హోదాతోనే అన్నీ పరిష్కారం కావు

హోదాతోనే అన్నీ పరిష్కారం కావు - Sakshi


కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్య

 సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక హోదాతో ఆంధ్రప్రదేశ్‌కు మంచి జరుగుతుందనీ ఇందులో సందేహపడాల్సింది ఏమీ లేదని అయితే ప్రత్యేక హోదాతోనే రాష్ట్రంలో సమస్యలన్నీ పరిష్కారం కావని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణా హోటల్‌లో వ్యర్థాల నిర్వహణపై సీఐఐ నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రత్యేక హోదాపై అధ్యయనానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నీతి ఆయోగ్‌ను ఆదేశించారన్నారు. ప్రతిపక్షాలు ప్రత్యేక హోదాపై ఆరోపణలు చేయడం అర్థరహితమని దుయ్యబట్టారు. వ్యర్థాల నుంచి శక్తి ఉత్పత్తికి మరింత సాంకేతికత అవసరమని చెప్పారు. స్వచ్ఛ భారత్‌లో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని అప్పుడే సమాజం ఆరోగ్యవంతంగా మారుతుందని చెప్పారు.



తెలుగు రాష్ట్రాలు స్వచ్ఛ భారత్‌ను మెరుగ్గా నిర్వహిస్తున్నాయని ప్రశంసించారు. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తికి వచ్చే ఏడాది దేశ వ్యాప్తంగా 16 విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. అందులో భాగంగా నల్లగొండ, హైదరాబాద్‌లో విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అమృత్ పట్టణాల కింద తెలంగాణలో సిద్దిపేట, ఆంధ్రప్రదేశ్‌లో కావలి, శ్రీకాళహస్తిని ఎంపిక చేసినట్లు చెప్పారు. అమరావతిని ప్రత్యేక కేటగిరి కింద స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని ప్రభుత్వాలకు సంపూర్ణ సహకారం అందించాలని ఆయన కోరారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top