ఒకే గొడుగు కిందకు వర్సిటీలు

ఒకే గొడుగు కిందకు వర్సిటీలు


♦ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం

♦ ఇకపై అన్నింటికీ ఒకే చట్టం

♦ చట్టం రూపకల్పనకు ఉన్నత విద్యా మండలి కసరత్తు

 

 సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలూ ఇక ఒకే గొడుగు కిందకు రానున్నాయి. ఆ దిశగా తొలి అడుగు పడింది. అన్నింటికీ ఉమ్మడి చట్టాన్ని రూపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 15 విశ్వవిద్యాలయాలున్నాయి. మరొకటి.. ట్రైబల్ యూనివర్సిటీ రాబోతోం ది. ఈ క్రమంలో మొత్తంగా 16 విశ్వ విద్యాలయాలకు కొత్తగా ఉమ్మడి చట్టాన్ని రూపొం దించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్కో యూనివర్సిటీకి ఒక్కో రకమైన చట్టం ఉంది. ఇటీవల ఆయా చట్టాల్లో మార్పులు చేసింది.



ఛాన్స్‌లర్‌గా నిఫుణులను నియమించడంతోపాటు వైస్‌ఛాన్స్‌లర్లను ని యమించే అధికారాలను రాష్ట్ర గవర్నర్ పరిధి నుంచి తొలగించి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తెచ్చుకుంది. తాజాగా అన్నింటికి కలిపి ఒకే చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. కొత్త చట్టం రూపకల్పనకు అవసరమైన చర్యలను సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని తెలంగాణ ఉన్నత విద్యామండలిని ప్రభుత్వం ఆదేశించింది. వివిధ శాఖలు, యూనివర్సిటీల భాగస్వామ్యంతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. అన్ని యూనివర్సిటీల రిజిస్ట్రార్లతోపాటు న్యాయశాఖ అధికారులు, విద్యాశాఖ జాయింట్ సెక్రటరీ, హెల్త్, అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ యూనివర్సిటీ రిజిస్ట్రార్లకు భాగస్వామ్యం కల్పించింది.



దీంతో మంగళవారం తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆ కమిటీలోని సభ్యులు, అన్ని యూనివర్సిటీల రిజిస్ట్రార్లతో సమావేశం నిర్వహించింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగి న ఈ సమావేశంలో ప్రస్తుతం యూనివర్సిటీల పరిస్థితి, యూనివర్సిటీల వారీగా చట్టాల్లో ఉన్న లొసుగులు, కొత్త చట్టం తీరుతెన్నులపై చర్చించారు. గుజరాత్ తరహాలో ఈ చట్టాన్ని రూపొందించాలన్న నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు అగ్రికల్చర్, హెల్త్, వెటర్నరీ, హార్టికల్చర్, జేఎన్‌టీయూహెచ్, కాకతీయ, అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీల రిజిస్ట్రార్లతో సబ్ కమిటీని ఏర్పాటు చేశారు.



ఒక్కో వర్సిటీ ఒక్కో జాతీయస్థాయి సంస్థలైన యూజీసీ, ఎంసీఐ, ఏఐసీటీఈల నిబంధనలకు లోబడి పనిచేస్తున్నాయి. ప్రస్తుతం వాటి ప్రాథమిక నిబంధనల్లో మార్పులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అన్నీ ఒకే చట్టం కింద ఉండే విధంగా కొత్త చట్టాన్ని రూపొందించనున్నారు. ఈ నెల 31న జరిగే సబ్‌కమిటీ సమావేశంలో ఆయా అంశాలన్నింటిపై చర్చించి కొత్త చట్టానికి రూపలకల్పన చేసే అవకాశం ఉంది. మొత్తానికి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు చట్టాల్లో చేసిన మార్పుల మేరకు జాప్యం లేకుండా ఛాన్స్‌లర్లు, వైస్‌ఛాన్స్‌లర్ల నియామకాలు చేపట్టే వీలుందని మండలి ఛైర్మన్ పాపిరెడ్డి వెల్లడించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top