పించగలుగుతున్నారు. 90 వేలకు మించకపోయినా లక్ష మార్కును అధిగమించామని డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ లెక్కలు వెల్లడించారు. వాస్తవానికి ఈ 90 వేల మంది భక్తుల్లో ఎక్కువ మందికి స్వామి దర్శనం కంటే నరకం చూస్తున్నారు. 80 వేల నుంచి 90 వేలలోపు భక్తులకే ఇలాంటి ఇబ్బందులుంటే ఈ సంఖ్య లక్ష దాటించాలని చూస్తే తొక్కిసలాటలు జరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  



 రికార్డుల కోసం స్వామి కైంకర్యాల్లోనూ కోత: రద్దీ పేరుతో రికార్డు సంఖ్యలో భక్తులకు దర్శనం సంకల్పంతో అధికారులు సాక్షాత్త్తూ దేవదేవుడి నిత్యకైంకర్యాలకు ఎసరు పెడుతున్నారు. ఆగమ నిబంధనల ప్రకారం గరిష్టంగా 8, కనిష్టంగా 6 గంటల పాటు స్వామికి కైంకర్యాలు, విరామం ఉండాలి. ఆ సమయం 2 గంటలకు తగ్గించటం సాంప్రదాయం కాదని పండితులు చెబుతున్నారు.

 

 ప్రస్తుతం రోజులో సుమారు 20 గంటలపాటు స్వామి వారి దర్శనం భక్తులకు కల్పిస్తున్నారు. ఇందులో మధ్య మధ్యలో స్వామి వారికి విరామం సమయం ఉంటుంది. ఈ మొత్తం సమయంలో వీఐపీ దర్శనానికి రెండు గంటలు కేటాయిస్తున్నారు. ఈ సమయంలో సామాన్య భక్తులకు దర్శన భాగ్యం ఉండదు. వీఐపీ దర్శనం మొదటి ప్రాధాన్యతలో గంటకు సుమారు 150 మంది, రెండో ప్రాధాన్యతలో 250 మంది, మూడో ప్రాధాన్యతలో 350 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. మిగతా 18 గంటలు సామాన్య భక్తులకు కేటాయిస్తున్నారు. సామాన్య భక్తులు గంట సమయంలో దాదాపు 4 వేల మంది శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు. ఈ లెక్కన రోజులో స్వామి వారిని దర్శించుకునే వీఐపీలు, సామాన్య భక్తుల సంఖ్య 70 నుంచి 80 వేల మధ్యనే ఉంటుంది. 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top