'ముద్రగడకు కేంద్రం రక్షణ కల్పించాలి'


- రాజ్యసభ మాజీ సభ్యుడు వీహెచ్ విజ్ఞప్తి

- కేంద్ర హోంమంత్రికి లేఖ రాసినట్లు వెల్లడి

- బాబుతో పాటు కేంద్రానిదీ బాధ్యతేనన్న వీహెచ్



కిర్లంపూడి (తూర్పుగోదావరి జిల్లా)
: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు ఏమైనా జరిగితే చంద్రబాబుతో పాటు కేంద్రమూ బాధ్యత వహించాల్సి ఉంటుందని రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు. ఆయనకు ఎలాంటి హాని జరగముందే కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో ముద్రగడను, కుటుంబ సభ్యులను గురువారం వీహెచ్ పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు.



గతంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వంగవీటి మోహన్‌రంగాను కొన్ని దుష్ట శక్తులు హత్య చేశాయన్నారు. ముద్రగడకు కూడా జరగరానిది జరిగితే కాపు జాతి తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. ఉద్యమనేతగా ముద్రగడకు హాని జరిగే అవకాశమున్నందున భద్రత కల్పించాలని కేంద్ర హోం మంత్రికి లేఖ రాసినట్టు తెలిపారు. ముద్రగడ ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా రాష్ట్ర ప్రజలకు సేవలందించారన్నారు. తునిలో కాపు ఐక్యగర్జన సందర్భంగా జరిగిన ఘటనల్లో అక్రమంగా అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని స్వగృహంలో శాంతియుతంగా దీక్ష చేస్తున్న ముద్రగడ, ఆయన కుటుంబసభ్యుల పట్ల పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించిన తీరు పాశవికమన్నారు.



కాపు ఓట్లతోనే ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు పదవి చేపట్టాక కాపులను అణగదొక్కేందుకు చూస్తున్నారని, దీనిలో భాగంగానే ముద్రగడను అణచివేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఎక్కడ తప్పు జరిగితే అక్కడ ఉంటానని చెప్పిన పవన్‌కళ్యాణ్ జాతి కోసం దీక్ష చేస్తున్న ముద్రగడ పట్ల ప్రభుత్వం దౌర్జన్యం చేసినా కనీసం నోరు మెదపకపోవడం దురదృష్టకరమన్నారు. గతంలో కాపుల కోసం ముద్రగడ ఉద్యమం చేస్తే అప్పటి ముఖ్యమంత్రి విజయభాస్కరరెడ్డి ఇచ్చిన జీఓ 30ని అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు.



రాష్ట్రం విడిపోయాక అధికారంలోకి రావడం కోసం కాపులను బీసీల్లో చేర్చుతానని చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలనే ముద్రగడ ఉద్యమం చేపట్టారన్నారు. ఉద్యమాన్ని అణగదొక్కే ప్రయత్నంలో ముద్రగడకు హాని తలపెట్టే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ముద్రగడకు రక్షణ కల్పించాలన్నారు. వీహెచ్ వెంట జిల్లా కాపు సద్భావన సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి యేసుదాసు, వైఎస్సార్ సీపీ నాయకుడు జి.వి.రమణ, మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ తనయుడు జి.వి.శ్రీరాజ్, వరిగేటి చరణ్ ఉన్నారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top