ఇంటిని ‘ఎత్తు’తున్నారు..

ఇంటిని ‘ఎత్తు’తున్నారు.. - Sakshi


చండ్రుగొండ (ఖమ్మం జిల్లా): పూర్వీకులు కట్టిన ఇల్లా.. భూమిలోకి కుంగిపోయిందా.. వర్షం వస్తే నీరు ఇంట్లోకి వస్తుదా.. అయితే ఫర్వాలేదు.. ఇంటిని పైకి ఎత్తుతామంటున్నారు హర్యానాకు చెందిన ఇంజినీరింగ్ నిపుణులు. ఖమ్మం జిల్లా చండ్రుగొండ మండలం అన్నపురెడ్డిపల్లి గ్రామంలో వేముల నగేష్ అనే వ్యాపారి తల్లిదండ్రులు కట్టిన ఇంట్లో ఉంటున్నాడు. ఇంటి ముందు వైపు రోడ్డు పెరగడంతో.. వర్షం వస్తే నీరు ఇంట్లోకి వస్తోంది. ఈ క్రమంలో నెట్‌లో డోంట్ వర్రీ, అప్ లిఫ్టింగ్ అండ్ షిఫ్టింగ్ బిల్డింగ్స్ అనే ప్రకటనను చూశాడు. వెంటనే ఫోన్‌లో హర్యానా రాష్ట్రంలోని యమున నగర్‌కు చెందిన బీఎల్‌ఆర్ ఇంజినీరింగ్ గ్రూప్, మామ్‌చంద్ అండ్ సన్స్ వారిని సంప్రదించాడు. అంతే వారు వచ్చి ఇల్లు చూసుకున్నారు. మూడు అడుగుల ఎత్తు పైకి ఎత్తేందుకు రూ. 3 లక్షలు మొత్తాన్ని ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. గురువారం పనులు ప్రారంభించారు. శుక్రవారం ఇంటిని పైకి ఎత్తే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.



200 జాకీలు..

ఇంటి చుట్టూ, మధ్య భాగంలోని గోడలన్నింటికీ సుమారు 200 జాకీలు అమర్చారు. మేనేజర్ గురుమాన్‌సింగ్ పర్యవేక్షణలో పది మంది జాకీలను ఒకదాని తరువాత మరో దాన్ని ఎత్తుకుంటూ వెళ్తున్నారు. దీంతో ఒక్కరోజులోనే నాలుగు గదుల ఇల్లు ఆరంగుళాలు పైకి లేచింది. 25 నుంచి 40 రోజుల్లో ఇల్లంతా మూడడుగులు ఎత్తు ఎత్తే విధంగా వారు ప్రణాళిక చేసుకున్నారు. ఖాళీ అవుతున్న ప్రదేశంలో కాంక్రీట్ నింపి ఇంటి కింది భాగంలోని బేస్‌మెంట్‌ను బలోపేతం చేస్తామని గురుమాన్‌సింగ్ ‘సాక్షి’కి తెలిపారు. రెండురోజులుగా సాగుతున్న ఈ ప్రక్రియను జనం తండోపతండాలుగా గ్రామానికి వచ్చి వీక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఇంటి యజమాని నగేష్ మాట్లాడుతూ.. ఎంత ఖర్చయినా.. అమ్మానాన్నలు కట్టిన ఇల్లు కూల్చకూడదనే భావనతోనే ఈ ప్రక్రియ ఎంచుకున్నట్లు చెప్పారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top