అకాల వర్షం

అకాల వర్షం - Sakshi


తడిసిముద్దయిన నగరం

అరగంటపాటు కురిసిన వాన

గాజువాకలో భారీ వర్షం

పలు ప్రాంతాల్లో నిలిచిన విద్యుత్‌ సరఫరా




విశాఖపట్నం: సంక్రాంతి పండుగకు ఊరెళ్లే ప్రయాణికులు.. కార్యాలయాల నుంచి ఇళ్లకు చేరుకుంటున్న ఉద్యోగులు..బంధు మిత్రులతో సాగర తీరంలో, షాపింగ్‌మాల్స్‌లో సందళ్లు, స్టార్‌ హోటళ్లు, రెస్టారెంట్లలో విందు భోజనాల హడావుడి.. వెరసి సంక్రాంతి  శోభతో కళకళలాడుతున్న నగరంపై ఒక్కసారిగా వర్షం విరుచుకుపడింది. గురువారం రాత్రి సుమారు అరగంటపాటు కురిసిన అకాల వర్షానికి నగరం తడిసిముద్దయ్యింది. ఎక్కడివారిని అక్కడే నిలబెట్టేసింది. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా కూడా నిలిచిపోయింది.  గాజువాక ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఓ వైపు వర్షం..మరోవైపు చీకట్లతో జనానికి కాసేపు ఏం చేయాలో అర్ధం కాలేదు. రోడ్లమీద నుంచి నీడ కోసం పరుగులు దీశారు. సరిగ్గా అరగంట పాటు కురిసిన వర్షానికి నగరంలోని రహదారులు చిత్తడిగా మారాయి. తెల్లవారితే భోగి పండుగ కావడంతో ముంగిట ముగ్గులు వేసిన మహిళల కష్టం వర్షార్పణమైపోయింది.



రంగు రంగుల రంగవల్లికలు వాన నీటిలో కొట్టుకుపోయాయి. పండుగ కారణంగా జోరుగా సాగుతున్న రోడ్డుపక్క చిరు వ్యాపారాలు చిందరవందరయ్యాయి. మరోవైపు అకాల వర్షం వల్ల వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని నగర వాసులు కలవరపడుతున్నారు. చాలా కాలంగా వాన జాడలేదు. కానీ గురువారం రాత్రి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అయినా వర్షం వస్తుందని ఎవరూ ఊహించలేదు. దీంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. ఫలితంగా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.  

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top