ఒకేసారి నాలుగు వాహనాలు ఢీ

ఒకేసారి నాలుగు వాహనాలు ఢీ - Sakshi

ఐదుగురికి తీవ్రగాయాలు

ఏలూరు ఆశ్రం వద్ద ప్రమాదం

జాతీయ రహదారిపై భారీగా నిలిచిన వాహనాలు 

ఏలూరు రూరల్‌: ఏలూరు ఆశ్రం ఆస్పత్రి వద్ద జాతీయ రహదారిపై వాహనాలు బీభత్సం సృష్టించాయి. ఒకేసారి నాలుగు వాహనాలు ఢీకొనడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు పరుగులు తీశారు. ఈ భయంకర ప్రమాదం బుధవారం ఏలూరు ఆశ్రం ఆస్పత్రి వద్ద జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. లారీ, కారుతో పాటు రెండు ఆర్టీసీ బస్సులు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఓ బైక్‌ బస్సు చక్రాల కింద నలిగిపోయింది. ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. సినిమా ఫక్కీలో జరిగిన ఈ ప్రమాదంతో స్థానికులు ఉలిక్కిపాటుకు గురయ్యారు. వివరాలిలా ఉన్నాయి.. మధ్యాహ్నం 12 గంటల సమయంలో జాతీయ రహదారిపై ఏలూరు నుంచి తణుకు వెళుతున్న పల్లెవెలుగు బస్సు ఆశ్రం ఆస్పత్రి కూడలి వద్ద మలుపు తిరుగుతోంది. అదేసమయంలో జాతీయ రహదారిపై విశాఖ వైపు వెళ్లే కంటైనర్‌ వస్తోంది. దీనిని గమనించని బస్సు డ్రైవర్‌ బస్సును తణుకు వైపునకు తిప్పడంతో కంటైనర్‌ డ్రైవర్‌ వాహనాన్ని అదుపుచేసే క్రమంలో ఓ కారును ఢీకొట్టి బస్సు వెనుక భాగంలో ఢీకొన్నాడు. దీంతో ముందుకు జరిగిన పల్లెవెలుగు బస్సు ఓ బైక్, మరో బస్సును ఢీకొట్టింది. బస్సు చక్రాల కింద పడి బైక్‌ నుజ్జునుజ్జయ్యింది. ఈ సమయంలో బస్సులోని ప్రయాణికులు, జాతీయ రహదారిపై వేచి ఉన్న ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. భీతావహ వాతావరణం నెలకొంది. ఈ ప్రమాదాల్లో కారు, బస్సుల్లో ప్రయాణిస్తున్న దెందులూరుకు చెందిన సీహెచ్‌ నరసింహనాయుడు, తల్లి, బిడ్డ అంబటి పుష్ప, అంబటి అభి, కాకానికి చెందిన ఉడత వెంకటరమణ, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాదాపు మూడు గంటలపాటు వాహనాలు స్తంభించాయి. ఏలూరు రూరల్, దెందులూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఆశ్రం కూడలి ప్రమాదాలకు నిలయంగా మారిందని  డ్రైవర్లు, ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించేలా రోడ్డును మరింత విస్తరించాలని కోరుతున్నారు. కంటైనర్‌ డ్రైవర్‌ సమయస్ఫూర్తిగా వ్యవహరించకుంటే పెను ప్రమాదమే జరిగేదని అంటున్నారు. 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top