మెుక్కలు నాటడం కన్నా సంరక్షించడమే గొప్ప

vanam - Sakshi

దర్శి : 

మొక్కలు నాటడం కంటే వాటిని సంరక్షించడమే గొప్పని రోడ్లు, భవనాలు,రవాణ శాఖల మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ హైస్కూల్‌లో వనం–మనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ అశోకుడిని ఆదర్శంగా తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా 13 జిల్లాల్లో మొక్కలు నాటిస్తున్నారని చెప్పారు. జిల్లాలో 10 లక్షలు, దర్శి నియోజకవర్గంలో 1.34 వేల మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. ఈ మధ్య ప్రజలు మొక్కలు నాటడం పూర్తిగా మరిచిపోయారన్నారు. ప్రస్తుతం 26 శాతం చెట్లు ఉన్నాయని, 56 శాతం ఉంటే సకాలంలో వర్షాలు పడటమేగాక ఉష్ణోగ్రతలు తగ్గి అనుకూల వాతావరణం ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో 250 కోట్ల తో రెండు లైన్ల రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు ప్రణాలికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు ఉన్నత విద్యే లక్ష్యంగా ఎడ్యుకేషన్‌ హబ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి శిద్దా వెల్లడించారు. చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం రావాలన్న లక్ష్యంతో దొనకొండను ఇండస్ట్రియల్‌ కారిడార్‌గా ప్రకటించినట్లు పునరుద్ఘాటించారు. ఒకటిన్నర సంవత్సరంలో అన్ని రకాల పరిశ్రమలు దొనకొండలో ప్రారంభిస్తారని చెప్పారు. 26 నెలల్లో వేలాది కోట్లతో రోడ్లు, రాజధాని నిర్మాణాలు, సంక్షేమం, అభివృద్ధి కోసం సీఎం పాటుపడ్డారని తెలిపారు. కలెక్టర్‌ సుజాతశర్మ మాట్లాడుతూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పండగలా చేయాలని సూచించారు. జిల్లాలో మొక్కలు నాటేందుకు పక్కా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటి పెంచి మహావృక్షాలుగా చేయాలని చెప్పారు. ఫారం పాండ్స్, ఇంకుడు గుంతలు వంటి కార్యక్రమాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు.

విద్యార్థుల అవస్థలు

ఉదయం పది గంటలకు రావాల్సిన మంత్రి శిద్దా రాఘవరావు మధ్యాహ్నం 12.30 గంటలకు వచ్చారు. స¿ý  పూర్తయ్యే సరికి 1.30 గంటలైంది. సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో ఉదయం పాఠశాల తెరిచే సమయానికే విద్యార్థులను మీటింగ్‌ ప్రాంగణంలోకి తరలించారు. గంటలు తరబడి ఎండకు టెంట్ల కింద అలాగే కూర్చోబెట్టారు. గాలాడక ఉక్క పోసి విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. మాజీ ఎంపీ కరణం బలరామకృష్ణమూర్తి విద్యార్థుల అవస్థలు గమనించి గాలాడక విసురుకునేందుకు కరపత్రాలు ఉపయోగపడుతున్నాయని చమత్కరించారు. వారి ఇబ్బందులు గుర్తించి ఆయన ప్రసంగం ఒక్క ముక్కలో ముంగించేశారు. విద్యార్థులకు మంత్రి చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, డ్వామా పీడీ పోలప్ప, ఆర్‌అండ్‌బీ బీఫ్‌ ఇంజినీర్‌ నాగరాజు, ఎస్‌ఈ రమేష్, డీఆర్‌డీఏ పీడీ మురళి, ఎంపీపీ సంజీవయ్య, జెడ్పీటీసీ సభ్యుడు స్టీవెన్, సర్పంచి గురవయ్య, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top