ఏం బాగా లేదు!

ఏం బాగా లేదు!


సభ ఏర్పాట్లపై టీఆర్‌ఎస్‌ అధిష్టానం అసంతృప్తి

ఉమ్మడి వరంగల్‌ జిల్లా నేతల తలోదారి

దగ్గర పడుతున్న బహిరంగ సభ తేదీ

హడావుడిగా వచ్చిన మంత్రి హరీష్‌రావు

నేడు అన్ని కమిటీలతో సమీక్ష




వరంగల్‌: టీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న బహిరంగసభ ఏర్పాట్లపై ఆ పార్టీ ఉమ్మడి జిల్లా నేతల వ్యవహారశైలి  అధిష్టానానికి ఇబ్బందికరంగా మారుతోంది. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు.. సభ ఏర్పాట్ల విషయంలో వ్యవహరిస్తున్న పట్టింపులేని వైఖరిపై టీఆర్‌ఎస్‌ అధిష్టానం అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. భారీ జన సందోహంతో అత్యంత అట్టహాసంగా బహిరంగసభ నిర్వహించాలని పార్టీ భావిస్తోంది. సమన్వయంతో పనిచేయాల్సిన ముఖ్య నేతలు వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యవహరిస్తుండడంపై నిఘా వర్గాల ద్వారా టీఆర్‌ఎస్‌ అధినాయకత్వానికి సమాచారం అందింది.



ముఖ్యంగా బహిరంగసభ వేదిక, సభా స్థలం ఏర్పాట్లపై అధిష్టానం అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. అధిష్టానం ఆలోచనకు, ఇక్కడి ఏర్పాట్లకు ఎక్కడా పొంతన కుదరడం లేదని తెలిసింది. బహిరంగసభ నిర్వహణ కోసం ఉమ్మడి జిల్లా నేతలతో ఏర్పాటు చేసిన కమిటీలు పనులను పట్టించుకోవడం లేదని తెలిసింది. మరోవైపు సభ నిర్వహణ సరిగ్గా ఎనిమిది రోజులే ఉంది. గడువు దగ్గరపడుతున్నా పనుల తీరు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో టీఆర్‌ఎస్‌ అధిష్టానం స్వయంగా దృష్టి పెట్టింది. వెంటనే పరిస్థితిని చక్కదిద్దాలని టీఆర్‌ఎస్‌ కీలక నేత తన్నీరు హరీష్‌రావును సీఎం కేసీఆర్‌ ఆదేశించినట్లు తెలిసింది.



ఈ మేరకు హరీష్‌రావు సోమవారం హడావుడిగా హెలికాప్టర్‌లో వరంగల్‌కు చేరుకున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో కలిసి మంత్రి హరీష్‌రావు మంగళవారం ఉదయం వరంగల్‌కు రావాల్సి ఉంది. బహిరంగసభ ఏర్పాట్ల తీరు ఆశించినదాని కంటే భిన్నంగా ఉండడంతో ఒక రోజు ముందుగానే ఆయన వరంగల్‌కు వచ్చారు. వచ్చిరాగానే సెక్యూరిటీ, పైలట్‌ వాహనాలు లేకుండానే ప్రకాశ్‌రెడ్డిపేటలోని బహిరంగసభ స్థలానికి చేరుకున్నారు. అన్ని వైపులను పరిశీలించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మంగళవారం ఉదయం వరంగల్‌కు రానున్నారు. అనంతరం ఇద్దరు మంత్రులు కలిసి... బహిరంగసభ నిర్వహణ కోసం ఏర్పాటైన కమిటీలతో సమీక్షలు జరపనున్నారు. జనసమీకరణపై ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా లక్ష్యాలు నిర్ణయించనున్నారు.



ప్రచార యావే...

రాజకీయ పార్టీల బహిరంగసభల నిర్వహణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. భారీ బహిరంగసభలను ఊహించిన దానికంటే ఎక్కువగా విజయవంతం చేయడం ఆ పార్టీ స్పెషల్‌. వరంగల్‌లోని ప్రకాశ్‌రెడ్డిపేట వేదికగా 2010 డిసెంబరు 16న టీఆర్‌ఎస్‌ నిర్వహించిన భారీ బహిరంగసభ రికార్డు పొందింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి 2010 తరహాలోనే బహిరంగసభను నిర్వహించాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. దీని కోసం ప్రత్యేకంగా కమిటీలను నియమించింది. ఈ కమిటీల్లోని నేతలు వ్యక్తిగత ప్రచారం కోసం ప్రయత్నించడం తప్పితే.. బహిరంగసభ నిర్వహణపై దృష్టి పెట్టడంలేదని టీఆర్‌ఎస్‌ ద్వితీయ శ్రేణి నేతలే అంటున్నారు.



ఎవరికివారు ప్రత్యేకంగా సమావేశాలు పెట్టడం, బహిరంగసభ వద్ద హడావుడి చేయడం, చివరికి ప్రెస్‌మీట్లలో ఒకరి కుర్చీలు మరొకరు తీసుకోవడం వరకు దిగజారుతున్నారని చెబుతున్నారు. ఇలాంటి విషయాలన్నీ టీఆర్‌ఎస్‌ అధిష్టానానికి చేరడం వల్లే పార్టీ ముఖ్య నేత హరీశ్‌రావు వచ్చారని పార్టీ నేతలు చెబుతున్నారు. హరీష్‌రావు రాకతో అయినా ప్రతిష్టాత్మక బహిరంగసభ ఏర్పాట్లపై ఉమ్మడి జిల్లా నేతల వ్యవహారశైలి మారుతుందా లేదా అనేది చూడాలి.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top